
ప్రకాశం బ్యారేజీ వద్ద సీఎం చంద్రబాబు (పాత ఫొటో)
సాక్షి, విజయవాడ : మద్రాస్ నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో.. కర్నూలును రాజధానిగా చేసి ఉండాల్సింది కాదని, దాని బదులు విజయవాడ రాజధాని అయి ఉంటే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉండేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ స్టేట్‌లు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక.. తెలుగువాళ్లంతా కలిసి ఉండాలన్న ఉద్దేశంతోనే పెద్దలు హైదరాబాద్‌ను రాజధాని చేశారని వ్యాఖ్యానించారు. ప్రకాశం బ్యారేజీ (ఇప్పుడున్నది) నిర్మించి 60 వసంతాలు పూర్తైన సందర్భంగా శనివారం విజయవాడలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
బ్యారేజీతో కరువు తీరింది : కృష్ణా నదిపై బ్యారేజీ నిర్మించిన తర్వాతే డెల్టాలో కరువు సమస్య తీరిందని గుర్తుచేశారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం బ్యారేజీ ద్వారా 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. కృష్ణా-గోదావరి కలయిక ఒక పవిత్ర సంగమమమని, దానికోసం తలపెట్టిన పట్టిసీమ ప్రాజెక్టును ఏడాది కాలంలోనే నిర్మించి రికార్డు సృష్టించామని సీఎం చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ను కరువురహిత రాష్ట్రంగా చేయాలన్నదే తన ధృఢసంకల్పమని ప్రకటించారు.
మాజీ ఇంజనీర్లకు సత్కారాలు : కృష్ణా డెల్టాకు సాగునీరు అందించే ఉద్దేశంతో సర్ ఆర్థన్ కాటన్(1852-55లో) నిర్మించిన పాత ఆనకట్ట కొట్టుకుపోయిన దరిమిలా 1952లో కొత్త ఆనకట్ట నిర్మాణాన్ని చేపట్టారు. 1957 డిసెంబర్ 24 న బారేజిపై రాకపోకలు మొదలయ్యాయి. ఆంధ్రకేసరి టంగుటూరికి గుర్తుగా దానిని ప్రకాశం బ్యారేజీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 60 వసంతాలు పూర్తైన సందర్భంగా బ్యారేజి నిర్మాణంలో పాలుపంచుకుని అసువులు బాసిన ఇంజనీర్లకు ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు. బ్యారేజీ నిర్మా ణంలో వివిధ హోదాల్లో పాలు పంచుకుని వృద్ధులైన ఇంజనీర్లను సముచితంగా సత్కరించారు.