
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూముల మార్ట్‌గేజ్ వ్యవహారం ధరణి పోర్టల్‌లో క్లిష్టతరమైంది. తనఖా పెట్టిన భూములను ఆ తనఖా విడిపించిన తర్వాత కూడా క్రయ, విక్రయ లావాదేవీలు జరుపుకునేందుకు ధరణి పోర్టల్ అనుమతించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత కూడా తమను డిఫాల్టర్లుగా చూపిస్తున్నారని వాపోతున్నారు. ఒక రైతు తన భూమిని బ్యాంకులు లేదా ఇతర సంస్థల వద్ద తనఖా పెట్టి తన అవసరాల కోసం రుణం తీసుకోవచ్చు. ఈ క్రమంలో సదరు భూమిని తమ వద్ద తనఖా పెట్టినట్టు ఆ భూమిని బ్యాంకులు మార్ట్‌గేజ్ చేసుకుంటాయి. ఈ మార్ట్‌గేజ్ డీడ్‌ను రెవెన్యూ వర్గాలు రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ఆ తనఖాకు చట్టబద్ధత లభిస్తుంది.
అలాంటి భూమిని ఇతరులకు అమ్ముకునే అవకాశం, లేదా మరోచోట తనఖా పెట్టే అవకాశం ఉండదు. అయితే, తీసుకున్న రుణాన్ని తిరిగి బ్యాంకులు లేదా ఇతర సంస్థలకు చెల్లించినప్పుడు రైతు ఆ మార్టిగేజ్ డీడ్‌ను రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా విడుదల చేసేందుకు రీకన్వేయన్స్ డీడ్ పేరుతో మరో రిజిస్ట్రేషన్ లావాదేవీ చేయాల్సి వస్తుంది. ఇలా రీకన్వేయన్స్ డీడ్ చేసుకునేంతవరకు ధరణి పోర్టల్ సహకరిస్తోందని, ఆ తర్వాతే తంటాలు వస్తున్నాయని రైతులు అంటున్నారు. ఒకసారి తనఖా పెట్టి విడిపించుకున్న భూమిని అమ్ముకునేందుకు వెళితే ఆ భూమి ఇంకా తనఖాలోనే ఉందని ధరణి పోర్టల్ చూపుతోందని వాపోతున్నారు.
సాంకేతిక సమస్య వల్లనే...
ఈ విషయమై రెవెన్యూ వర్గాలు స్పందిస్తూ రీకన్వేయన్స్ డీడ్ ఆప్షన్‌ను ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో ఇచ్చిందని, అయితే డీడ్ వచ్చినా ఆ భూమి తనఖాలోనే ఉన్నట్టు చూపిస్తుండటం కేవలం సాంకేతిక సమస్య మాత్రమేనని అంటున్నాయి. దీన్ని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయ స్థాయిలోనే పరిష్కరించి తమకు ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందని క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులు చెపుతున్నారు. అయితే, రాష్ట్రంలోని మొత్తం వ్యవసాయ భూముల్లో 10 శాతం వరకు భూములు పలు సందర్భాల్లో తనఖాకు వెళతాయని అంచనా. ముఖ్యంగా తోటల పెంపకందారులకు ఎక్కువ మొత్తంలో డబ్బులు అవసరం కనుక అదే భూమిని తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకుని తర్వాత ఆ రుణం తీర్చేస్తారు. కానీ, రుణం తీర్చిన తర్వాత కూడా సాగు భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.