
మీరు పరీక్ష హాలులో కూర్చున్నారు. ప్రశ్నపత్రం చేతిలో ఉంది, కానీ ఒక్క పదం కూడా గుర్తుకు రావడం లేదు! గుండె వేగంగా కొట్టుకుంటోంది, చెమటలు పట్టాయి, కాళ్లు చేతులు వణుకుతున్నాయి. ఏదైనా ప్రశ్నకు సమాధానం రాయాలని ప్రయత్నిస్తే, మెదడంతా ఖాళీగా మారిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కళ్ళల్లో నీళ్లు ఉబుకుతున్నాయి. ఇలాంటి పరిస్థితి మీకు ఎప్పుడైనా ఎదురైందా? దీన్నే ‘పెర్ఫార్మెన్స్ ఆంగై్జటీ’ అంటారు. మన మెదడులో ‘అమిగ్డాలా’ అనే చిన్న భాగం ఉంది. ఇది ప్రమాదాన్ని గుర్తించి మనల్ని ‘ఫ్లైట్ అండ్ ఫైట్’ మోడ్‌లోకి నెడుతుంది. పరీక్షల ముందు మనలో భయాన్ని, ఆందోళనను తీసుకొచ్చేది ఇదే! వాస్తవానికి పరీక్ష అనేది ప్రమాదం కాదు కదా. కానీ మన బ్రెయిన్ దీన్ని ఒక పోటీగా లేదా ముప్పుగా గుర్తిస్తే ఒత్తిడి పెరుగుతుంది. అయితే, ఇదే మెదడును సరైన మార్గంలో ప్రోగ్రామ్ చేసుకుంటే, పరీక్ష భయాన్ని ఓడించగలం! అందుకోసం కొన్ని సైకలాజికల్ టెక్నిక్స్ తెలుసుకుందాం.
1విజువలైజేషన్ టెక్నిక్
విజువలైజేషన్ అనేది ఓ శక్తిమంతమైన వ్యాయామం. పరీక్ష హాలులో ప్రశాంతంగా ఉండాలని అనుకుంటే, ముందే మిమ్మల్ని మీరు అక్కడ చూసుకోవడం ప్రారంభించండి. మీరు ప్రశాంతంగా ఉండి సమాధానాలు సరిగ్గా రాస్తున్నట్లు రోజుకు 5 నిమిషాల పాటు ఊహించండి. ఇది మీ మెదడును సానుకూలత వైపు మళ్లిస్తుంది. ఇది చేయడం చాలా సులువు.
కళ్లు మూసుకుని గాలి నెమ్మదిగా లోపలికి, బయటకు తీసుకోవాలి.
మీకు నచ్చిన ప్రశాంతమైన ప్రదేశాన్ని ఊహించండి.
మీరు ప్రశాంతంగా పరీక్ష రాస్తున్నట్లు ఊహించండి.
ఈ టెక్నిక్‌ను ప్రఖ్యాత క్రీడాకారులు, బిజినెస్ లీడర్లు కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే మన మెదడుకు ఊహకు, నిజానికీ తేడా తెలియదు. మనం ఊహించిన దాన్ని నిజమైందిగా గుర్తిస్తుంది! అలా మిమ్మల్ని ప్రశాంతంగా మారుస్తుంది.
2‘సూపర్‌హీరో పోజ్’ టెక్నిక్
పరీక్ష ముందు 2 నిమిషాల పాటు ‘సూపర్ హీరో’ పోజ్‌లో నిలబడటం ద్వారా, భయం తగ్గించుకోవచ్చని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధనలు నిరూపించాయి. ఇది చేయడం కూడా చాలా సింపుల్.
మిమ్మల్ని మీరు ఓ సూపర్ హీరోలా ఊహించుకోండి.
రెండు చేతులను నడుముపై ఉంచండి.
వెన్నెముకను నిటారుగా ఉంచండి.
రెండు కాళ్లను కొంచెం దూరంగా ఉంచి తలెత్తి నిలబడండి.
ధైర్యంగా చూస్తూ చిరునవ్వు నవ్వండి.
ఇలా కేవలం రెండే రెండు నిమిషాలు నిలబడితే భయాన్ని కలిగించే హార్మోన్ కార్టిసోల్ స్థాయిని తగ్గించి, ఆత్మవిశ్వాసాన్ని పెంచే హార్మోన్ టెస్టోస్టిరాన్‌ను పెంచుతుంది. పరీక్ష హాలులో ప్రవేశించే ముందు ఈ టెక్నిక్ ట్రై చేయండి. సూపర్ హీరోలా ఎగ్జామ్ రాసేయండి.
చెవులకు మసాజ్.. మెదడుకు యాక్టివేషన్
పరీక్షకు 5 నిమిషాల ముందు చెవులపై మసాజ్ చేయడం మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని ‘బ్రెయిన్ జిమ్’ పరిశోధన చెబుతోంది. చెవులకూ మెదడుకూ సంబంధం ఏమిటని తర్కించకుండా ఈ సింపుల్ ఎక్సర్సైజ్ చేసేయండి. ∙రెండు చెవులను మెత్తగా పట్టుకుని, పైకి, కిందికి, సైడ్‌కి తీయండి.
రెండు చేతుల గోళ్లతో చెవుల వెనుక భాగాన్ని గీరండి.
చెవులపై గుండ్రంగా మసాజ్ చేయండి.
ఇలా చేయడం మెదడులో సిగ్నల్ ప్రాసెసింగ్ ఫాస్ట్ చేయడానికి సహాయపడుతుంది. పరీక్ష ముందు చెవులకు మసాజ్ చేస్తే, మెదడుకు స్ట్రెయిన్ తగ్గుతుంది, మతిమరుపు ఉండదు.
యాంకరింగ్ టెక్నిక్
యాంకరింగ్ టెక్నిక్
మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక చిన్న సిగ్నల్ సృష్టించండి. ఉదాహరణకు, రెండు వేళ్లను కలిపి సున్నా ముద్రను (ఓకే సింబల్) చేయండి, లేదా గట్టిగా అరచేతిని మెల్లగా నొక్కండి. ప్రతిసారి దీన్ని చేస్తే, మీ మెదడు దానిని ప్రశాంతతతో అనుసంధానం చేసుకుంటుంది. పరీక్ష హాలులో ఒత్తిడి పెరిగినప్పుడు ఇదే ముద్రను ఉపయోగిస్తే, మీ మెదడు తక్షణమే కూల్ మోడ్‌లోకి వస్తుంది.
పరీక్ష అనేది ఒక మానసిక ఆట మాత్రమే! మీ మెదడును సరైన పద్ధతిలో ప్రోగ్రామ్ చేసుకుంటే, మీరు విజేతగా నిలుస్తారు. ఈ టెక్నిక్స్ ఫాలో అయ్యి మీ పరీక్ష భయాన్ని క్షణాల్లో హ్యాండిల్ చేయండి!.
సైకాలజిస్ట్ విశేష్
www.psyvisesh.com
(చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో అన్ని మార్పులా..? అక్కడ నొప్పి ఎందుకు వస్తుంది..?)