
త్వరలోనే సర్దుకుంటుంది
భారత పర్యటనకు ముందు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను అత్యంత ప్రమాదకర బ్యాట్స్‌మన్‌గా అంతా భావించారు.
పేలవ ఫామ్‌పై ఆసీస్ ఓపెనర్ వార్నర్
రాంచీ: భారత పర్యటనకు ముందు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను అత్యంత ప్రమాదకర బ్యాట్స్‌మన్‌గా అంతా భావించారు. అయితే టెస్టు సిరీస్ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా అతడి బ్యాట్ నుంచి పెద్దగా పరుగులు వచ్చింది లేదు. ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి వార్నర్ చేసింది 131 పరుగులే. బెంగళూరు టెస్టులో చేసిన 33 పరుగులే ఈ సిరీస్‌లో అతడి అత్యధిక స్కోరు. అయితే తన బ్యాటింగ్ తీరులో ఎలాంటి లోపం లేదని, త్వరలోనే భారీ స్కోరు చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
‘నా ఆటలో ఎలాంటి లోపం లేదు. ఇంతకంటే బాగా నేను బంతిని బాదలేను. అయితే ప్రస్తుతానికి పరుగులు రావడం లేదు అంతే. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. నా సన్నాహకాల్లోనూ ఎలాంటి మార్పు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ స్థాయి క్రికెటర్‌కైనా ఇలాంటి స్థితి వస్తుంది. స్వదేశంలో కావచ్చు.. విదేశీ పర్యటనలో కావచ్చు ఫామ్ కోల్పోవాల్సి వస్తుంది. ఇదంతా క్రికెట్‌లో భాగమే. ఇలాంటి దశలోనే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలి’ అని వార్నర్ తెలిపాడు. చివరి టెస్టులో రెన్‌షాతో కలిసి శుభారంభాన్ని అందివ్వగలనని ఆశాభావం వ్యక్తం చేశాడు.