
పట్నా: 2019లో కేంద్ర కేబినెట్‌లో తమ పార్టీకి నాలుగు బెర్తులు కేటాయించాలన్న తమ డిమాండ్‌ను బీజేపీ పట్టించుకోలేదని బిహార్ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. అందుకే, తాము కేబినెట్‌లో చేరకూడదని నిర్ణయించుకున్నామని చెప్పారు. ‘మాకు 16 మంది ఎంపీలున్నారు. అందుకే కేబినెట్‌లో కనీసం నాలుగు మంత్రి పదవులు కావాలని అడిగా. బీజేపీ ఇవ్వలేదు.
అదే బిహార్‌లోని ఐదుగురు బీజేపీ ఎంపీలను మంత్రులుగా తీసుకున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో చెడు సంకేతాలు ఇచ్చినట్లయింది. అందుకే, కేబినెట్‌లో చేరరాదని నిర్ణయించుకున్నాం’అని వివరించారు. గత ఏడాది తన మాజీ సన్నిహితుడు ఆర్‌సీపీ సింగ్‌ను తనకు చెప్పకుండానే కేబినెట్‌లో చేర్చుకున్నారని స్పష్టం చేశారు. అందుకే ఆరు నెలలకే రాజీనామా చేయించినట్లు వెల్లడించారు.