
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర జార్ఖండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. మరోవైపు దక్షిణ మహారాష్ట్ర నుంచి విదర్భ వరకు మరట్వాడా మీదుగా అల్పపీడనద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో శుక్ర, శనివారాల్లో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాలో కొన్నిచోట్ల పెనుగాలులు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి నివేదికలో వెల్లడించింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు గాని, వర్షం గాని కురవవచ్చని పేర్కొంది. ఆకాశం మేఘావృతమై ఉండడం వల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం రాష్ట్రంలోని అనంతపురం మినహా పలుచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే ఒకట్రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. అనంతపురంలో 41.4 డిగ్రీలు (+2.4) అధికంగా రికార్డయింది.