పోర్టు స్టేడియంలో ఈదురుగాలులకు ఇబ్బంది పడుతున్న క్రీడాకారులు (ఇన్‌సెట్) గాలులకు కమ్మేసిన దుమ్ము, ధూళి
సాక్షి, విశాఖపట్నం: ‘టిట్లీ’ తుపాను విశాఖలో అలజడి రేపుతోంది. ఇది ఉత్తరాంధ్ర వైపు దూసుకు వస్తోందన్న వాతావరణ శాఖ సమాచారంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తొలుత తుపాను గాను, ఆపై పెను తుపానుగాను ఉధృతరూపం దాలుస్తుండడమే ఇందుకు కారణం. సరిగ్గా నాలుగేళ్ల క్రితం హుద్‌హుద్ తుపాను సృష్టించిన పెను విలయాన్ని గుర్తు చేసుకుని ఈ ‘టిట్లీ’ ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందోనన్న భయం నెలకొంది.
హుద్‌హుద్ అంతటి తీవ్రత ‘టిట్లీ’కి లేకపోయినా గంటకు 100–125 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయనున్నాయి. మరోవైపు తుపాను ప్రభావంతో బుధ, గురువారాల్లో విశాఖలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ వర్షాలకు పెనుగాలులు తోడైతే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనాల ప్రకారం భారీ వర్షాలు, ఈదురుగాలులకు విశాఖలోని లోతట్టు ప్రాంతా లు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. కచ్చా ఇళ్లు, పూరిళ్లు, చెట్లు కూలిపోవచ్చని, విద్యుత్, ఇతర సమాచార వ్యవస్థ, రోడ్లు, వరి, అరటి, బొప్పాయి వంటి పంటలు దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయింది. నగరంతో పాటు జిల్లాలోనూ తహసీల్దార్లు, ఇతర అధికారులు అందుబాటులో ఉండాలని, సహాయక చర్యలకు సన్నద్ధం కావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
మొదలైన ఈదురుగాలులు
మంగళవారం మధ్యాహ్నం నుంచే ఈదురుగాలులు మొదలయ్యాయి. అవి అంతకంతకు తీవ్రమవుతున్నాయి. సముద్రం అలజడిగా మారి అలలు పైపైకి ఎగసిపడుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు హెచ్చరించారు.
విమాన సర్వీసులకు అంతరాయం
గోపాలపట్నం(విశాఖ పశ్చిమం): విశాఖలో మంగళవారం తుపాను గాలులు ఉధృతంగా వీయడంతో ఆ ప్రభావం విమానాల రాకపోకలపై పడింది. రెండు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఓ విమానం వెనుదిరిగి పోయి తిరిగి రాకపోవడంతో సర్వీసు రద్దయింది. మరో విమానం వెనుదిరిగి వెళ్లి నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చింది.
విశాఖ–హైదరాబాద్ సర్వీసు రద్దు
ముంబయి నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖకు ఇండిగో విమానం మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు రావాల్సి ఉంది. అయితే ఈ విమానం సమయానికి విశాఖకు వచ్చినా ఇక్కడ తీవ్రమైన గాలులు వీచాయి. దీంతో విమానం చక్కర్లు కొట్టి ల్యాండ్ అవడానికి ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంకేతాలు రాక హైదరాబాద్‌కు వెనుదిరిగి వెళ్లిపోయింది. ఇది అక్కడి నుంచి రాలేదు. ఇక్కడి నుంచి సర్వీసు రద్దయిందని తెలిసి హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు ప్రత్యామ్నాయ సర్వీసుల్లో వెళ్లారు.
4 గంటలు ఆలస్యం
కోల్‌కతా నుంచి భువనేశ్వర్ మీదుగా విశాఖకు మధ్యాహ్నం 2.25 గంటలకు రావాల్సిన ఇండిగో విమానం గాలుల ప్రభావంతో వెనక్కి మళ్లింది. హైదరాబాద్‌కు వెళ్లి పోయింది. ఇది తిరిగి సాయంత్రం ఆరున్నరకు వచ్చింది. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు నాలుగు గంటలు పడిగాపులు కాశారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
తుపాను నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నంబరు 1800 42500001ను అందుబాటులో ఉంచారు.
ఈపీడీసీఎల్ అప్రమత్తం
టిట్లీ తుపాను నేపథ్యంలో ఏపీఈపీడీసీఎల్ అప్రమత్తమైంది. సీఎండీ హెచ్‌వై దొర సంస్థ కార్యాలయంలో మంగళవారం అధికారులతో సమావేశమయ్యారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర పరికరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment