AP Elections Boycott Against SEC Nimmagadda Ramesh Behavior In Nellore - Sakshi
Sakshi News home page

నిమ్మగడ్డ తీరుకు నిరసన.. ఎన్నికల బహిష్కరణ 

Published Tue, Feb 9 2021 6:11 AM | Last Updated on Tue, Feb 9 2021 11:49 AM

Election boycott against Nimmagadda Ramesh Behavior - Sakshi

కంపసముద్రం గ్రామం

సాక్షి, నెల్లూరు: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ వ్యవహార తీరుపై శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ పల్లె కన్నెర్ర చేసింది. ఈ ఎన్నికల కమిషనర్‌ ఆధ్వర్యంలో మా ఊళ్లో ఎన్నికలే జరగనివ్వబోమంటూ గ్రామస్తులు ఏకగ్రీవంగా ప్రకటించారు. నామినేషన్లన్నింటినీ సోమవారం ఉపసంహరించుకున్నారు. పళళంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలైతే ఆ మండల అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు ఏకగ్రీవాలను రద్దు చేస్తామన్న ప్రకటనలపై ఆ గ్రామస్తులు తమ నిరసనను ఈ రూపంలో వ్యక్తం చేశారు.  రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం కంపసముద్రం పంచాయతీ ప్రజలు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ వ్యవహార తీరును నిరసిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తీర్మానం చేసుకున్నారు. 2,500 మందికి పైగా జనాభా ఉన్న ఈ పంచాయతీలో 1,780 మంది ఓటర్లున్నారు. ఈ గ్రామంలో విద్యావంతులు అధికంగా ఉన్నారు. రాజకీయ పరిణితి ఎక్కువ. చాలామంది ఉన్నత చదువులు చదివి వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపారరీత్యా స్థిరపడ్డారు. ఈ గ్రామం మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కుటుంబానికి తోడుగా ఉంటుంది. ఆ గ్రామంపై ఉన్న మక్కువతో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రత్యేత దృష్టి సారించి తానే స్వయంగా దత్తత తీసుకుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించి ఆ గ్రామాభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు.  

28 మంది నామినేషన్ల ఉపసంహరణ 
ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్‌ పదవి బీసీ జనరల్‌కు కేటాయించారు. ఈనెల 13న ఎన్నికలు జరగాల్సి ఉంది. సర్పంచ్‌ పదవి కోసం 8 మంది, పది వార్డులకు 20 మంది నామినేషన్లు దాఖలు చేశారు. పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుని గ్రామాభివృద్ధికి ఐక్యంగా నడవాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. ఎన్నిక ఏకగ్రీవమైతే ఆ ప్రాంత అధికారులపై చర్యలతోపాటు ఏకగ్రీవాలను రద్దుచేస్తామంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ చేసిన ప్రకటన వారిని ఆవేదనకు, ఆగ్రహానికి గురిచేసింది. ఊరంతా ఓకే మాట, ఒకే బాటగా ఉండి ఏకగ్రీవమైనా ఎన్నికను రద్దుచేస్తే తమ మాటకు విలువ ఉండదని భావించారు. దీంతో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. నిమ్మగడ్డ ఎస్‌ఈసీగా ఉన్నంతకాలం స్థానిక ఎన్నికలను బహిష్కరించాలని తీర్మానం చేసుకున్నారు. సర్పంచ్, వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన 28 మంది ఉపసంహరించుకున్నారు. గతంలో కూడా పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకున్నారు. మల్లు రామిరెడ్డి, నారపరెడ్డి ఓబుల్‌రెడ్డి, పుట్టం సీతారామయ్య ఏకగ్రీవంగా సర్పంచ్‌లుగా ఎన్నికై గ్రామాభివృద్ధికి కృషిచేశారు. 

అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం 
గ్రామమంతా ఏకమై ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ ప్రతిపక్ష పారీ్టకి తొత్తులా వ్యవహరిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏకగ్రీవాలను రద్దుచేస్తామనటం మాకు ఆగ్రహం తెప్పించింది. అందుకే నిమ్మగడ్డ ఉన్నంతకాలం ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం. 
– మల్లు సుధాకర్‌రెడ్డి, కంపసముద్రం 

ఊరి మాటకు కట్టుబడి.. 
ఎస్‌ఈసీ నిమ్మగడ్డ చేసిన ప్రకటనపై ఊరంతా కలిసి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. గ్రామస్తులందరూ కలిసి తీసుకున్న ఉమ్మడి నిర్ణయంతో వేసిన నామినేషన్‌ విత్‌డ్రా చేసుకున్నాం. సర్పంచ్‌ పదవి బీసీలకు కేటాయించారు. 8 మందిమి నామినేషన్లు వేశాం. అందరం కలిసి విత్‌డ్రా చేసుకున్నాం. 
– చెవుల రమేష్, కంపసముద్రం  

ఒకే మాట.. బాట 
ఊరంతా ఒకే మాట, బాటగా ఉన్నాం. ఏకగ్రీవాలైతే రద్దుచేస్తామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ చేసిన ప్రకటన మాకు ఆగ్రహం కలిగించింది. ఊరంతా కలిసి తీసుకునే నిర్ణయానికి విలువ లేనప్పుడు ఎన్నికలు ఎందుకు జరుపుకోవాలి? అందుకే నిమ్మగడ్డ పదవిలో ఉన్నంతకాలం మేము ఎన్నికలకు దూరంగా ఉంటాం. 
– సన్నిబోయిన బాలకృష్ణ, కంపసముద్రం   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement