
సాక్షి ప్రతినిధి, విజయనగరం: చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలపై ఎన్నికల కమిషన్ వివరణ కోరడం తొందరపాటు చర్య అని, పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు కొత్తేమీకాదని మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి తొలినుంచి పంచాయతీ ఏకగ్రీవ ఎన్నికలు ఉంటున్నాయని తెలిపారు. విజయనగరంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. మంత్రి బొత్స మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువగా ఏకగ్రీవం అయితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. గత ఎన్నికలతో పోల్చితే ఒక శాతం మాత్రమే అదనంగా జరిగిన దానికే ఎన్నికల కమిషన్ ఎలా వివరణ కోరుతుందని ప్రశ్నించారు.
ఈ విషయాన్ని గుర్తించి ఎన్నికల కమిషన్ పునరాలోచించుకోవాలని అన్నారు. మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో గందరగోళం సృష్టించి, అశాంతి రేకెత్తించాలని ఎన్నికల కమిషన్ ప్రయత్నిస్తోందని అన్నారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.