
సాక్షి, వరంగల్: వరంగల్ కాకతీయ వైద్య కళాశాల పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ధారావత్ ప్రీతి కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆమెది ఆత్మహత్యేనని, ఆమె శరీరంలో పాయిజన్ ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం ప్రకటించారు. ప్రీతి మృతికి సీనియర్ విద్యార్థి డాక్టర్ సైఫ్ వేధింపులే కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతను బెయిల్‌పై ఇటీవలే బయటికి వచ్చాడు. డాక్టర్ ప్రీతిది హత్యేనని ఆమె కుటుంబసభ్యులు ప్రకటించడంతో ఈ కేసుకు మరింత ప్రాధాన్యత చోటుచేసుకుంది.
అయితే రెండు నెలలు గడుస్తున్నా పోలీసులు ప్రీతి కేసు విషయంలో ఎటూ తేల్చకపోవడంతో పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ‘సాక్షి’జిల్లా పేజీలో ‘ప్రీతి మృతిపై వీడని మిస్టరీ’శీర్షికన శుక్రవారం ప్రత్యేక కథనం కూడా ప్రచురితమైంది. దీంతో శుక్రవారం సాయంత్రం వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ప్రీతిది ఆత్యహత్యేనని ప్రకటించారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికల్లో ప్రీతి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆధారాలున్నాయని తెలిపారు. ప్రీతి ఆత్మహత్యకు డాక్టర్ సైఫ్ వేధింపులే కారణమన్నారు. ఘటనాస్థలిలో ఆత్మహత్యకు కారణమైన సిరంజీ ఉందని, సూది మాత్రం కనిపించలేదన్నారు. వారం, పది రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేస్తామని తెలిపారు.
సాక్షి వరంగల్ జిల్లా పేజీలో శుక్రవారం ప్రచురితమైన కథనం..
చదవండి: వీడిన సనత్ నగర్ బాలుడి హత్య కేసు మిస్టరీ.. అదే కారణం!