
అన్నానగర్: తల్లికి బదులు పరీక్షకు హాజరైన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు వ్యాప్తంగా గత 28వ తేదీ నుంచి 10వ తరగతి సాధారణ పరీక్ష జరుగుతోంది. నాగై వెలిప్పాలయం లోని నటరాజన్–దమయంతి పాఠశాలలో బుధవారం ఉదయం ఇంగ్లిష్ పరీక్ష ప్రారంభమైంది. పరీక్ష ప్రారంభం కాగానే ఇన్విజిలేటర్ ప్రశ్నపత్రాలను అభ్యర్థులకు అందజేసి సంతకాలు తీసుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఓ మహిళ ముఖానికి మాస్క్ ధరించి ప్రత్యేకంగా కనిపించింది.
అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్ మాస్క్ తీయమని మహిళను అడిగాడు. అనంతరం అడ్మిట్ కార్డును పరిశీలించారు. ఆ సమయంలో అడ్మిట్ కార్డు పై పరీక్ష రాస్తున్న మహిళ ఫొటోను చూశారు. అయితే పరీక్ష గది ఇన్విజిలేటర్ వద్ద ఉన్న హాజరు రిజిస్టర్ లో వేరే వ్యక్తి ఫొటో ఉంది. ఇన్విజిలేటర్‌కు మహిళను పరీక్ష కంట్రోల్ రూమ్‌కు తీసుకెళ్లారు. ఈ మేరకు ప్రిన్సిపల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సుబాషిణి, జిల్లా విద్యాశాఖాధికారి (స్పెషల్ ఎగ్జామినేషన్) ముత్తుచ్చామి, పరీక్షల నియంత్రణ సహాయ సంచాలకులకు సమాచారం అందించారు.
ఈ సమాచారం మేరకు విద్యాశాఖ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, పరీక్ష కేంద్రం వద్ద ఉన్న పోలీసులు వెళ్లి మహిళను విచారించారు. విచారణలో ఆమె నాగై వెలిప్పాలయానికి చెందిన సెల్వాంబికై (25) అని తేలింది. ఈమెకి పెళ్లి అయ్యిందని, తల్లి సుగంతి కోసం మాస్క్ వేసుకొని హాజరైనట్లు తెలిసింది. అదేవిధంగా 28న మాస్క్ ధరించి తమిళ సబ్జెక్ట్ పరీక్ష రాసినట్లు గుర్తించారు. విచారణ అనంతరం పోలీసులు ఆమెని అరెస్టు చేశారు.