
సోనియాకు హేట్సాఫ్: బొత్స
పేదలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ ఒకటేనని ఆహార భద్రత చట్టంతో మరోసారి నిరూపితమయిందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు.
పేదలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ ఒకటేనని ఆహార భద్రత చట్టంతో మరోసారి నిరూపితమయిందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆహార భద్రత చట్టాన్ని దేశ చరిత్రలో మైలు రాయిగా ఆయన వర్ణించారు. ఈ చట్టాన్ని తీసుకువచ్చినందుకు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీలకు ఆయన అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
ఆహార భద్రత చట్టం పేదలకు వరమని బొత్స అన్నారు. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేతినిండా పని కల్పించిన యూపీఏ ప్రభుత్వం ఇప్పుడు ఆహార భద్రతతో పేదల ఆకలి తీర్చేందుకు ఆహార భద్రత చట్టం తెచ్చిందన్నారు. రాజకీయ కుట్రలతో దీన్ని అడ్డుకోవాలని చూసినా, ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించినా లెక్కచేయకుండా తమ పార్టీ ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని చెప్పారు.
బిల్లు ఆమోదం సందర్భంగా సోనియా గాంధీ చూపిన నిబద్దతను బొత్స ప్రశంసించారు. అనారోగ్యంతో ఉన్నా సోనియా లోక్సభకు హాజరయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సోనియా పట్టుదలకు, నిబద్దతకు హేట్సాఫ్ చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సంయమనం పాటించాలని కోరారు. ఒకరిపై ఒకరు దూషణలకు పాల్పడరాదని ఆకాంక్షించారు. రాష్ట్ర విభజనపై అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించలేదని తమ ప్రజల అభ్యర్థనను విన్పిస్తుమని వివరించారు.