
శాసనసభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సభ్యులెవరూ ఆందోళన చెందవద్దు.. శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్య
2014 నుంచి 2023 వరకు ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా ఆచరిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: ‘‘శాసనసభ 2014 నుంచి 2023 వరకు ఏ సంప్రదాయాలను ఆచరించిందో ఇప్పుడు కూడా వాటినే ఆచరిస్తున్నం. అప్పటి నుంచి చట్టం మారలే.. న్యాయం మారలే.. స్పీకర్ పదవి, విప్ పదవి మారలే.. పాలకపక్షం, ప్రతిపక్షం అట్లనే ఉన్నాయి. రాజ్యాంగం అసలే మారలేదు. ఇంక ఎట్లొస్తయ్ ఉప ఎన్నికలు? సభ్యులెవరూ ఆందోళన చెందవద్దు..’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పార్లమెంటరీ వ్యవస్థలో పాటించిన పద్ధతులను పరిగణనలోకి తీసుకుని గతంలో అవలంబించిన విధానాలను అనుసరిస్తున్నట్టు చెప్పారు. వాటి ప్రకారం ఏ ఉప ఎన్నికలు రావని వ్యాఖ్యానించారు. బుధవారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చలో సీఎం రేవంత్ మాట్లాడారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘పార్టీ మారారా, మారలేదా అంటే మేం మారనే లేదు. అభివృద్ధిలో భాగంగా సీఎంని కలసి వచ్చామని కాంగ్రెస్‌లో చేరినవాళ్లు అంటున్నారు. మీరు మంత్రులు చేసినవాళ్లు అనర్హులు కాలేదు. ఉప ఎన్నికలు రాలేదు. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయని, వచ్చే వారమే ఉప ఎన్నికలని అంటున్నారు. ఎట్లా వస్తాయి? రూల్‌బుక్ వాళ్లే రాశారు. రూల్‌బుక్ కూడా మారలేదు కదా.
ప్రచారం కూడా చేసుకుంటున్నరు..
ఒకాయన (తాటికొండ రాజయ్య) నేనే అభ్యరి్థని అని ఆడ, ఈడ ప్రచారం చేసుకొంటున్నారు. ఆయన అమాయకుడు. తెల్లపంచె కట్టుకొని తిరుగుతున్నడని గతంలో ఉప ముఖ్యమంత్రి పదవినే ఊడబీకిన్రు. ఇప్పుడు ఆయన.. ఉప ఎన్నిక వచ్చింది. వచ్చే వారమే ఎలక్షన్ అని తిరుగుతున్నరు. సభ్యులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఏ ఉప ఎన్నికలు రావు. వారు (హరీశ్‌రావు) ఉప ఎన్నిక కోరుకున్నా కూడా రావు. ఒకవేళ ఆయన ఇటొచి్చనా, అటొచ్చినా కూడా ఏ ఉప ఎన్నికలు రావు.
సభకు కోర్టు నుంచి రక్షణ ఉంటుంది..
పార్టీ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో ఉంది. సభలో నేను మాట్లాడితే కొంత రక్షణ ఉంటుంది. బయట మాట్లాడేవాళ్లకు ఆ ప్రొటెక్షన్ ఉండదు. సభ బయట ఉప ఎన్నికలు వస్తాయని.. వచ్చే వారమే ఉప ఎన్నిక అని అంటున్నారు. అదంతా ఉత్తదే. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అభివృద్ధి మీదనే మేం దృష్టి పెట్టాం. ఎన్నికలు, ఉప ఎన్నికల మీద మాకు దృష్టి లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలి. తప్పు చేసినవాళ్లను శిక్షించాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయాలనేదే మా ఉద్దేశం..’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.