
దుబాయ్: కరోనా భయం, కుటుంబంపై బెంగ, సన్నిహితుల మరణం... ఐపీఎల్‌నుంచి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా అనూహ్యంగా తప్పుకోవడంపై ఇప్పటి వరకు వినిపించిన కారణాలు. అయితే ఇప్పుడు కొత్తగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. మామూలుగానైతే ఇది కూడా ఒక రకమైన పుకారులాగానే కనిపించేది కానీ స్వయంగా జట్టు యజమాని ఎన్. శ్రీనివాసన్ తాజా ఘటనపై స్పందించడంతో రైనా వ్యవహారంపై సందేహం రేగింది. ఒక జాతీయ పత్రిక కథనం ప్రకారం... దుబాయ్‌లో తనకు కేటాయించిన హోటల్ గది పట్ల రైనాలో కలిగిన అసంతృప్తే చివరకు ఇలా హఠాత్తుగా వెళ్లిపోవడానికి కారణమైందని తెలిసింది.
బయో బబుల్ వాతావరణంలో కఠిన నిబంధనలు పాటిస్తూ హోటల్‌లోనే ఆటగాళ్లు ఐసోలేషన్‌లో ఉండాల్సిన స్థితిలో తనకు ఇచ్చిన గది మొదటి రోజే రైనాకు నచ్చలేదు. కనీసం దానికి సరైన బాల్కనీ కూడా లేదని అతను అన్నట్లు తెలిసింది. చివరకు సరిగ్గా ధోనికిచ్చిన తరహా గది తనకు కావాలంటూ అతను కోరాడు. అయితే తగిన స్పందన రాకపోవడంతో చివరకు ధోనికే విషయం చెప్పాడు. ఈ విషయంలో తానేమీ చేయలేనన్న ధోని... రైనా ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేయలేదు. దాంతో ధోనిపై కూడా అసహనం కనబరుస్తూ రైనా ‘వ్యక్తిగత కారణాలు’ అంటూ స్వదేశం బయల్దేరిపోయాడు.
రైనా నిష్ర్కమణపై శ్రీనివాసన్ ఆగ్రహం
2008నుంచి నిషేధం ఎదుర్కొన్న రెండు సీజన్లు మినహా చెన్నై సూపర్ కింగ్స్‌కే ప్రాతినిధ్యం వహించిన రైనా ఇలా కీలక సమయంలో తప్పుకోవడంపై టీమ్ యజమాని ఎన్. శ్రీనివాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘క్రికెటర్లు కూడా పాత తరం సినిమా తరల్లాగే తమ గురించి తాము బాగా గొప్పగా ఊహించుకుంటారు. చెన్నై టీమ్‌లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేకుండా అంతా కుటుంబంలా ఉంటారు. నిజంగా నీకు అసంతృప్తి ఉంటే వెళ్లిపోవచ్చు. ఎవరినీ నేను బలవంత పెట్టను.
కొన్ని సార్లు విజయం తలకెక్కడం సహజం. నాకు ధోని రూపంలో బలమైన కెప్టెన్ ఉన్నాడు. అతనితో నేను మాట్లాడా. పరిస్థితి అంతా నియంత్రణలోనే ఉంది. ఒక వేళ మా జట్టులో కరోనా కేసులు పెరిగినా భయపడనవసరం లేదని చెప్పాడు. మా వద్ద ప్రతిభకు కొదవ లేదు. రైనా స్థానంలో సత్తా చాటేందుకు రుతురాజ్‌కు ఇది మంచి అవకాశం. అయినా ఇంకా ఐపీఎల్ మొదలే కాలేదు. భారీ డబ్బు (రూ. 11 కోట్లు)తో సహా తాను ఏం కోల్పోయాడో రైనా తర్వాత తెలుసుకుంటాడు’ అని శ్రీని అన్నారు.