
తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగర వేదికగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ‘ఇండియా ఆర్ట్ ఫెస్టివల్’ (ఐఏఎఫ్) దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కళాకారులతో, ఔస్తాహికులతో సందడి నెలకొంది. హైదరాబాద్ నగరంలోని రేతిబౌలి అత్తాపూర్‌లోని కింగ్స్ క్రౌన్ కన్వెన్షన్ వేదికగా నడుస్తున్న ఫెస్ట్‌లో 200 మందికి పైగా ప్రముఖ కళా కారులు రూపొందించిన 3,500 పైగా వైవిధ్యమైన కళారూపాలను ప్రదర్శించారు. ఇందులో 25 ఆర్ట్ గ్యాలరీలతో, 100 ఎయిర్ కండీషన్డ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. పలువురు ప్రముఖ కళాకారులు భాగస్వామ్యమవుతున్న ఈ ఆర్ట్ ఫెస్ట్ ఆదివారంతో ముగిసింది.
ఎంఎఫ్ హుస్సేన్ వారసత్వానికి నివాళి..
ప్రఖ్యాత భారతీయ కళాకారుడు ఎంఎఫ్ హుస్సేన్ మేనల్లుడు ఫిదా హుస్సేన్ ఎక్స్‌క్లూజివ్ ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళా ప్రదర్శన ఫెస్ట్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేదికగా తన మామతో ఉన్న సాన్నిహిత్యాన్ని పంచుకున్నారు. భారతదేశం నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ఎంఎఫ్ హుస్సేన్ కళను పదిలపరచడంలో ప్రత్యేక బాధ్యతను తీసుకున్నట్లు వెల్లడించారు.
2006 నుంచి 2011 వరకూ ఎంఎఫ్ హుస్సేన్ బహిష్కరణ సమయంలో అతను దుబాయ్, ఖతార్‌లో తనతో నివసించారని పేర్కొన్నారు. ఆ సమయంలో ఆయన సృజనాత్మకతను తాను పరిరక్షించానని, ఇందులో భాగం 2017లో హుస్సేన్ సెరిగ్రాఫ్‌లను భారతదేశానికి తిరిగి ఇచ్చే పనిని చేపట్టానని, ఇది తమ కళా వారసత్వానికి నిదర్శనమని అన్నారు. అనంతరం ముంబై, బరోడాలో ఎంఎఫ్ హుస్సేన్ కళను ప్రదర్శించడం, సమకాలీన కళాకారులకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా ఎక్స్‌క్లూజివ్ ఆర్ట్ గ్యాలరీని స్థాపించానని తెలిపారు.
సృజనాత్మకతలో తత్వ శాస్త్రం..
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన అంజలి ప్రభాకర్ సృజనాత్మకత ఇండియన్ ఆర్టి ఫెస్ట్‌లో విశేషంగా ఆకట్టుకుంది. జీవితంలోని వివిధ కోణాలను, తత్వశాస్త్రంపై ఆమెకున్న లోతైన అవగాహనను చిత్రాల ద్వారా ప్రదర్శించారు. విజయం, ప్రేమ, ఆధ్యాత్మికతతో పాటు జీవితంలోని అనేక ఆచరణాత్మక అంశాలను అంజలి చిత్రీకరించారు. పెయింటింగ్‌లో నైపుణ్యం, 3డీ మ్యూరల్ ఆర్ట్, మధుబని పెయింటింగ్, క్రిస్టల్ రెసిన్, సెఫోరిక్స్, అబ్‌స్ట్రాక్ట్ వంటి కళల్లో తన సృజనాత్మకతను ఈ ఫెస్ట్‌లో ప్రదర్శించారు.
భారత్‌తో పాటు విదేశాల్లో తాను సోలో, గ్రూప్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్‌లో పాల్గొన్నానని, తాను రాసిన పుస్తకం ‘ట్యూన్స్ ఆఫ్ లైఫ్’ విడుదలైందని, ప్రస్తుతం ‘మహిళల మానసిక ఆరోగ్యంలో ఆర్ట్ థెరపీ ప్రభావాన్ని అన్వేషించడం’ అనే అంశంపై పీహెచ్‌డీ ఎంట్రీని చేస్తున్నట్లు తెలిపారు. 16 ఏళ్లుగా అంజలి ఇన్నోవేటివ్ ఆర్ట్ శిక్షకురాలిగా కృషి చేస్తున్నానని అన్నారు. 2017లో ఇండోర్ మిరాజ్ నేషనల్ ఆర్ట్ ఫెస్ట్, బోపాల్ ‘ఆర్ట్ ఆల్కెమీ’, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ (ఆష్మి ఇనీషియేటివ్ గాంధీ ఆర్ట్ గ్యాలరీ) వంటి ప్రదర్శనలో తన చిత్రాలకు ప్రశంసలు లభించినట్లు తెలిపారు.
(చదవండి: ఇంటి రుచులకు కేరాఫ్.. హోమ్ చెఫ్..!)