
ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఎలాంటి దీర్ఘవ్యాధుల బారినపడకుండా సాగే చక్కటి వృద్ధాప్య జీవితం కొనసాగించడం ఎలా అనేది శాస్తవేత్తలను వేధిస్తున్న చిక్కు ప్రశ్న. మనం తినే ఆహారం వృద్ధాప్యానికి ఏమైనా లింక్ ఉందా? అనే దిశగా విస్తృతమైన పరిశోధనలు చేశారు. అయితే దానికి తాజాగా చేసిన పరిశోధనల్లో సరైన సమాధానం దొరికిందని వెల్లడించారు శాస్త్రవేత్తలు. ఆహారం వృద్ధాప్యాన్ని ఎలా డిసైడ్ చేస్తుందో నిర్థారించామని చెప్పారు. కేవలం ఎక్కువ కాలం జీవించడమే లక్ష్యం కాదని మెరుగ్గా జీవించడమనేది అత్యంత ప్రధానమంటూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అవేంటో చూద్దామా..!.
నిపుణుల అభిప్రాయం ప్రకారం..సమతుల్య ఆహారం, దీర్ఘాయువు, మెదడు పనితీరుతో సహా మొత్తం ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుందని అన్నారు. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు మంటను తగ్గించడానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, శారీరక విధులకు మద్దతు ఇవ్వడానికి సహాపడతాయని చెప్పారు. అందుకోసం 30 ఏళ్ల లోపు వయసున్న దాదాపు ఒక లక్ష మందికి పైగా వ్యక్తుల ఆహారపు అలవాట్లను ట్రాక్ చేశామని చెప్పుకొచ్చారు.
వారంతా తీసుకున్న ఆహారం..అది వారి 70 ఏళ్ల వయసులోని ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో నిర్థారించామని చెప్పారు. ఆ క్రమంలోనే ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం తీసుకోవాల్సిన సరైన ఎనిమిది ఆహార విధానాలను కూడా గుర్తించామని తెలిపారు. దాన్ని ఆరోగ్యకరమైన సూచిక(AHEI)గా వర్గీకరించారు. ఈ విధమైన ఆహారాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా నొక్కి చెప్పారు శాస్త్రవేత్తలు.
ఆ ఆహారాలు ఏంటంటే..
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, చిక్కుళ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు(ఆలివ్ నూనె, చేప కొవ్వు) తదితరాలు మంచివని చెప్పారు. అదే సమయంలోఎరుపు మాంసం, ప్రాసెస్ చేసిన ఆహారాలు(జంక్‌ఫుడ్), శుద్ధిచేసిన ధాన్యాలు, అధిక సోడియం తదితరాలను నివారిస్తే మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలను పొందగలరని అన్నారు.
ఈ ఆహారపు అలవాట్లకు కాస్త దగ్గరగా ఉన్నవారు.. 70లలో మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకున్నట్లు వివరించారు. ఇలాంటి కొన్ని ఆరోగ్య సూత్రాలు ఆరోగ్యకరమైన జీవతానికి మద్దుతిస్తాయని చెప్పారు. అందుకోసం వివిధ రకాల రంగురంగుల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, అసంతృప్త కొవ్వులు తదితర ఆహారపు అలవాట్లు ప్రాధాన్యత ఇస్తే..70లలో ఏ చీకు చింతా లేకుండా హాయిగా వృద్ధాప్యాన్ని ఆస్వాదించగలుగుతారని అన్నారు పరిశోధకులు.
(చదవండి: పొట్ట ఫ్లాట్‌గా ఉండాలా..? ఐతే సాయంత్రం ఆరు తర్వాత ఆ ఆరు ఆహారాలను నివారించండి!)