
న్యూఢిల్లీ: రాజ్యసభలో హాజరుశాతం తక్కువగా ఉండటంపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ (ఎన్‌సీబీసీ)కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదించే సమయంలో సభ్యులు గైర్హాజరవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రాజ్యాంగ (123వ సవరణ) బిల్లును సోమవారం ఆమోదించిన సమయంలో 156 మంది సభ్యులే సభలో ఉన్నారు.
‘చారిత్రక బిల్లును సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించాం. కానీ సభ మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? ఎంతమంది హాజరయ్యారు? 245 మంది సభ్యులకు గాను 156 మందే హాజరయ్యారు. ఒకరిద్దరు తగ్గినా బిల్లు పాసయ్యేది కాదు. అతి తక్కువ మెజారిటీతో బిల్లు ఆమోదం పొందింది’ అని అన్నారు. ఇలాంటి కీలక బిల్లుల ఆమోదం సమయంలో సభ్యులు తప్పకుండా హాజరయ్యేలా రాజకీయ పార్టీలు విప్‌లు జారీ చేయాలని వెంకయ్య అన్నారు.