
పిల్లలకు వివాహం నిర్ణయించేటప్పుడు పెద్దలు పాటించే ప్రామాణికాల్లో శీలం, వయస్సు, వ్యక్తిత్వం, అభిజనం తరువాత చివరిది లక్షణం. లక్షణం అంటే భౌతికమైన అందం. లోకంలో గుణాలు ఎంత గొప్పవో, అందం కూడా అంత గొప్పది. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి. రుక్మిణీదేవి శ్రీ కృష్ణ పరమాత్మను ఇష్టపడింది కేవలం ఆయన బాహ్య సౌందర్యం చూసి కాదు.
ఎన్నో గుణాలు వివరించి... ‘కృష్ణా! ఇన్ని గుణాలు నీలో ఉన్నాయి కాబట్టే నాకు నీవంటే అంత ప్రీతి’’ అని ఆమె ప్రకటించింది. భౌతికమైన అందం ఉండాలి. వధూవరులు ఒకరికి ఒకరు తగినవారయి ఉండాలి. నూతన దంపతులను చూసినప్పుడు ‘ఆ పిల్ల చేసుకున్న అదృష్టం’ అనో, ‘ఆ పిల్లవాడిది అదృష్టం అంటే’... అని అనకూడదు. ఒకరికొకరు సరిగ్గా సరిపోయారు’ అనాలి. ఆ తరువాత ప్రేమతో, ఆర్ద్రతతో గృహస్థాశ్రమాన్ని పండించుకోవడం ఆ దంపతుల వంతు.
దేవుడి విషయంలో అయినా సరే, ఇదే మర్యాద పాటిస్తారు. శంకరాచార్యులవారు శివానందలహరిలో పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యతను ప్రస్తావిస్తూ.. ‘‘ఆమె ఎంత తపస్సు చేసిందో ఈయనకు భార్య కాగలిగింది. ఈయన ఎంత తపస్సు చేసాడో అటువంటి భార్య లభించింది. అదీ దాంపత్యం అంటే. అలా అల్లుకుపోవాలని భగవంతుడే మనకు నేర్పాడు.
– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు