
ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠ రేపుతున్న ఎన్నికలపై భారత నాస్తిక సమాజం ఆసక్తికర సవాల్ విసిరింది.
సాక్షి, విజయనగరం టౌన్: ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠ రేపుతున్న ఎన్నికలపై భారత నాస్తిక సమాజం ఆసక్తికర సవాల్ విసిరింది. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ముందుగానే చెప్పిన జ్యోతిష్యులకు రూ.5 లక్షలు బహుమతిగా అందజేస్తామని భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు టి.శ్రీరామ్మూర్తి, జిల్లా అధ్యక్షుడు వై.నూకరాజు శుక్రవారం ఒక ప్రకటనలో సవాల్ విసిరారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడనుండడంతో కొంతమంది జ్యోతిష్యం పేరిట ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారన్నారు.
రాజ్యాంగంలో ఆర్టికల్ 51 ప్రకారం ప్రజల్లో శాస్త్రీయ స్పృహను పెంపొందించడం ప్రతి భారతీయుని విధి అని, అందుకు విరుద్ధంగా కొందరు రాజకీయ నాయకులు, అధికారులు ప్రవర్తించడం శోచనీయమన్నారు. ఈ నెల 23న వచ్చే ఫలితాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ముందుగా చెప్పిన వారికి రూ.5 లక్షలు బహుమతి అందిస్తామన్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం అయ్యప్ప దేవాలయం ప్రధాన అర్చకుడు మురపాక కాళిదాస్ నాడీ జ్యోతిష్యం ప్రకారం వైఎస్సార్‌సీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని గతవారంలో చెప్పారని, ఆయన కూడా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. సందేహాలుంటే 94402 60280, 90106 96498 నంబర్లను సంప్రదించాలన్నారు.