Titli
-
తిత్లీ
వారం రోజులుగా ముసురు. టిపిరి టిపిరి సినికులు తగులుకున్నాయి. ‘‘అరె శివ.. రేతిరికి పెద్ద తుపానమట్రా.. తిత్లీ’’ అనింది సీకన్య. అప్పుడు మావూరి అమ్మోరి గుడికాడ వున్నాన్నేను. సీకన్య ఆల్లమ్మతో గుడికొచ్చింది. ‘‘తిత్లీ’’..ఈ పేరు ఇనగానే శానా నవ్వొచ్చింది నాకు. గట్టిగా నవ్వాను. ‘‘ఏనికిరా ఆ నవ్వు’’ అని మూతిరిసింది సీకన్య. నాకింకా నవ్వొచ్చింది. ‘‘అంత నవ్వొద్దురా.. టీవీలసెప్పారు. తిత్లీ తుపానమట’’ అనింది మళ్లా పెద్ద తెలిసినట్టుగా.. నేనసలే æఒకరి మాట ఇనే నాకొడుకుని కాను. అది సెప్పిందెందుకింటాను?! దాని మాటకి ఇగటానికి దిగినాను. ‘‘తిత్లీ అట.. తిత్లీ.. కిట్లీ.. ఫిట్లీ.. లొట్లీ’’ అని ఇగటానికెళ్ళాను. ‘‘ఎల్రా ఊసకల్లోడా.. టీవీ సూస్తే తెలుసును. గంటకి 150 గాలట. పలాస దాక పారొచ్చింది’’అని టీవీల నూసులాగ మళ్లా సెప్పింది. నాకు ఇంకా పౌరుసం పొడుసుకొచ్చింది. ‘‘ఎల్లే..పెద్ద నీకేదో తెలిసినట్టు పోజు కొట్టక. సోసల్ల పస్టు నాను. నాకు తెలుసును. తుపానమంటే పెద్ద గాలి. గట్టిగా వస్తాది. అది పలాస దాకొచ్చి ఆగిపోదు.! అదేమైనా బొస్సా?! పలాస నుండి సోంపేటొచ్చి, అక్కడ రెస్టు సేసుకొని మళ్లా ఇచ్ఛాపురం రావడానికి’’ అన్నాను ఇగటంగా.నా మాటకి ఇంత పొడుగు మూతెట్టింది సీకన్య. ‘‘ఎల్రా..ఊసకల్లోడా’’ అని నా పొద్దెట్టి ఆలమ్మ యెనక సిన్న ఈరో సైకిలు తొక్కుకుంటూ ఎల్లిపోయింది. సీకన్య, నాను ఒకటే క్లాసు. ఆరు. ఈ ఏడే ఎంపీపీ ఇస్కూల్ నుండి జెడ్పీహెచ్ ఇస్కూల్కి ఎళ్లినాము. మా యడ్డుమాస్ట్ కూతురే సీకన్య. నాను ‘‘సీకాయ’’ అని ఇగటమాడుతుంటాను. ‘‘అరె..ఊసకల్లోడా.. నాపేరు శ్రీకన్య. పలకడం రాకపోతే పల్లకో. అంతేగానీ పరాసికాని పోకు’’ అని శానా ఇదైపోతాది సీకన్య.కానీ సీకన్య సూపరు. నాను, సీకన్యని ‘‘ఐస్పర్యారాయ’’అని ముద్దుగా పిలుసుకుంటా. బొమ్మ సెక్కినట్టుగ వుంటాది సీకన్య. దాన్ని కేళిసేయడం నాకు శానా సరదా. నానింకా అమ్మోరి గుడికాడే వున్నాను. ముసురు గదా... పొద్దుగూకే యాల కూడా తెలియట్లే. ఇంతల సిమ్మాద్రి వచ్చాడు. మాసీనేరు. పదోక్లాసు. ‘‘శివ..గెడ్డ కెళ్తామా?’’ అన్నాడు.నాకు బైమేసింది. మాయమ్మ మాటలు గురుతుకొచ్చాయి. ‘‘అరెశివుడు.. ముసురు పట్టింది. గెడ్డకెల్లక. నీరు పారతుంది నాయన... జాగరత. నూతికాడే పోసుకో. రొండుకొస్తే మెరకరోడు మీదకెళ్ళు. అంతే గానీ గెడ్డ జోలికెళ్ళక’’ అని మూడు రోజులుగా గంట కొట్టినట్టుసెప్తుంది. ఆ మాటలు గురతుకొచ్చాయి. ‘‘వద్దన్నా..రాను’’ అన్నాను. ‘‘పోబే..పిరికోడా’’ అని నా మొకమ్మీన అనేసెల్లిపోయాడు సిమ్మాద్రి.‘‘ సెహ్.. ! నా పొరువు పోయినంత పనైంది. ఎవురు పక్కన నేరు కాబట్టి సరిపాయే. మా ఐస్పర్యా వుండివుంటే..?! సెహ్.. నా తల ఎక్కడ పెట్టుకుందను. మాయమ్మొకటి. ! ఎప్పుడూ పిరికి నూరిపోస్తాది’’ అని నాలోనే ఇదైపోయాను. అయినా మాగెడ్డ అంటే నాకు బైమే. ఇలాంటి ముసురులో అది పొంగితుంది. మా ఇలకాలే పారితాది మాగెడ్డ. అది బాహుదా నది తాలూకు గెడ్డట. మాయమ్మ సెప్పింది. ఆ నది తిన్నగా ఈతపరం యేటిల కలిస్తాది. అక్కడి నుండి సముద్రమట. నాకు తెల్దు. మాయమ్మే సెప్పింది. కానీ గడ్డ పారినప్పుడు అందులో గెంతిఈతపరం దాక ఈత కొట్టాలనే ఓ కోరిక వున్నాది నాకు. ఇదే సంగతి మాయన్నకు సెప్పానొకసారి. నన్ను ఎగాదిగాసూసి, బుర్రమీన ఒక్క గస్కీ ఇచ్చాడు. ముసురు ఎక్కువైయింది. ఇంక ఆలిసం సేయకంటా ఇంటికి పారొచ్చాను. ···మాది కమ్మలిల్లు. కిందమట్టి. ముసురికి బాగా తడిసిపోయి, ఐసుగడ్డనాగ వుంది మా ఇల్లు. జోరుగాలికి కెరంట్ ఎల్లిపోయింది. ఇల్లంతా సిమ్మసీకటి. నాను పరిగెత్తికెళ్లి మాయమ్మను పట్టుకున్నాను. నాకు సూడకంట కొవ్వొత్తి కోసం యతకత్నాది మాయమ్మ. కొవ్వొత్తి దొరికింది. ఎలిగించింది. ఆ ఎలుతురులో ఎర్రటి సెంద్రుడిలా కానొచ్చింది మాయమ్మ. మాయమ్మ కాలికి జలగలా పట్టుకున్న నాకుసూసి ‘‘ఓ.. పిరికోడు’’ అని ఉడికించాడు మాయన్న. కానీ నాను ఉడకనేదు. ఆడి బుద్ధి నాకు తెలుసు. నానొగ్గేస్తే ఆడొచ్చి అమ్మను సుట్టుకుంటాడు. ఆడి సంగతి నాకు తెల్డా?! ఆడి పప్పులు నాదగ్గిర ఉడకవు.మానాయన, అన్న ఏరే దీపంబుడ్డి ఎలిగించారు. మాయన్నకి సదువు పిచ్చి. ఇంత ముసురులో కూడా పుస్తకం వదల్డు. నాయనికి యాదో పాటం అప్పగిస్తన్నాడు.నాను మాయమ్మ దగ్గిర కూకున్నాను. దసరా సీజన కదా..సేలా రకాల పప్పలు సేసి వుంచిందమ్మ. మూడు రోజులుగా నాకు పండుగే. ఇంకా సేలా రకాల పప్పలు, ఖజ్జాలువున్నాయి. అవన్నీ ఒక పెద్ద డబ్బాలో ఉంచిందమ్మ.‘‘మా.. ఖ...ఖ..జ్జ‘’ అని సిన్నగా అడిగాన‘‘ఇప్పుడు వద్దు నాయినా.. కూడు తినేయాల ఖజ్జాలు తింటే మరి బువ్వేం తింటావు. వండిన అన్నం పారేస్తానా’’ అనిదీర్గంతీసిందమ్మ.‘‘నాను అన్నం తిన్నే. పప్పలు, ఖజ్జాలే తింటాను. నాకు అవే ఇయ్యు’’ అని కచ్చా సేసాను. ‘‘సెహ్.. ఏంపిల్లడవురా నీవు?! సెప్పిన మాట ఇనవు. షెహ్.. నీతో నాకు సచ్చేసావొచ్చింది’’ అని మీదకి లేసిందమ్మ. నా మొకం ఎలిగిపోయింది. ‘‘మ్మా...గ..గ..గ..’’ అని వుసారుగా పాడాను. ‘‘అరె.. గార్లన్నీ నీవే తిన్నావ్. పెద్దోడికి ఏం లేవు’’ అని మాయన్న సైడు మాటాడిందమ్మనాను మళ్లా మూతి ముడుసుకున్నాను. ‘‘ఇదొక్కటి నేర్సావ్తండ్రినాగ’’ అని బుర్రమీద ముద్దుగా ఒక్కటి మొట్టి.. రెండు గార్లుసేతిలో పెట్టి.. మళ్లా డబ్బా మెద్దిమీదెట్టేసింది.మినపగార్లు అంటే నాకు శానా పిచ్చి. నా కోసమే పెషల్గా గార్లు సేస్తాది మాయమ్మ. పెనంమీదే పాతిక లాగించేస్తాను. మాయన్నకి ఇవంటే పెద్ద ఇష్టం నేదు. ఆడు అరిసెల పెసలిస్ట్. అమ్మ వండిన అరెసలన్నీ ఆడికే. నాకెందుకో అవి కిట్టవు.రెండు నిమషాల్లో రెండు గార్లు ఊదేసాను. మళ్లా ‘‘ప...ఖ.. గ...’’ అని రాగం తీసాను. ఈసారమ్మకు సిరాకొచ్చింది. ‘‘ఏమయ్యో.. ఈడిని ఆ మెద్దెక్కించే. పప్పలు.. పప్పలు.. అని పానం తీస్తనాడు. సెహ్..ఇనాటి పిల్లడు ఎక్కడా వుండడమ్మా?!’’ అని ఇంత దీర్గం తీసిందమ్మ. మాయమ్మ సిరాకు ఇని ‘‘అరె శివ.. ఇక్కడికి వస్తావా? అక్కడికి రమ్మంటావా?’’ అంగటింటి నుండి వార్నింగి వదిల్నాడు మా నాయిన. తేలుకుట్టిన దొంగలాగ పల్లక వుండిపోయాన్నాను.‘‘అక్కడకిక్కడికి నేదు. ఒకటే కొవ్వొత్తుంది. ఆ బుడ్డీల సవురు నేదు. ఇంత ముద్ద తినేసి బొజ్జుంటారండి’’ అని గిన్నల దగ్గరికెళ్ళిందమ్మ. నాను ముందు మటం ఏసాను.‘‘ఇందాక తిననన్నావ్బే..’’ అని సిన్నగా నా సెవి దగ్గరన్నాడు మాయన్న. దొరికింది శాన్స్.. ఇంత పొడుగు రాగం తీసి ‘‘ఈడు నాకు ఉడికించాడు. నాను తిన్న్ పో..’’ అని డ్రామా కట్టాను. పాపం..మాయన్న డ్రామాల మనిషి కాదు. నాను పక్కా డ్రామా నాకొడుకొని.ఈర లెవల్లో యాగీ సేస్తాను. అయితే ఎంత డ్రామా నాకొడుకునైనా మాయమ్మ దగ్గిర పిచికనే. ‘‘ఒరేయ్.. అపరా నీ ఏసికాలు. ఖజ్జాలు కావాలని అడుగు. ఈ ఏసికాలన్నీ వద్దు’’ అని గాలి తీసేసింది మాయమ్మ. మాయన్న మళ్లా ఆడి కంటితో ఉడికించాడు. నా మొకం ఎక్కడ పెట్టుకొవాలో అర్దం కాలే. మెల్లిగా మానాయిన పక్కకెల్లాను. సెవిలో ఒక ‘మాట’ సెప్పాను. మా నాయిన శానా సంతోసపడ్డాడు. ‘‘అనే.. ఆడికి అన్నం సహించదు. ఓ రెండు గార్లిచ్చే’ అని నాసైడు తీసుకున్నాడు. ‘‘బుర్రకి నూన రాసి, ఒళ్లుపట్టి, కాళ్ళు నొక్కితా.. పైకి ఎక్కితా..అన్నాడా?’’ అనిందమ్మ.‘‘సెహ్.. మా’మాట’ అమ్మకి తెలిసిపోయింది. పిల్లిసెవులు. ఎలా ఇనేస్తాదో?!’’ అని గోలు కొరుక్కున్నాన్నాను. మా నాయిన మాయమ్మని సూసి ఉడతపిల్ల కీచమన్న రీతిగా నవ్వుకున్నాడు.‘‘అరేయ్ శివుడు.. మూడు రోజులైయిందిరా నీవు బువ్వతిని.! సెహ్.. ఒట్టు..ఇంకెప్పుడు ఈ పప్పలు వండను. ఒకేల వండితే నాది మనిషి జలమ్మే కాదు’’ అని నాలుగు గారెలు, రెండు పొంగడాలు, ఇన్ని జంతికులు, ఇంత సలిమిడి ముద్ద కంచంలో పెట్టి అన్నం వడ్డించినట్టు ఇచ్చింది. నా మొకం మళ్లా ఎలిగిపోయింది. పదినిమిషాల్లో మెక్కేసా.···‘‘శివా.. మాట’’ అని గుర్తు సేసాడు మా నాయిన బొంత మీద నడుం వాలుస్తూ.నాకు పప్పలు పీకమొయ్యికైపోయాయి. ‘’రేపు’’ అన్నట్టుగా సూసాను.‘‘సెహ్..శివడ్ని ఇంకనమ్మేదిలే’’ అని ఇంత పొడుగు మొకం పెట్టాడు మానాయిన. ఈసారి మాయమ్మ ఉడతపిల్ల కీచుమన్నట్టుగా నవ్వింది.ఇంతలో పెద్ద శబ్దం ఇనిపించింది. నాను జడుసుకొని ఒక్క జంపుకొట్టి మాయమ్మని పట్టుకున్నాను. అమ్మ గాబరా పడింది.‘‘ఏంనేదు నాయన. జడక. వాన తగ్గిపోయినట్టుంది. అందికే ఈ మెరుపులు, ఉరుములు. ఉరుము వచ్చిందంటే ఇంక వాన తగ్గిపోద్ది’’ అని సామాన్య పాటమేదో సెప్పిందమ్మ. నాకేం బుర్రకెక్కనేదు, కానీ ‘‘వాన తగ్గిపోద్ది’’అనే మాట శానా మంచిగా అనిపించింది. ‘‘ఈ సీగొట్టి ముసురు వల్ల దసరా సెలవలన్నీ ఏస్ట్.! ఈ పదిరోజులు కసిగా క్రికెట్టు ఆడాలని అనుకున్నాం. గ్రౌండ్సెక్కాం. ఈ ముసురు వల్లఅంతా బురదైపోయింది. గవర్నమెంటోడు దయ తలిసి వానవొదిలిపోయినాక.. మరో పది రోజులుసెలవ ఇస్తే ఆడికి పున్నెందక్కును. అనాగే క్వార్టర్లీ పేపర్లు పదిసార్లు రాయమని తగులుకున్నారు మేస్టార్లు. ఆలకేం పోయింది. రాసినోడికి తెలుస్తాది నెప్పి. అంచేత..ముసురు కారణంగా రాతకార్యక్రమం కూడా రద్దుసేస్తినట్లు గవర్నమెంటు నిండి ఒకసర్కిలరువస్తే.. మా ఐస్పర్య ఆళ్ళ తోటలో దొంగతనం సేసైనా అమ్మోరికి వంద కొబ్బిరికాయలు కొడతాను’’అని మనుసులోనే మొక్కుకున్నాను.ఇందాక మాయమ్మ సెప్పినట్టు వాన తగ్గింది. కానీ జోరుగా గాలి తగులుకుంది. ‘‘హు..హు.. హు..’’ అని ఇస్పీడుగా కొడుతుంది గాలి. కమ్మలిల్లుకదా.. గాలిసబ్దం అదో రకంగా ఇనిపిస్తుంది. సలికూడా వేస్తుంది. మాయమ్మ దగ్గరికెళ్ళి ముడుసుకొని కడుపులో దూరిపోయాను. బలేటి యచ్చగావుంది. కునుకు పట్టేసింది. ···సరిగ్గా ఒంటిగెంట. నా మొకమ్మీన ఎవరో నీరు కొట్టినట్టు అనిపించింది. ఇలాటి పిత్తిగిల్లి పని మాయన్న సెయ్యడే?! ఈటైంలో ఎవుడు?! అని సిరాగ్గా కళ్ళు తెరిసాను. పక్కన మాయమ్మ నాయిన అన్న.. ఎవురూ కనిపించనేదు. ‘‘కెవ్వు’’మని అరిసాను. ‘‘శివజడక.. నాను ఇక్కడే వున్నాను’’ అని అంగటింట్లో నిండిటార? అంటూ సూపించాడు మాయన్న. కాసేపయ్యాక అమ్మ నాయన అన్న వొచ్చారు.గాలికి అంగట్లో పెనక ఎగిరిపోతుంది. దానికి కందాడుతో గుంజకి కట్టడానికెళ్ళారు. వాన, గాలి ఎక్కువైపోతుంది. ఇల్లంతా కారిపోతుంది. మెద్ది కింద వున్నాం కాబట్టి తడవం నేదు. కానీ గట్టిగా గాలి వస్తుంటే.. పంచ నుండి నీళ్ళు మొకానికి కొడతనాయి. కాసేపటికి గాలి ఇంకా ఎక్కువైయింది. ఎన్నుకట్టు బిగి వదిలేసినట్టుంది. కమ్మలు ఒకొక్కటిగా ఎగిరిపోతున్నాయి. మెద్ది కింద పడుకున్న నాకు ఇనిపిస్తుంది కమ్మలు ఎగిరిపోయే సబ్దం. గాలికి కమ్మలు ఎగిరిపోతున్నపుడు అదోరకం యరైటీ సౌండ్ వస్తాది. ‘‘జయ్యి.....జప్. జయ్యి....జుప్’’ ఇలా ఎగిరిపోతుంది ఇంటి మీద కమ్మ. కాసేపటికి ఇంట్లోనే గాలి, వాన కురిసింది.పరిస్థితిç Üూసి ‘‘అనే..ఈ తుపానము ఎక్కువైపోతుంది. ఇంటి నుండి ఎల్లిపోదాం పదే’’ అనిందమ్మ. మా నాయిన పల్లకున్నాడు. నాకు సీకన్య మాటలు గుర్తుకొచ్చినాయి. ‘‘అదేదో పేరు సెప్పి..పెద్ద తుపానమనింది. నాను ఇగటానికి పోయాను. ఆ తుపాన్ని ఎక్కిరించాను. ఇప్పుడు గాలిని సూస్తుంటే.. కొంపతీసి నా ఎక్కిరింతలు ఇని ఆ తుపాను పగ తీర్చుకోవడం నేదుకదా..?! ఈ గాలి వరస సూస్తుంటే.. మొత్తం మా ఇంటికే తగులుకున్నట్టు వుంది.! ఓరి బగమంతుడా..! రెపొద్దున సీకన్య మొకం ఎలా సూసేది?! సెహ్..! ఈ తుపాన్ రేపొచ్చినా బాగున్ను. దాని మాట నిలబడకపోను..సస్’’ మళ్లా అడిగిందమ్మ.‘‘పదే.. ఎల్లిపోదుము.. మనకేమైనా పర్వానేదు. ఇక్కడే వుంటే పిల్లలు సచ్చిపోతారే’’ అని గొంతు అదోలా సేసిందమ్మ. ఆ గొంతు ఇంటే నాకు బైమేసింది. మానాయినకి మాత్రం సిరాకేసింది. ‘‘ఈ రాతిరి ఎక్కడికి ఎల్తామే..?! ఎవరింట్లో దూరిపోతామే..?! మనకి సిగ్గునేదా?’’ గాలి కంటా గట్టిగా అరిసాడు మా నాయిన. ‘‘సీ.. నీ బతుక్కి మళ్లా రోసము..! దసరాకి కొత్త కమ్మ నేయించమని గింజుకున్నాను. ఇన్నావుగాదు. ఇప్పుడా పాత కమ్మ గడ్డి పరకలా ఎగిరిపోతుంది. సెహ్..ఏంమనిసివే నీవు’’ అని దెప్పిపొడిచిందిమ్మ.‘‘అనే.. సుసావా..! కొత్త కొమ్మ నేసుంటే ఎంతనష్టి.! ఈగాలికి కొత్త కమ్మ కూడా నిలబడదు.సేలెంజ్!’’ అని మూకుడి ఏసాడు మా నాయిన. ‘‘అయ్యా... నీతో మాటాడి నెగ్గనేను. ఇనాగే వుంటే ఈ ఇల్లు కూలిపోద్ది. బగమంతుడా..నా పిల్లలు..’’ అని మళ్లా అదోలా అనిందమ్మ.‘‘ఏం కాదు. గాలి తగ్గిపోద్ది’’ అన్నాడు నాయిన‘‘అనే.. పదే.. ఈరమ్మత్త ఇంటికి ఎల్లిపోతుమా’’ అనిందమ్మఈరమ్మత్తిల్లు మా ఇంటికి ఐదిళ్ళు దూరం.పెద్దిల్లు. రెండు అంతస్తుల మేడ. మాయమ్మా ఈరమ్మత్త మంచి మొకరాలు. కానీ ఈరమ్మత్తతో ఒక సిక్కుంది! పిసరంత ఉప్పు ఇచ్చినా పేనంపోయినంత వరకి దెప్పుతునే వుంటాది. ఇప్పుడు గానీ మాము ఆడికెల్తే.. ఇంక మా పేనాన్ని కాపాడేసినట్టు డబ్బా కొడతాది. అసలే మా నాయిన శానపౌరుసం మనిషి. సచ్చినా సస్తాడు కానీ దాని ఇంటి ముందుకెళ్ళి నిలబడడు. ఆ సంగతి నాకు బాగా తెలుసు.నాను అనుకున్నట్టే అయ్యింది.! ‘‘ఈరమ్మ ఇంటికా.. నాను సచ్చినా రానే’’అని తెగేసిసెప్పాడు మా నాయిన. మా నాయిన ఆ మాటన్న యంటనే ఎన్నుకట్టు ఇరిగిన సబ్దం ఇనిపించింది. నాలుగు ఎదురు కర్రలు ‘‘పట్ఫాట్ఫట్’’మని ఇరిగిఇంట్లో పడ్డాయి. ‘‘ఏం కాదు.. ఏం కాదు.. మనకి మెద్ది వుంది.ఏం కాదు’’అని దైర్యం సెప్పాడు మా నాయిన. మేం అంతా మెద్దికింద వున్నాం.ఇంతలమరో రెండు కమ్మలు ఎగిరిపోనాయి. అదిసూసి మాయమ్మ ‘‘నాయినా.. నీవు నా పిల్లలని తినేస్తావు.! నీవు వస్తేరా.. నేకపోతే మానే.. నాను మాత్రం నా పిల్లల్ని ఎట్టికెళ్ళిపోతా’’ అని నన్ను బుజాన ఎత్తుకొని మాయన్న రెక్క పట్టుకుని రెండు అడుగులేసింది.మా నాయిన అనాగేç ³ల్లకుని కూకోయినాడు. ఒక నాలుగు అడుగులు నడిసిన మాయమ్మ.. మళ్లా ఎనక్కి తిరిగి.. ‘‘ఓరి బగమంతుడా.. నాకెందుకీ సావొచ్చింది’’ అని మా నాయిన దగ్గరికొచ్చి నాయిన వడిలో తలపెట్టుకుంది. మామంత నాయిన సుట్టు సేరినాం.నా యదవ కడుపేమిటో గానీ, దానికి సమయం, సందర్భం ఏమీనేదు. ఎందుకో తెల్దు.! నాకు ఇప్పుడాకలేసింది. మెద్దిమీదున్న పప్పల డబ్బాపై నా మనసు లాగింది. ఇపుడుగానీ ‘‘గ.. గ.. గ’’ అంటే బాగోదు. గాలింకా పెరిగిపోయింది. మాయమ్మ పల్లకున్నాది. ఇంక శకితి లేనట్టు మానాయిన జబ్బమీద వాలిపోయింది. నాను, మాయన్న.. మానాయిన కాలు సెరోటి సుట్టుకున్నాం. మాఇంటి ముందు పంచ ఎగిరిపోయింది. గాలిదెబ్బకి తలుపు ముక్కలైపోయింది. ఎందుకో మా నాయినలో కూడా కొంచెం బయం కనిపించింది. ‘‘అనే..ఈ మాయదారి తుపాను తగ్గినట్టు ఏమీనేదు. పద బయటికి ఎల్లిపోదాం’’ అన్నాడు మా నాయిన. అంత సీకట్లో కూడా మాయమ్మ కంటిల సంతోసం కానొచ్చింది. మా నాయిన కాస్త బలంగా దిట్టంగా వుంటాడు. అన్నని అమ్మని సెరోసేయితో పట్టుకున్నాడు. నాకు గుర్రంపళ్ళు ఎక్కమన్నాడు.నాను ఏదోఆలోసిస్తున్నట్లు మొకమెట్టాను. ‘‘ఏంట్రా శివుడు.. పదరా..’’ అని తొందరబెట్టిందమ్మ. నాను మెద్ది మీదున్న పప్పల డబ్బాకేసి సూసాను. మాయమ్మకు మా శానా సెడ్డ కోపమొచ్చింది.‘‘సెహ్.. ఏం పిల్లడివిరా నీవు?! పానం పోతున్నా.. నీకు పప్పలే కావాలా?! తు..నీజలమ..!ఏం జలమ్రా నీది..?! బతికుంటే బండెడు పప్పలు సేసి పెడతాను.. పదరాఅయ్యా..’’ అని బుర్రమీద ఒక్కటేసింది. అ దెబ్బకి మా నాయిన బుజాలెక్కేసాను. నాను మా నాయిన బుజంమ్మీన వున్నాను. అమ్మ అన్నా సెరో వైపు వున్నారు. మా నాయిన నోటితో టార్చలైటు పట్టుకున్నాడు. మెల్లిగా మా ఇల్లు దిగాం. ఈదిలోకి వచ్చాం. గాలి దంచి కొడుతుంది. ఎనక్కి తోస్తుంది. మానాయిన గాలిని మెడ్డుకుని ముందుకి కదల్తనాడు. ‘‘హు.. హు.. హు..’’ అని శబ్ధంతో సెవులు దిమ్మ కట్టేస్తనాయి. మా నాయిన మాత్రం గాలిని మెడ్డుకుని ముందుకెల్తనాడు. మా నాయిన్ని ఇలా సూస్తుంటే అచ్చిం సినిమాలా ఈరోవునాగే అనిపిస్తనాడు.మా నాయిన తుపానికి ఎదురెల్తనాడు. ఇంత జోరుగాలిని మెడ్డతనాడు. నాకు శానా మంచిగా అనిపిస్తింది. ఈరమ్మత్త ఇంటికెదురుగా వచ్చినాం. మాయమ్మ అటుకేసి ఎల్లబోయింది. యంటనే మా నాయిన మాయమ్మసెయి ఎనక్కినాగి ముందుకెళ్ళాడు. అప్పుడు అర్దమైయింది. మా నాయిన ఇంకెక్కడికో తీసుకుయల్తనాడని.ఈదిల ఇల్లన్నీ దాటుతున్నాయి. ఎక్కడ ఆపుతాడో తెల్దు. మాటాడిస్తామా.. అంటే నోట్లోటార్చలైటెట్టుకున్నాడు. ఒక ఇంటి దగ్గరికి ఎల్లగానే మెల్లిగా నడిసాడు. నా గుండ్లో రాయిపడింది.! అది మా ఐస్పర్య ఇల్లు. ‘‘సాయంకాలమే దానితో ఇగటమాడాను. ఇప్పుడు గానీ దాని ముందు నిలబడ్డానా?! నాను సచ్చినట్టే నెక్క. తు.. నా బతుకు. ఇంకెక్కడ తలపెట్టుకునేది.?! బగమంతుడా.. ఏమీ కర్మరా.. చస్.. ఏం గాచారమొచ్చింది. దాని ఇంట్లోకి ఎల్లే బదులు ఏటిలోకి ఎల్లిపోవడం నయం’’అని మనుసులో శానా ఇదైపోతున్నాను. హమ్మయ్యా.. ! సెప్పు సరి సేసుకోవడానికి కాస్త ఆగినాడు మానాయిన. ఇప్పుడు దాని ఇల్లు కూడా దాటిపోయినాం. మరో ఇరవై అడుగులేసినాక మా ఎంపీపీ ఇస్కూలొచ్చింది. తిన్నగా ఇస్కూల్లోకి తీసుకెళ్లినాడు మా నాయిన. ఊపిరి పీలిసింది మాయమ్మ. నిరుడే దిట్టంగా డాబా ఇస్కూల్ కట్టారు. పది కుటమాలైన ఆ డాబాలో పట్టిపోతాయి. సాయింకాలం బంట్రోత్తో దండోరా ఏయించారట. తుపానంతో ఎవరికైనా ఇబ్బంది వుంటే ఇస్కూల్లోకి రావచ్చునని. మేము వచ్చేసరికి ఇంకో రెండు కుటమాలక్కడున్నాయి. తడిబట్టలుతోనే ఒకవార కూకున్నాం.మేమొచ్చినాక ఇంకా గట్టిగా తగులుకుంది తుపాను. ఐతిప్పుడు బయంలే. పైగానా కోరిక తీరింది. నాను ఎంపీపీ ఇస్కూల్లా వుండగా యడ్డుమేస్టు సీటులో పడుకోవాలనే కోరికుండేది. ఇప్పుడా కోరిక తీరింది. తిన్నగా ఎల్లి యడ్డుమేస్టు సీటులో కూకోని ఎదరగా వున్న టేబులు మీన దర్జాగా కాలు సాపాను.నాకు మళ్లా మా ఇంట్లో మెద్ది మీదున్న పప్పల డబ్బా గురతుకొచ్చింది. ఇప్పుడా డబ్బా తెచ్చుకొని వుంటే ఈ సలిలో దర్జాగా కాలు మీద కాలేసుకొని తిందును.. చస్’’ ···తెల్లారింది. తుపాను అలిసిపోయి వూరుకున్నాది. ఇస్కూల్ నుండి బయటికి వచ్చాం. మా ఈది మొత్తం నాకు అదో రకంగా కానొచ్చింది. రంగులు ఒలిసేసిన ఇల్లునాగ. గెడ్డ పూర్తిగా పొంగి పోయినట్టువుంది. ఈదిలోకి మోకాల్లోతు నీరు ఎక్కిపోయింది. సిన్నగా దాటుకొని మా ఇంటి దగ్గరికొచ్చాం. మా ఇల్లు నేదు.! కూలిపోయింది. మాయమ్మా నాయిన కూలిపోయిన ఇంటిని సూసి పల్లక నిలబడిపోయినారు. మాయన్న కూలిపోయిన గోడలమీద నించెల్లి ఆడిఇస్కూల్ బ్యాగు తెచ్చుకున్నాడు. ఎక్కడి నుండి వచ్చిందో.. పిల్లి గొంతుకేసుకొని.. నాపక్కన నిలబడి ‘‘సెప్పానా శివ.. తిత్లీ తుపానమని. ఇగటమాడినావు. ఇపుడుసూడు..’’ అని దెప్పి పొడిచినట్టు ఎల్లిపోయింది ఐస్పర్య..ఉరఫ్ సీకాయ.. అలియాస్ సీకన్య.నాను మాత్రం కూలిపోయిన మా ఇంటిని సూస్తూ నిలబడ్డాను. ‘‘పాపిష్టి దాన్ని. పసిపాపడు నోరు తెరిసి అడిగితే కడుపునిండా నాలుగు దినుసులు పెట్టనేకపోయాను. ఇపుడు మన్నుల కలిసింది. ఈ పాపిష్టిదాని కడుపున ఎందుకు పుట్టినావురా నాయిన..’’ అని మాయమ్మ నాకు దగ్గిరికి తీసుకుంది. · -
వారంలోనే కోలుకున్న ఒడిశా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సిక్కోలు జిల్లాను కకావికలం చేసిన తిత్లీ విలయం పొరుగునే ఉన్న ఒడిశా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. మొ త్తం 17 జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపించింది. వీటిలో గజపతి, గంజాం, రాయగడ జిల్లాలు బా గా దెబ్బతిన్నాయి. శ్రీకాకుళంలో తొమ్మిది మం ది చనిపోగా, ఒడిశాలో 61 మంది మృత్యువాత పడ్డారు. 57 వేల ఇళ్ళు కూలిపోగా, ఎక్కడికక్కడ రహదారులు కోతకు గురయ్యాయి. తాగు నీటి సరఫరా వ్యవస్థ, విద్యుత్, వ్యవసాయ రం గాలు దెబ్బతిన్నాయి. ఇంతటి పెను నష్టం సంభవించినా ఒడిశా కేవలం వారంలోపే కోలుకుంది. రాష్ట్రంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య ప్రసాద్ పాఢి రెండురోజుల కిందటే ప్రకటిం చారు. ముందు జాగ్రత్తతో తప్పిన తిత్లీ ముప్పు తుపాను సమాచారంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నాలుగురోజులు ముం దుగానే ప్రత్యేక బృందాలను ఆయా జిల్లాలకు పంపారు. 3 లక్షలమందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రంలో వేర్వే రు చోట్ల ఏర్పాటు చేసిన 1,112 ఆశ్రయ కేం ద్రాల్లో వీరికి ఆశ్రయం కల్పించారు. బియ్యం, కిరోసిన్ తదితర నిత్యావసర వస్తువులను సిద్ధం చేశారు. ‘ముందుగానే విద్యుత్ సరఫరా నిలిపివేశాం. పవర్ కట్ చేయకపోతే మంటలు రేగే ప్రమాదం ఉండటంతో అన్ని చోట్లా సరఫరా నిలిపివేయాలని స్పష్టంగా ఆదేశాలిచ్చాం. దీంతో ఆ రంగంలో పెనునష్టం తప్పింది. అదేవిధంగా లక్షలాదిమందిని ముం దుగానే తరలించడంతో పాటు వారికి భోజన వసతి, వైద్య సౌకర్యాలను కల్పించాం. మంచినీటి సరఫరాకు ప్రత్యేక ట్యాంకర్లు ముందుగానే ఏర్పాటు చేశాం..’అని గంజాం జిల్లా కలెక్టర్ ప్రేమ్‌చంద్ చౌదరి సాక్షి ప్రతినిధికి తెలిపారు. రూ.750 కోట్లతో తక్షణ సహాయచర్యలు తుపాను దరిమిలా వెంటనే రాష్ట్ర విపత్తు స్పం దన నిధి నుంచి ఒడిశా ప్రభుత్వం రూ.750 కో ట్లు విడుదల చేసింది. ఆ నిధులతో సహాయ, పునరుద్ధరణ, పునర్నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టింది. గంజాం, గణపతి, రాయగడ జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్లన్నీ పునరుద్ధరించినట్టు ఆ రాష్ట్ర సీఎస్ వెల్ల డించారు. బాగా దెబ్బతిన్న గంజాం జిల్లాలోని సురడా–దరింగబడి మార్గం కూడా పునరుద్ధరించారు. 650 గ్రామీణ ప్రాంతాల్లో 570 గ్రామాలకు తాగు నీటి సరఫరా పునరుద్ధరణ పూర్తి కాగా గ్రామీణ ప్రాం తాల్లో గొట్టపు బావుల మరమ్మతు, పునరుద్ధరణ కూడా పూర్తయింది. గజపతి జిల్లా మినహా మిగతా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. పంటనష్టానికి గురైన బాధిత రైతాంగానికి రూ.270 కోట్లకు పైబడి పెట్టుబడి సబ్సిడీ ముం జూరు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని సీఎస్ తెలిపారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఒక్కసారి మా త్రమే రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని గంజాం జిల్లా కలెక్టర్ తెలిపారు. ‘సీఎంతో పాటు సీఎస్ ఆదిత్యప్రసాద్, ఉన్నతాధికారులు రాజధాని భువనేశ్వర్ నుంచే ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, ఆ మేరకు సూచనలిస్తూ సహాయక చర్యలు వేగంగా జరిగేలా చూశారు’అని చెప్పారు. సీఎం హడావుడి లేదు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఒక్కసారి మాత్రమే రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని గంజాం జిల్లా కలెక్టర్ తెలిపారు. మరోసారి గంజాం జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించారన్నారు. ‘సీఎంతో పాటు సీఎస్ ఆదిత్యప్రసాద్, ఉన్నతాధికారులు రాజధాని భువనేశ్వర్ నుంచే ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, ఆ మేరకు సూచనలిస్తూ సహాయక చర్యలు వేగంగా జరిగేలా చూశారు. సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం కలగకుండా మంత్రులు, ప్రజాప్రతినిధులు వరద ప్రాంతాల్లో పర్యటించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు..’ అని చెప్పారు. కాగా రాష్ట్రానికి రూ.2,765 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసి ప్రధానమంత్రికి పట్నాయక్ లేఖ రాశారు. రూ.750 కోట్లు రాష్ట్ర విపత్తు నిధి నుంచి ఖర్చు చేస్తున్నామని మిగిలిన రూ.2,015 కోట్లు జాతీయ విపత్తు నిధి నుంచి విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సిక్కోలులో తొలగని చిక్కులు తుపాను సహాయక చర్యల్లో ఏపీ ప్రభుత్వం అడుగులు ఇప్పటికీ తడబడుతూనే ఉన్నాయి, శ్రీకాకుళం జిల్లాలోని 18 మండలాల్లో తిత్లీ ప్రభావానికి అన్ని రంగాలూ కుదేలవ్వగా.. ఇప్పటికీ ఏ ఒక్క రంగం కూడా పూర్తిస్థాయిలో గాడిన పడలేదు. జిల్లా వ్యాప్తంగా 38 మండలాల్లోని 4,319 గ్రామాల్లో విద్యుత్‌కు అంతరాయం వాటిల్లగా ఆదివారం నాటికి కూడా 1,492 గ్రామాల్లో పునరుద్ధరణ కాలేదని ఏపీఈపీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ గ్రామాలే అంధకారంలో ఉన్నాయని సమాచారం. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి చూస్తుంటే పూర్తిస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ జరగాలంటే కనీసం మరో రెండు వారాలైనా పడుతుందని ఈపీడీసీఎల్ వర్గాలే లోపాయికారీగా అంగీకరిస్తుండటం గమనార్హం. -
టీడీపీ ఎంపీకి చేదు అనుభవం
సాక్షి, శ్రీకాకుళం : తెలుగు దేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడికి చేదు అనుభవం ఎదురైంది. టిట్లీ తుఫాను బాధితులను పరామర్శించటానికి వెళ్లిన ఆయనను బాధితులు నిలదీశారు. సహాయం అందించకుండా ఊరికే ఎందుకు తిరుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వచ్చిన పనిపూర్తవకుండానే ఎంపీ వెనుదిరగాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఎంపీ రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లాలోని కవిటి మండలం పనగానిపుట్టుగ గ్రామంలోని తుఫాను బాధితులను పరామర్శింటానికి వెళ్లారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తుఫాను బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించిందని, నీళ్లు ఇతర అవసరాలను తీర్చిందని చెబుతున్న నేపథ్యంలో గ్రామస్తులు ఒక్కసారిగా తిరగబడ్డారు. తమకు ఎలాంటి సహాయం అందలేదని, విద్యుత్ సౌకర్యం ఇప్పటివరకు పునరుద్ధరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన పంట అంచాన వేయటానికి ఏ ఒక్క అధికారి కూడా ఊరికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సహాయం అందించకుండా ఊరికే ఎందుకు తిరుగుతున్నారిని నిలదీశారు. దీంతో ఆయన అక్కడి వెళ్లిపోయారు. -
ఆదుకోవడం చేతకాక కేంద్రంపై నిందలు
వజ్రపుకొత్తూరు రూరల్ : శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాక కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిందలు వేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. తుపాను బాధితులకు పూర్తిస్థాయిలో సాయం కూడా అందించలేని స్థితిలో చంద్రబాబు సర్కార్ ఉందన్నారు. వజ్రపుకొత్తూరు మండలం చినవంక, పల్లిసారథి గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. బాధితులతో మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో వెంకటరమణ మాట్లాడుతూ కేవలం మూడు నియోజకవర్గాల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లితే.. రాష్ట్రం మోత్తానికి నష్టం కలిగినట్లు తమ దగ్గర డబ్బుల్లేవని, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దాతలు ముందుకు రావడం లేదని కుంటిసాకులు చెబుతూ చంద్రబాబు తప్పించుకుంటున్నారని మండి పడ్డారు. తుపాను తీవ్ర నష్టం కలిగిస్తే బాధితులకు కంటి తుడుపు చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. తుపాను ప్రభావిత గ్రామాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజల అవసరాలు తీరుస్తున్నామని, విద్యుత్ పునఃరుద్ధరించామని ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారన్నారు. పలాస మున్సిపాలిటీ పరిధి 3 వార్డు తాళబద్రలో ప్రజలు తమను పట్టించుకునే వారే కరువయ్యారని పాలకుల తీరు పట్ల నిరసనలు వ్యక్తం చేశారంటే చంద్రబాబు ఏ మేరకు పనులు చేస్తున్నారో అర్థమవుతోందని హేళన చేశారు. తుపాను సంభవించి 10 రోజులు గడుస్తున్నా ప్రజలు నేటికీ నానా ఇబ్బందులు పడుతున్నారని, అయితే ఎవరూ ఎటువంటి ఇబ్బందులు పడటం లేదని, 80 శాతం పనులు పూర్తి చేశామని ముఖ్యమంత్రి ప్రకటించడం బాధాకరమన్నారు. పచ్చని ఉద్దానం నేడు మోడు బారిందని.. దీనిని చూసేవారికి కన్నీళ్లు ఆగడం లేదన్నారు. చేసిన అప్పులు తీర్చలేక, బతుకు తెరువుకు మార్గం కనిపించక చినవంకలో సైని నారాయణ్మ తనువు చాలించిందని.. సర్కార్ సకాలంలో బాధితులను ఆదుకోకపోతే ఇలాంటి పరిమాణాలు మరన్ని తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బాధితులకు ప్రభుత్వం ఉదార సానుభూతితో ఆదుకోవాలని సూచించారు. ప్రభుత్వ అసమర్ధతను బాధితులు విమర్శిస్తుంటే వారిపై కేసులు పెట్టి ఆరెస్టులు చేయడం సరికాదని, ప్రజా ఉద్యమాల ముందు పాలకులు తలదించాలన్నారు. మృతుని కుటుంబానికి పరామర్శ తుపానుతో జీడితోట నాశనం కావడంతో మనస్తాపంతో శుక్రవారం ఆత్మహత్యకు పాల్డడిన చినవంక గ్రామానికి చెందిన సైని నారాయణమ్మ కుటుంబ సభ్యులను మోపినేని వెంకటరమణ, పలాస నియోజకవర్గ వై?ఎస్ఆర్సీపీ కన్వీనర్ సీదిరి అప్పలరాజులు పరామర్శించి వారిని ఓదార్చారు. కుటుంబానికి ప్రభుత్వమే ఆదుకోవాలని డిమోండ్ చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి దువ్వాడ హేమబాబు చౌదరి, బల్ల గిరిబాబు, మండల అధ్యక్షు డు పి.గురయ్యనాయుడు, పీఎసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ మధుకేశ్వరరావు, దువ్వాడ జయరాం చౌదరి, జుత్తు నీలకంఠం, సీదిరి త్రినా«థ్, మోహనరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వడిస హరిప్రసాద్, మామిడి నర్సింహులు, ధర్మారావు ఉన్నారు. తుపానులో బాబు రాజకీయం మందస : ప్రకృతి విపత్తులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని, ఇది రాజకీయం చేసే సమయమేనా అని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోపిదేవి వెంకటరమణ ధ్వజమెత్తారు. మందస మండలంలోని నారాయణపురం, హరిపురం పంచాయతీల్లో ఆయన పర్యటించారు. తిత్లీ తుపానుకు ఈ ప్రాంతం అతలాకుతమైందన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో నష్టం వాటిల్లిందని, పూడ్చలేని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం బాధితులను ఆదుకోవాల్సింది పోయి, బాధిత ప్రాంతాల్లో రాజకీయం చేస్తోందని ఆరోపించారు. పార్టీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ తుపానుతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఈ తరుణంలో ప్రజలను ఓదార్చాల్సిన ముఖ్య మంత్రి ఇష్టానుసారం మాట్లాడడం సరికాదన్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు బనాయించి వేధిం చడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. బాధితులను కలిసి వెంకటరమణ, అప్పలరాజులు ఓదార్చారు. కొబ్బరి, జీడి, మామిడితో పాటు ఉద్దాన పంటలను పూర్తిగా నష్టపోయామని బాధితులు వారికి వివరించారు. నాయకులు జుత్తు నీలకంఠం, ఆనల వెం కటరమణ, భాస్కరరావు, మావుడెల్లి జనార్దన పాల్గొన్నారు. -
‘చంద్రబాబు ఆ ఆలోచనలు మానుకోవాలి’
సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శవాలమీద పెంకులేరుకోవాలనే ఆలోచనలు మానుకోవాలని ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం టిట్లీ తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించారాయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిట్లీ తుఫాన్ కారణంగా శ్రీకాకుళం తీవ్రంగా నష్టపోయిందన్నారు. జీడి, మామిడి, కొబ్బరి పంటలకు కోలుకోలేని నష్టం వాటిల్లిందని, పచ్చగా ఉండాల్సిన ప్రాంతం స్మశానంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్ నాధ్ సింగ్‌కు టిట్లీపై రిపోర్టు అందజేశామన్నారు. హూద్ హుద్ కంటే ఎక్కువగా రైతుకు పెద్ద నష్టం కలిగిందని చెప్పారు. బీజేపీ తరుపున మృతుల కుటుంబాలకు 10 వేల రూపాయల ఆర్ధికసాయం చేస్తామని తెలిపారు. చంద్రబాబుకు రాజకీయాలు కావాలని.. తమకు సమస్యలు కావాలని పేర్కొన్నారు. రాజకీయాలతో ఈ ప్రాంతానికి లాభం జరగదని, కేంద్రం ఉదారంగా ఆదుకుంటుందని చెప్పారు. సీఎం తన ప్రచారం కోసం అధికారులను వెంటేసుకుని తిరుగుతున్నాడని అన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘తుఫాన్‌ను అడ్డం పెట్టుకుని ప్రచారం చేసుకోవద్దు. ఈరోజు పది గ్రామాల్లో పర్యటించా... ఆ గ్రామాల్లో ఎక్కడా తాగునీరు కూడా అందడం లేదు. నిజంగా నష్టపోయిన ప్రాంతాలకు ఏమీ అందడం లేదు. సహయక చర్యలు తూతూ మంత్రంగానే సాగుతున్నాయి. ఇప్పటికైనా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు తాగునీరందించండి. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్రానికి ఇక్కడి పరిస్థితిని వివరిస్తా. మూడేళ్ల పాటు 300 రోజుల ఉపాధి హామీ పధకం అమలు చేయాలని కేంద్రాన్ని కోరతాం. ఇంతనష్టం జరిగినా ఇక్కడి పరిస్థితులపై తగినంత ప్రచారం జరగలేదు. గ్రామాల దత్తతకు పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలు ముందుకు రావాలి. కేంద్రంతో మాట్లాడి నష్టం అంచనా కోసం బృందాన్ని రప్పిస్తా’’మన్నారు. -
శ్రీకాకుళం ప్రజలకు విద్యుత్ శాఖ ఊరట
సాక్షి, శ్రీకాకుళం : టిట్లీ తుఫాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీకాకుళం జిల్లా ప్రజలకు విద్యుత్ శాఖ ఊరటనిచ్చింది. ఈ నెల కరెంట్ ఛార్టీలను వచ్చే నవంబరులో కట్టుకునే వెసులుబాటును కల్పించింది. దీనికి ఎలాంటి అపరాద రుసుం వసూలు చేయరని తెలిపింది. టిట్లీ తుఫాను కారణంగా కష్టాల్లో ఉన్న ప్రజలకు భారం కలిగించకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈసీడీసీఎల్ కంపెనీకి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. -
‘‘టిట్లీ’’ బాధితులకు ఐఏఎస్‌ల బాసట
సాక్షి, శ్రీకాకుళం : టిట్లీ తుఫాన్ బాధితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఏఎస్ అధికారులు బాసటగా నిలిచారు. తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు వారు ప్రకటించారు. బాధితులకు బాసటగా నిలవటానికి ఒక రోజు వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వాలని ఐఏఎస్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఐఏఎస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే సహాయక చర్యల్లో ఐఏఎస్ అధికారులు పెద్ద సంఖ్యలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని, త్వరలోనే అక్కడ సాధారణ పరిస్థితులు వస్తాయని ఐఏఎస్‌ల సంఘం ఆశాభావం వ్యక్తం చేసింది. -
‘బాబుకు ప్రజల ఆకలి కేకలు వినిపించటం లేదా?’
సాక్షి, శ్రీకాకుళం : టిట్లీ తుఫాను బాధితులకు న్యాయం జరిగేంతవరకు శ్రీకాకుళం జిల్లాలోనే ఉంటానని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రజల ఆకలి కేకలు వినిపించటం లేదా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టిట్లీ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో అపార నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇంత భారీ స్థాయిలో నష్టం జరుగుతుందని అంచనా వేసినా.. తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జనం కనీసం మంచినీరు కూడా లేకపోవటంతో.. దాహంతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినా, వాటిని తగ్గించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. తమ అనుకూల మాధ్యమాల్లో ఆహా! ముఖ్యమంత్రి ఓహో! అంటూ బయట ప్రపంచానికి ప్రసారం చేసుకుంటున్న అధికార పార్టీ నేతలను ప్రజలు తుఫాను బాధిత ప్రాంతాల్లో అడుగడుగునా నిలదీస్తున్న విషయం కనిపించటం లేదా అంటూ ప్రశ్నించారు. -
శాంతించని సమస్యలు!
-
ఆకలితీర్చే వారి కోసం ఎదురుచూపు!
సాక్షి, శ్రీకాకుళం : టిట్లీ తుఫాను విలయం సృష్టించి 5రోజులు అవుతున్నా! ప్రభుత్వం మాత్రం సరిగా పట్టించుకోవటం లేదు. మంచినీరు, ఆహారం కోసం తుఫాను బాధితులు ఆహాకారాలు చేస్తున్నారు. సహాయక బృందాలు సైతం బాధిత ప్రాంతాలకు చేరుకోకపోవటం గమనార్హం. పాతపట్నం, ఇచ్చాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లోని గ్రామాల ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి సమీక్షించినా పనులు అరకొరగానే జరుగుతున్నాయి. ఆదివారం ప్రభుత్వ అధికారుల పనితీరును నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లాలో ఆందోళనలు మిన్నంటిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు సంబంధిత అధికారలు విద్యుత్ పునరుద్దరణ పనులు వేగవంతం చేశారు. దాదాపు 300గ్రామాలకు అధికారుల బృందాలు ఇంకా చేరుకోలేదు. ఇళ్లుకూలిపోయి నిరాశ్రయులు అయిన వారికి పునరావాసం కల్పించటంలో అధికారులు విఫలమయ్యారు. నాలుగు రోజులు గడిచినా! వందల కొద్ది నిరుపేద కుటుంబాలకు ఇప్పటివరకు అన్నం మెతుకు కూడా దొరకలేదు. -
‘గుండె మంటల్లో బాబు చలికాచుకుంటాడు’
-
‘గుండె మంటల్లో బాబు చలికాచుకుంటాడు’
సాక్షి, పలాస/శ్రీకాకుళం : టిట్లీ తుపాను కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతోంటే సమీక్షల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయక చర్యలను ఆలస్యం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. సర్వం కోల్పోయిన ప్రజలు గుండెలు మండుతోంటే ఆ మంటల్లో కూడా చంద్రబాబు చలికాచుకుంటాడని విమర్శలు గుప్పించారు. తుపానుతో అల్లాడిపోయిన తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని పేర్కొంటూ జల్లాలోని ఉద్ధానం, కొత్తూరు జంక్షన్, పాతపట్నం, పలాసలో ప్రజలు ఆందోళనకు దిగారు. రోడ్లపై నిరసనలు, ధర్నాలు చేశారు. పలాసలోని సున్నాదేవి సెంటర్లో జరిగిన నిరసనలో భూమన పాల్గొన్నారు. మూడు రోజులుగా అంధకారంలో మగ్గుతున్న ప్రజలకు కనీస సదుపాయలు కూడా కల్పించకపోవడం దారుణమని ఆయన నిప్పులు చెరిగారు. తుపాను బాధితులకు సాయం చేస్తామనే చంద్రబాబు ప్రకటనలు ఆయన చేసిన ఎన్నికల వాగ్దానాల తీరుగానే ఉన్నాయని ఎద్దేవా చేశారు. టిట్లీ తుపాను వచ్చిపోయిన మూడు రోజుల తర్వాత కూడా అధికారులు ప్రజలకు అందుబాటులో లేకపోవడంపై భూమనల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, ఆందోళనలకు దిగుతున్నారనీ, ఇది ముమ్మాటికీ చంద్రబాబు ప్రభుత్వ ప్రభుత్వ వైఫల్యేమేనన్నారు. బాబు టెక్నాలజీ ఏమైంది? బాధిత కుటుంబాలను ఆదోకోవడంలో కూడా చంద్రబాబు స్వలాభం చూసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిదీ ఎన్నికల దృష్టితో ఆలోచించే ముఖ్యమంత్రి అధికారుల సేవలు వినియోగించుకోవడం లేదని విమర్శించారు. అధికారులు పంటనష్టం అంచనాలు వేయకపోవడంతో రైతులు తీవ్ర వేదనకు గురవుతున్నారని అన్నారు. టెక్నాలజీ వాడుకోవడంలో నేనే నెంబర్‌వన్ అని చెప్పుకునే బాబు మూడు రోజులు గడిచినా విద్యుత్ పునరుద్ధరణకై చర్యలు తీసుకోకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంలో చంద్రబాబు టెక్నాలజీని వాడుకున్నట్టా? అని ప్రశ్నించారు.కాగా, పలాస-మందస హైవేపై రైతుల దర్నాతో వందలాది వాహనాలు నిలచిపోయాయి. ‘ప్రభుత్వం తీరు చూస్తుంటే.. తిండికోసం రాయలసీమలో గతంలో జరిగిన కరవుదాడులు గుర్తుకొస్తున్నాయి. ప్రజల ఆకలి తీర్చని రోజున రోడ్లపై నిలిచిన వాహనాలపై దాడులు చేసి మరీ ఆహారాన్ని తీసుకునే పరిస్థితి తలెత్తవచ్చు’ అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా... కొత్తూరు జంక్షన్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. తహసీల్దారును గ్రామస్తులు నిర్భందించారు. తమను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కన్నీరే మిగిలింది!
-
ఉద్దానం అతలాకుతలం
-
టిట్లీ భీభత్సం.. 12మంది మృతి
సాక్షి, భువనేశ్వర్ : టిట్లీ తుఫాను కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో 12మంది మృతిచెందగా నలుగురి ఆచూకీ గల్లంతయ్యింది. ఈ సంఘటన ఒడిసాలోని గజపతి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గురువారం గజపతి జిల్లాలోని బరఘారా గ్రామానికి చెందిన గిరిజనుల పాకలు టిట్లీ తుఫాను కారణంగా నేలమట్టమయ్యాయి. దీంతో తుఫాను బారినుంచి ప్రాణాలు రక్షించుకోవటానికి 22మంది గిరిజనులు దగ్గరలో ఉన్న కొండగుహలో తలదాచుకున్నారు. భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగి గుహలో ఉన్న 16మంది గిరిజనులపై పడ్డాయి. దీంతో 12మంది అక్కడిక్కడే మృతిచెందగా మరో నలుగురి ఆచూకీ గల్లంతయ్యింది. రాయగడా బ్లాక్ ఛైర్మన్ ధలేశ్వర్ భుయన్ మాట్లాడుతూ.. కొండచరియలు విరిగిపడి మరణించిన 12మంది మృతదేహాలను గుర్తించామన్నారు. మరో నలుగురి ఆచూకీ లభించలేదని తెలిపారు. గ్రామం మారుమూలన ఉండటం వల్లే ఈ విషాదం ఆలస్యంగా వెలుగుచూసిందని పేర్కొన్నారు. -
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ పర్యటన: ధర్మాన
శ్రీకాకుళం: తుపాను ప్రభావిత ప్రాంతాలైన ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో ఈ రోజు, నర్సన్నపేట, టెక్కలి నియోజకవర్గాల్లో రేపు వైఎస్సార్సీపీ నాయకుల పర్యటన ఉంటుందని వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. శ్రీకాకుళంలో విలేకరులతో ధర్మాన మాట్లాడుతూ.. తుపాను తీవ్రతను ప్రజలకు ప్రభుత్వం చెప్పలేకపోయిందని విమర్శించారు. తీవ్రతను అంచనా వేసి ఆ మేరకు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పడవలు, వలలు కొట్టుకుపోయి మత్స్యకారులు విపరీతంగా నష్టపోయారని, లక్షల ఎకరాల్లో వరి, జీడిమామిడి, కొబ్బరి, మామిడి పంటలకు నష్టం జరిగి భారీగా ఆస్తి నష్టం ఏర్పడిందన్నారు. హుద్‌హుద్ సహాయమే ఇంకా రైతులకు అందలేదని వెల్లడించారు. ముఖ్యమంత్రి ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు సంబంధమే లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లేవని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంకా రాలేదని తెలిపారు. మూడు రోజులుగా తుపాను హెచ్చరికలు ఉన్నా, బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. ఇంకా చాలా ప్రాంతాల్లో కరెంటు పునరుద్ధరణ లేదని తెలిపారు. ముఖ్యమంత్రికి పబ్లిసిటీ పిచ్చి ఉంది తప్పితే.. బాధితులకు సహాయం చేయడంలో శ్రద్ధ లేదని ధ్వజమెత్తారు. విపత్తుల్లో ఉన్నా చంద్రబాబు ఆదుకోరని ప్రజలకు అర్ధమైందన్నారు. అత్యవసర పనుల్లో వినియోగించే వారికి చెల్లింపులు కూడా సరిగ్గా చేయకపోవడంతో ఇప్పుడు ఎవ్వరూ ముందుకు రావడానికి ఇష్టపడటం లేదని వ్యాఖ్యానించారు. తిత్లీ తుపాను నష్టంపై ధర్మాన నేతృత్వంలో కమిటీ తిత్లీ తుపాను వల్ల దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లాలో ఆస్తి, పంట నష్టాన్ని అంచనా వేసేందుకు, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీలో భూమన కరుణాకర్ రెడ్డి, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, రెడ్డి శాంతి, పార్టీ జిల్లా వ్యవసాయ విభాగం అధ్యక్షులు రఘురాం సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ రేపటి నుంచి తిత్లీ తుపాను వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి నష్టం నివేదికను పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌కు అందజేస్తారు. -
పలు రైళ్ల రద్దు..
తాటిచెట్లపాలెం(విశాఖపట్నం)/విజయనగరం గంటస్తంభం: తిత్లీ తుపాను బీభత్సానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లు గురువారం రద్దయ్యాయి. రైల్వే ట్రాక్‌లపై చెట్లు పడిపోవడం, సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతినడంతో ముందు జాగ్రత్తగా పలు రైళ్లను నిలిపివేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. సంత్రగచ్చి–చెన్నై స్పెషల్, హౌరా–చెన్నై(కోరమండల్ ఎక్స్‌ప్రెస్), హౌరా–యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు–భువనేశ్వర్(ప్రశాంతి ఎక్స్‌ప్రెస్), యశ్వంత్‌పూర్–భాగల్పూర్ ఎక్స్‌ప్రెస్, హౌరా–హైదరాబాద్(ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్), ఖరగ్‌పూర్–విల్లుపురం ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–హౌరా(ఈస్ట్‌కోస్ట్) రైళ్లను గురువారం రద్దు చేశారు. అవసరం మేరకు రైళ్ల రద్దు, సమయవేళల్లో మార్పులు ఉంటాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులకు అవస్థలు.. రైళ్ల రద్దుతో దూరప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు విశాఖ, విజయనగరం రైల్వే స్టేషన్లలో తీవ్ర అవస్థలు పడుతున్నారు. పిల్లాపాపలు, లగేజీలతో ప్లాట్‌ఫాంల మీద పడిగాపులు కాస్తున్నారు. హెల్ప్‌లైన్ కింద ఏడు ఫోన్లు ఏర్పాటు చేసినప్పటికీ.. ఇద్దరు సిబ్బందినే కేటాయించడంతో ప్రయాణికులకు సరైన సమాచారం అందలేదు. కొద్దిసేపటికి వీరు కూడా ఫోన్లు తీసి పక్కన పెట్టేయడంతో సమాచారం చెప్పే దిక్కులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైళ్ల సమాచారం కోసం ఎంక్వైరీ కౌంటర్ల వద్ద బారులుదీరారు. కాగా, భీకర గాలుల ధాటికి పలాస రైల్వే స్టేషన్ తీవ్రంగా దెబ్బతిందని ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారి ఒకరు చెప్పారు. పలుచోట్ల సిగ్నలింగ్ వ్యవస్థ పాడైందని వివరించారు. బరంపురం–కోటబొమ్మాళి మధ్య విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిందని పేర్కొన్నారు. ఆయా ప్రదేశాల్లో మరమ్మతు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. (విజయనగరం జిల్లాలో బస్సుపై కూలిన చెట్టు) -
తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలి : వైఎస్ జగన్
సాక్షి, విజయనగరం : తుపాను ప్రభావంతో ఇప్పటివరకు 8 మంది చనిపోయారనీ, తీవ్ర ఆస్తి, పంట నష్టాలు కూడా సంభవించాయనీ ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధర్మాన నేతృత్వంలో తిత్లీ నష్టంపై కమిటీ తిత్లీ తుపాను వల్ల దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లాలో ఆస్తి నష్టాన్ని అంచనా వేసేందుకు, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో కమిటీని నియమించారు. భూమన కరుణాకర రెడ్డి, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, రెడ్డి శాంతి, పార్టీ జిల్లా వ్యవసాయ విభాగం అధ్యక్షుడు రఘురామ్ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ కమిటీ శుక్రవారం నుంచి బాధిత ప్రాంతాల్లో పర్యటించి జరిగిన నష్టాన్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నివేదిస్తుందని పత్రికా ప్రకటనను జారీ చేశారు. -
శ్రీకాకుళం: ‘టిట్లీ’ తుపాను పెనుగాలులు భీభత్సం
-
‘టిట్లీ’ తుపాను భీభత్సం
-
తుపానుపై అప్రమత్తం
విశాఖసిటీ: టిట్లీ తుపానును దీటుగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉం దని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తుపాను హెచ్చరిక కేంద్రానికి వెళ్లిన కలెక్టర్ వాతావరణ పరిస్థితిని, జిల్లాపై టిట్లీ ప్రభావాన్ని కేంద్రం డైరెక్టర్ రామచంద్రమూర్తిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టిట్లీ ప్రభావం జిల్లాలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాలతో పాటు తీరప్రాంత మండలాలపై తీవ్రంగా ఉంటుందన్నారు. గంటకు 150 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ఆ సమయంలో ఎవరూ బయటికి రాకుండా ఇళ్లల్లోనే ఉండాలని జిల్లా ప్రజలకు సూచించారు. కచ్చా ఇళ్లు, రోడ్లు, రైల్వే లైన్లకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. ప్రమాద తీవ్రతకు గురయ్యే వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న సుమారు 40 బోట్లు గంజా పోర్టుకు సురక్షితంగా చేరాయని తెలిపారు. విశాఖ పోర్టు, గంగవరం పోర్టులకు పెద్ద ముప్పు వాటిల్లనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో బెర్తులపై బోట్లకు సురక్షిత ఏర్పా ట్లు చేశారని వివరించారు. విద్యుత్, పోలీస్, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, వ్యవసాయ, పశుసంవర్ధక, రవాణా తదితర శాఖలన్నీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రౌండ్‌ది క్లాక్ ఆయా ఉద్యోగులంతా విధుల్లో పనిచేస్తూ క్షేత్ర స్థాయిలోనే ఉన్నారని తెలిపారు. అధికారులందరికీ సెలవులు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మత్స్యకార గ్రామాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. కలెక్టరేట్ కంట్రోల్‌రూమ్ టోల్‌ఫ్రీ నం.180042500002కి ప్రజలు కాల్ చేసి సమస్యలు చెప్పాలన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ మంత్రి గంటా సందర్శన టిట్లీ తుపాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌ని మంత్రి సందర్శించారు. తు పాను నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. రిలీఫ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ కేంద్రాల్లో తగినన్ని ఆహార నిల్వలు, తాగునీరు ఉండేలా చూడాలని సూచించారు. వైద్యారోగ్య బృందాలను కూడా ఆయా కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాలన్నారు. మంత్రి వెంట జిల్లా రెవెన్యూ అధికారి సి.చంద్రశేఖర్‌రెడ్డి, కమాండ్ కంట్రోల్ రూమ్ ఇన్‌ఛార్జి ఉన్నారు. -
‘టిట్లీ’ టెర్రర్!
సాక్షి, విశాఖపట్నం: ‘టిట్లీ’ తుపాను టెర్రర్ పుట్టిస్తోంది. గంటగంటకు ఉధృతమవుతూ విశాఖ వాసులకు దడ పుట్టిస్తోంది. తొలుత వాయుగుండంగా, ఆపై తుపాను, తీవ్ర తుపాను, అతి తీవ్ర తుపానుగాను బలపడుతూ వచ్చింది. చివరకు పెను తుపానుగానూ రూపాంతరం చెందే స్థితికి వచ్చింది. ఇదే ఇప్పుడు అందరిలోనూ ఆందోళనకు కారణమవుతోంది. నాలుగేళ్ల క్రితం సంభవించిన హుద్‌హుద్ సూపర్ సైక్లోన్ పెను విలయం సృష్టించింది. ఆ తర్వాత మూడు నాలుగు తుపానులు ఏర్పడినా అవి సాధారణమైనవే కావడంతో విశాఖపై ప్రభావం చూపలేదు. కానీ ఇప్పుడు కొనసాగుతున్న టిట్లీ తుపాను అతి తీవ్ర తుపాను కావడం, ఉత్తరాంధ్రకు సమీపంలో తీరాన్ని దాటుతుండడం వల్ల దాని ప్రభావం విశాఖపై చూపుతోంది. మంగళవారంకంటే బుధవారం ఈదురుగాలుల తీవ్రత అధికంగా ఉంది. బుధవారం మధ్యాహ్నానికి అతి తీవ్ర తుపానుగా బలపడడం వల్ల గాలుల ఉధృతి బాగా పెరిగింది. గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గురువారం తుపాను తీరం దాటే సమయం సమీపించే కొలదీ గాలుల తీవ్రత గంటకు 140 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఈ పెనుగాలులు ఎలాంటి విధ్వంసానికి కారణమవుతాయోనని జనం భయాందోళన చెందుతున్నారు. సాధారణంగా తుపాన్ల సమయంలో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీస్తుంటాయి. వర్షాలకు ఇళ్లు, చెట్లు నాని ఉండడం, దానికి గాలులు తోడైతే అవి కూలిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అయితే ఈ టిట్లీ తుపాను ప్రభావం ఆరంభమైనప్పటికీ బుధవారం రాత్రి వరకు చిరుజల్లులే తప్ప భారీ వర్షం కురవలేదు. దీంతో గాలులే అలజడి రేపుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి దాటాక వర్షంతో పాటు పెనుగాలులు వీస్తాయని, దీంతో విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సహాయక చర్యల్లో.. వాతావరణశాఖ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మండల, డివిజన్ కేంద్రాల్లో అధికారులు అందుబాటులో ఉంచారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, కోస్ట్‌గార్డు బృందాలు సహాయక చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో 11 మండలాల్లోని 156 గ్రామాల్లో తుపాను ప్రభావం ఉంటుందని గుర్తించారు. వీటిలో ఆనందపురం, భీమిలి, పద్మనాభం, విశాఖపట్నం అర్బన్, రూరల్ జిల్లాలపై టిట్లీ ప్రభావం అధికంగా ఉండనుంది. ఆయా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న 2,82,570 మందిని తరలించడానికి సన్నద్ధం చేశారు. ఇంకా 139 తుఫాను షెల్టర్లు, 157 సహాయ, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 130 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. సహాయ చర్యలకు సన్నద్ధం విశాఖసిటీ: ఉత్తరాంధ్ర పై విరుచుకుపడనున్న టిట్లీ తుఫాను రక్షణ చర్యల్లో పాల్గొనేందుకు తమ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తూర్పు నౌకాదళం బుధవారం రాత్రి ప్రకటించింది. తుఫాను బాధిత ప్రాంతాల్లో ప్రజలకు పూర్తిస్థా యి సహాయ సహకారాలు అందించడంతో పాటు వైద్య సదుపాయాల వంటి లాజిస్టిక్ సపోర్ట్ అందించేందుకు భారత నౌకాదళం అప్రమత్తంగా ఉందని వెల్లడించింది. అత్యంత ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనేందుకు భారత యుద్ధ నౌకలు సన్నద్ధంగా ఉన్నాయని నౌకాదళాధికారులు తెలిపారు. అదనపు గజ ఈతగాళ్లు, వైద్యులు, రబ్బరు పడవలు, ఆహార పదార్థాలు, తాత్కాలిక వస్తువులు, దుస్తులు, మందులు, దుప్పట్లు వంటి వాటిని అవసరమైన మేరకు అందించేందుకు సిద్ధం చేశామన్నారు. అంతే కాకుండా విశాఖపట్నం నుంచి జెమిని బోట్లతో పాటు డైవింగ్ సిబ్బందితో కూడిన బృందాలు ఇప్పటికే ఐఎన్ఎస్ చిల్కాలో మోహరించాయని తెలిపారు. తుఫాను తీవ్రత మొదలైన క్షణం నుంచి సహాయక చర్యలకు ఉపక్రమించేందుకు సిద్ధం చేసినట్లు వివరించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయడంతో పాటు వాటిని ఎలా అభివృద్ధి చెయ్యాలనే విషయాలపై తూర్పు నౌకాదళం ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుందని తెలిపారు. ఐఎన్ఎస్ డేగాలో ఎయిర్ క్రాఫ్టులు ప్రమాదపు పరిస్థితుల వద్దకు చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని నౌకాదళాధికారులు వివరించారు. విమాన సర్వీసులకు అంతరాయం గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): విశాఖలో టిట్లీ తుపాను గాలుల ప్రభావం బుధవారం విమాన సర్వీసులపై పడింది. ఉదయం ఎని మిది గంటలకు ఎప్పటిలాగే ఇండిగో విమా నం చెన్నై నుంచి విశాఖకు వచ్చింది. ఎయిర్‌పోర్టులో దిగడానికి వాతావరణం అనుకూలించలేదు. ఉధృతంగా గాలులు వీయడంతో ఈ విమానం రాయపూర్‌కి మళ్లింది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ విమానాశ్రయానికి వచ్చింది. మరో అరగంటలో బయలుదేరి భువనేశ్వర్ మీదుగా కోల్‌కతా వెళ్లింది. నాలుగు గంటల పాటు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం తప్పలేదు. తర్వాత నుంచి మరి కొన్ని విమాన సర్వీసులకు గాలులు అంతరాయమైనా పావుగంట సేపు చొప్పున చక్కర్లు కొట్టి దిగాయి. మల్కాపురం(విశాఖ పశ్చిమ): టిట్లీ తుఫాన్ ప్రభావంతో యారాడ తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. బుధవారం ఉదయం సముద్రం ఐదు అడుగుల ముందుకు వచ్చింది. చల్లటి గాలులతోపాటు అలలు ఎగసిపడుతుండడంతో వాకింగ్ వచ్చిన యువకులు, నేవల్ అధికారులు వెనుదిరిగారు. -
తీరం దాటిన తుపాను
-
బీభత్సం సృష్టిస్తున్న టిట్లీ తుపాను
-
శ్రీకాకుళం జిల్లాను వణికిస్తున్న ‘టిట్లీ’ తుపాను
సాక్షి,అమరావతి : ఉత్తరాంధ్రను వణికిస్తున్న ‘టిట్లీ’ తుపాను శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారథి వద్ద ఈరోజు ఉదయం తీరాన్ని దాటింది. తీరం దాటిన సమయంలో పెనుగాలులు భీభత్సం సృష్టించాయి. గంటకు 110 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. తుపాను తీరాన్ని దాటినప్పటికీ వజ్రపుకొత్తూరు, సోంపేట, తదితర మండలాల్లో గాలులు, వర్షభీభత్సం కొనసాగుతోంది. పలు ప్రాంతాలలో ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. బలమైన గాలులు వీచడంతో చెట్లు, పూరిగుడిసెలు, ఇళ్లు నేలమట్టమవుతున్నాయి. కుండపోతగా వర్షం కురుస్తుండటంతో పాటు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. అనేక చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పెనుగాలు కారణంగా శ్రీకాకుళం జిల్లాలో చాలాచోట్ల విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో అనేక ప్రాంతాల్లో చిమ్మచీకట్లు అలుముకున్నాయి. #WATCH: Latest visuals from Andhra Pradesh's Srikakulam. #TitliCyclone made a landfall in the region early morning today. pic.twitter.com/ckoGJblyti — ANI (@ANI) October 11, 2018 డబ్బులు తిరిగి చెల్లించాం.. టిట్లీ తుపాను కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయయని రైల్వే సీనియర్ డివిజనల్ మేనేజర్ సునీల్ కుమార్ తెలిపారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ప్రయాణికులసహాయార్థం 12 హెల్ప్లైన్లను ఏర్పాటు చేసామని తెలిపారు. నిన్న 8 రైళ్లు, ఈ రోజు మరో 8 రైళ్లను రద్దు చేసామనీ, 9 రైళ్లను దారి మళ్లించామని వెల్లడించారు. రద్దయిన రైళ్లకు సంబంధించిన 500 మందిప్రయాణికులకు ప్రత్యేక కౌంటర్ ద్వారా ఇప్పటివరకు 6 లక్షల రూపాయలు చెల్లించామని చెప్పారు. రైల్వే ట్రాక్‌లపై చెట్లు పడిపోవడం వల్లే అంతరాయం ఏర్పడింది తప్ప ట్రాక్‌లకు నష్టం వాటిళ్లలేదని ఆయనతెలిపారు. కాగా, వాతావరణం కొంత అనూకూలించటంతో రైలు సర్వీసుల పునరుద్ధరణ పనులు ముమ్మరం గా సాగుతున్నాయని తెలిపారు. మరో పదహారు గంటల్లో పనులు పూర్తి చేసి రైలు సర్వీసులనుపునరుదరించడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు.. మరింత సమాచారం.. తుపాను వల్ల శ్రీకాకుళం-పలాస మధ్య ఉర్లాం వద్ద సిగ్నల్ పోస్ట్ దెబ్బతిన్నది కోటబొమ్మలి వద్ద స్టేషన్ గోడ పాక్షికంగా కూలింది పలాస రైల్వే స్టేషన్‌కు చాలావరకు నష్టం ఏర్పడింది 13 మండలాలపై ప్రభావం టిట్లీ తుపాను ప్రభావం ఉత్తరాంధ్రలోని 13 మండలాలపై ఉందని రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) సీఈఓ సురేష్ తెలిపారు. ప్రస్తుతం గాలి వేగం గంటకు 40 కిలోమీటర్లుగా ఉందని అన్నారు. రోడ్లపై పడిన చెట్లను తొలగించే పనులు మొదలయ్యాయని వెల్లడించారు. ఈ రోజు రాత్రి వరకు శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కురుస్తాయని అన్నారు. రెండు రోజుల ముందు నుంచే ప్రజలను అప్రమత్తం చేయడంతో నష్ట తీవ్రత తక్కువగా ఉందని అన్నారు. అయితే, పటలకు మాత్రం పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లిందని తెలిపారు. రియల్ టైమ్ సెంటర్ మాక్ లైవ్ పంపుతున్నామని తెలిపారు. తుపాను ధాటికి ఇప్పటి వరకూ ఎనిమిది మృతి చెందారు.వీరిలో శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఐదుగురు, విజయనగరం జిల్లాకి చెందిన ముగ్గురు ఉన్నారు.సముద్ర వేటకి వెళ్లి ఆరుగురు చనిపోగా, ఇల్లు కూలి ఒకరు, చెట్లు కూలి మరొకరు చనిపోయారని అధికారులు ధృవీకరించారు. శ్రీకాకులం జిల్లా సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్ర గ్రామానికి చెందిని కుత్తుము అప్పలస్వామి అనే వ్యక్తి తన ఆవును పశువు శాల నుంచి రక్షించబోతుండగా దూలం విరిగి మీదపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సరిబుజ్జిలి మండలంలో ఇద్దరు, టెక్కిలి మండలంలో ఇద్దరు, పాలకొండ మండలంలో మరొకరు మృతి చెందినట్లు సమాచారం. విజయనగరానికి చెందిన మరో ముగ్గురు కూడా మృతి చెందారని అధికారులు తెలిపారు. తుపాను కారణంగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి రావాల్సిన ఇండిగో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విమానాయన శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కనుక సుదీర్ఘ దూర ప్రాంతాలకు వెళ్లవలసిన ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించగలరని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ పేర్కొన్నారు . విజయనగరం జిల్లాని పారాదీప్ సమీపంలో వేటకు వెళ్లిన ఎనిమిది మంది మత్య్సకారుల రెండు పడవలు బోల్తా పడ్డాయి. దీంతో ముగ్గురు మత్య్సకారులు గల్లంతు కాగా , ఐదుగురు సరక్షితంగా బయటపడ్డారు. పదిరోజుల క్రితం వేటకు వెళ్లిన మత్య్సకారులు తుపాను నేపథ్యం తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. గల్లంతైన మత్య్సకారులు పూసపాటిగేర మండలం పతివాడ బర్రిపేట గ్రామానికి చెందిన సూరాడ రాము(20), వాసుపల్లి లక్ష్మణరావు (30) బడి సత్తయ్య(35)లుగా గుర్తించారు. తుపాను ప్రభావానికి శ్రీకాకుళంలోని 8మండలాలు సర్వనాశనమయ్యాయి.వలస కోటబొమ్మాలి, గారా, సోంపేటలో ఇళ్లపైకప్పులు ఎగిరిపోయాయి. ఇచ్చాపురం, సోంపేట, కవిటి, మందస, వజ్రపుకొత్తురు, సంతబొమ్మాలి మండలాలలో జీడి, మామిడి పంటలకు తీవ్రనష్టం జరిగింది. పలు లోతట్లు ప్రాంతాలు మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి సహాయక చర్యలను ముమ్మురం చేసింది. కాల్‌సెంటర్ నంబర్లు : ఈపీడీసీఎల్ పరిధిలో 1912, కార్పొరేట్ ఆఫీస్ పరిదిలో 83310 18762, శ్రీకాకుళం - 94906 12633, 08492-227361, విజయనగరం- 94906 10102, 08922-222942, విశాఖ-72822 99975, 0891-2583611 టిట్లీ తుపాను ప్రభావంతో పలు రైళ్లను రద్దు చేశారు. విశాఖ-పలాస ప్యాసింజర్, ఎర్నాకులం-హుతియ ఎక్స్‌ప్రెస్ లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. విశాఖ-న్యూపలాస రైళును మాత్రం విజయనగరం వరకు ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. తుపాను నేపథ్యంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నేడు, రేపు జరగాల్సిన ఇంటర్ హాఫ్ఇయర్లీ పరీక్షలు వాయిదా వేసిననట్లు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఉదయలక్ష్మీ ప్రకటించారు. దువ్వాడ, విజయనగరం, ఖుర్దా స్టేషన్లలో రైళ్లు నిలిపివేశారు. పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. కళింగపట్నం,భీమునిపట్నంలో 10వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. విశాఖ, గంగవరం పోర్టుల్లో 8వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసం భారీ వర్షం కారణంగా తూర్పుగోదావరిలోని ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది. రాత్రి నుంచి వస్తున్న బలమైన అలల తాకిడికి రాక్వాల్ పలు చోట్ల విరిగిపడింది. కొన్ని బండరాళ్లు రోడ్డు పడడంతో బీచ్ చిధ్రమైంది. ఈ నేపథ్యంలో బీచ్ రోడ్డులో వాహనాల ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. రాళ్లు రోడ్డుకు అడ్డంగా పడిఉండడంతో వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళంలో భారీ వర్షం టిట్లీ తుపాను కారణంగా శ్రీకాకుళంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దాటిన సమయంలో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కరెంట్ స్థంభాలు నెలకొరిగాయి. ఇచ్చాపురం, సోంపేట, కవిటి, మందస, వజ్రపుకొత్తురు, సంతబొమ్మళి మండలాల్లో కొబ్బరి, జీడి, మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. జిల్లా కలెక్టరేట్లో కమాండింగ్ కమ్యునికేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 180042500002 ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టారు.కవిటి మండలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి ప్రజలను తరలిస్తున్నారు. కళింగపట్నం, ఇచ్ఛాపురం, సోంపేట, టెక్కలిలో మత్స్యకారులు పడవలు, వలలను ఒడ్డుకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శ్రీకాకుళం, టెక్కలిలో ఎన్టీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. పరిస్థితులపై సీఎం ఆరా టిట్లీ తుపాన్ తీరం తాకిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన చంద్రబాబు ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యలు ముమ్మురం చేయాలని చెప్పారు. తుపాను పూర్తిగా బలహీన పడేవరకూ ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)