
విశాఖలోని చినముషిడివాడ జియోన్ పరీక్ష కేంద్రంలో బయటపడ్డ బాగోతం
అడ్మిట్ కార్డు వెనుక భాగంలో జవాబుపత్రం జిరాక్స్ తీయించిన నిర్వాహకులు
20 నిమిషాల్లోనే పరీక్ష ముగించిన ‘కాపీ’ అభ్యర్థులు
దాన్ని చూసి కాపీ కొడుతున్న అభ్యర్థులను పట్టుకున్న తోటి విద్యార్థులు
పెందుర్తి: విశాఖలోని పెందుర్తి సమీపంలోని జియోన్ టెక్నాలజీస్ కేంద్రంలో డబ్బులు తీసుకుని పరీక్ష జవాబు పత్రాలను లీక్ చేస్తోన్న బాగోతం శుక్రవారం వెలుగుచూసింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్)లో సూపర్‌వైజర్ ట్రైనీ ఇంజినీర్ పోస్టుల కోసం శుక్రవారం చినముషిడివాడలోని జియోన్ టెక్నాలజీస్ ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు జరిగిన ఈ పరీక్షకు ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి 500 మంది హాజరయ్యారు.
పరీక్ష కేంద్రంలో ప్రశ్నాపత్రంతోపాటు జవాబుపత్రాన్ని ముందే కొంత మంది అభ్యర్థులకు లీక్ చేశారు. ముగ్గురు (ప్రాథమికంగా తెలిసింది) అభ్యర్థులు 2 గంటలపాటు ఆన్‌లైన్‌లో రాయాల్సిన పరీక్షను 20 నిమిషాల్లో ముగించడంపై అనుమానం వచ్చిన తోటి అభ్యర్థులు వారిని నిలదీశారు. దీంతో వారి వద్ద అడ్మిట్ కార్డు వెనుక మైక్రో జెరాక్స్ ద్వారా తీసిన జవాబులు కనిపించడంతో మిగిలిన అభ్యర్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. పరీక్ష జరుగుతుండగానే నిర్వాహకులను నిలదీశారు.
కాపీకి పాల్పడిన అభ్యర్థుల వద్ద జవాబు పత్రాన్ని లాక్కుని వారిని ప్రశ్నించారు. అనంతరం కేంద్రం ఎదుట నిరసనకు దిగారు. పరీక్షను తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేశారు. కాగా, ఈ కేంద్రంలో జరుగుతోన్న వ్యవహారాలపై ఇది వరకే పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి.
మార్చి 25న ఇదే కేంద్రంలో జరిగిన ఏపీపీసీబీ ఏఈఈ పరీక్షలో నిర్వాహకులు అవినీతికి పాల్పడి కొందరు అభ్యర్థులకు పూర్తి సహకారం అందించారని రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌కు కొందరు ఫిర్యాదు చేశారు. తాజాగా మరోసారి అలాంటి ఘటనే పునరావృతం అయ్యింది. ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.
విద్యార్థులకు బెదిరింపులు..
కాపీ వ్యవహారం బయటపడడంతో పరీక్ష నిర్వాహకులు నష్ట నివారణ చర్యలకు దిగారు. సాయంత్రం పరీక్ష ముగించుకుని బయటకు వస్తున్న అభ్యర్థులను 40 నిమిషాలు కేంద్రంలోనే నిర్బంధించారు. లోపల ఏమీ జరగలేదని చెప్పాలని బెదిరించారు. బాధిత అభ్యర్థుల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో తప్పనిసరి పరిస్థితిలో బయటకు పంపారు. లోపల జరిగిన విషయం బయటకు చెబితే పోలీసులతో కేసులు నమోదు చేయించి ఉద్యోగాలు రాకుండా చేస్తామని వారు బెదిరించినట్లు బాధిత అభ్యర్థులు చెబుతున్నారు.