
పెంపకంలో.. అవకాశాల్లో.. వేతనాల్లో లింగ వివక్ష క్రిస్టల్ క్లియర్! అది ధరల్లో కూడా ఉందన్న విషయం తెలుసా? అదీ స్త్రీ, పురుషులు ఇద్దరూ ఉపయోగించే ఒకే రకమైన వస్తువుల ధరల్లో! నిజం..!
కేవలం ప్యాకింగ్‌లో తేడా వల్ల పర్సనల్ హైజీన్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ నుంచి దుస్తుల దాకా మగవాళ్ల కన్నా మహిళలు ఎక్కువ ధర చెల్లించి కొంటున్నారు. దీన్ని పింక్ టాక్స్ అంటున్నారు. ఇద్దరూ వాడే ఒకేరకమైన ప్రొడక్ట్స్ మీద స్త్రీలు సగటున ఏడు శాతం అధికంగా చెల్లిస్తున్నారట. కేవలం పింక్ ప్యాక్‌లో ఉన్నందున రేజర్ బ్లేడ్స్ మీద 29 శాతం, బాడీ వాష్ మీద 16 శాతం ఎక్కువ వెచ్చిస్తున్నారట.
ఆ లెక్కన ఒకేరకమైన వస్తువులు,సేవల మీద పురుషుల కన్నా స్త్రీలు ఏడాదికి సగటున లక్ష రూపాయలు అధికంగా చెల్లిస్తున్నట్టు అంచనా. దీని మీద బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజూందార్ షా కూడా స్పందించారు. ‘పింక్ టాక్స్ అనేది లింగ వివక్షకే పరాకాష్ట. దీన్ని మహిళలు తీవ్రంగా పరిగణించాలి. ధరల్లో వ్యత్యాసమున్న అలాంటి ప్రొడక్ట్స్‌ను కొనకుండా ఆ వివక్షను వ్యతిరేకించాలి’ అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
పింక్ టాక్స్ అనేది మహిళల మీద ఆర్థిక భారాన్ని మోపడమే కాదు సమాజంలో ఇప్పటికే ఉన్న వివక్షను బలపరచే ప్రమాదాన్నీ సూచిస్తోందంటున్నారు సామాజిక విశ్లేషకులు. మార్కెట్‌లో ఏ తీరైనా.. ధోరణి అయినా న్యాయమైన ధరతో పాటు జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేసేట్టుగా, వివక్షతో కూడిన సామాజిక నియమాలను సవాలు చేసేట్టుగా ఉండాలి తప్ప వివక్షను ప్రేరేపించేట్టుగా ఉండకూడదని చెబుతున్నారు. ఈ పింక్ టాక్స్‌ను సవాలు చేయడానికి మన దగ్గర ప్రత్యేకమైన చట్టం లేక΄ోయినప్పటికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14.. రైట్ టు ఈక్వాలిటీ కింద కోర్ట్‌లో దావా వేయొచ్చు.
Pink Tax! A shameful gender bias that women must respond to by shunning such products! pic.twitter.com/U3ZQm2s7W9
— Kiran Mazumdar-Shaw (@kiranshaw) March 12, 2024
(చదవండి: భాషలోనూ వివక్ష ఎందుకు?)