
భారత్ ప్రతిపాదన మేరకు ఐరాస సర్వసభ్య సమావేశం 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా..
రోమ్: అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం–2023 మంగళవారం అధికారికంగా ప్రారంభమైంది. ఇటలీలోని రోమ్‌లో ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎఫ్‌ఏవో ప్రధాన కార్యదర్శి క్యూ డోంగ్యు, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభతో పాటు ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వలిన్ హ్యుగ్స్ పాల్గొని ప్రత్యేక చిహ్నాన్ని ఆవిష్కరించారు. భారత్ ప్రతిపాదన మేరకు ఐరాస సర్వసభ్య సమావేశం 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
వాతావరణ మార్పుల్ని దీటుగా ఎదుర్కొని పౌష్టికాహార, ఆరోగ్య భద్రతను కలిగించే శక్తి చిరుధాన్యాలకు ఉందని.. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంలో వినియోగదారులు, రైతులు, పాలకులను చైతన్యపరిచి కార్యోన్ముఖుల్ని చేయటమే తమ లక్ష్యమని ఎఫ్‌ఏవో ప్రధాన కార్యదర్శి క్యూ డోంగ్యు ఈ సందర్భంగా అన్నారు. చిరుధాన్యాలు తరతరాలుగా భారతీయ సమాజానికి ఆహార భద్రతను కల్పిస్తున్నాయని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. మోదీ సందేశాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ చదివి వినిపించారు.
ఇదీ చదవండి: పని ప్రదేశాల్లో వేధింపులు ఎక్కువే: ఐక్యరాజ్యసమితి