
న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్‌ను రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్లు ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్) ప్రకటించింది. అదేవిధంగా, పార్టీకే చెందిన రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్, ఎన్‌డీ గుప్తాలకు మరో విడత ఎగువసభ సభ్యులుగా కొనసాగించాలని నిర్ణయించింది.
ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ మేరకు ప్రకటించింది. హరియాణా రాజకీయాల్లో కీలకంగా ఉండాలన్న రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ గుప్తా అభిప్రాయం మేరకు ఆయన స్థానంలో స్వాతి మలివాల్‌కు మొదటిసారిగా అవకాశం కల్పిస్తున్నట్లు ఆప్ పేర్కొంది.
ఆమె 2015లో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. పార్టీ నిర్ణయం మేరకు శుక్రవారం సాయంత్రం డీసీడబ్ల్యూ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీల్యాండరింగ్ ఆరోపణలపై ఆప్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయన వినతి మేరకు శుక్రవారం ప్రత్యేక కోర్టు..ఈ నెల 19న జరిగే రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు సంజయ్ సింగ్‌కు వెసులుబాటు కల్పించాలని జైలు అధికారులకు ఆదేశాలిచ్చింది.