సాక్షి,అమరావతి : ఉత్తరాంధ్రను వణికిస్తున్న ‘టిట్లీ’ తుపాను శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారథి వద్ద ఈరోజు ఉదయం తీరాన్ని దాటింది. తీరం దాటిన సమయంలో పెనుగాలులు భీభత్సం సృష్టించాయి. గంటకు 110 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. తుపాను తీరాన్ని దాటినప్పటికీ వజ్రపుకొత్తూరు, సోంపేట, తదితర మండలాల్లో గాలులు, వర్షభీభత్సం కొనసాగుతోంది. పలు ప్రాంతాలలో ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. బలమైన గాలులు వీచడంతో చెట్లు, పూరిగుడిసెలు, ఇళ్లు నేలమట్టమవుతున్నాయి. కుండపోతగా వర్షం కురుస్తుండటంతో పాటు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. అనేక చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పెనుగాలు కారణంగా శ్రీకాకుళం జిల్లాలో చాలాచోట్ల విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో అనేక ప్రాంతాల్లో చిమ్మచీకట్లు అలుముకున్నాయి.
#WATCH: Latest visuals from Andhra Pradesh's Srikakulam. #TitliCyclone made a landfall in the region early morning today. pic.twitter.com/ckoGJblyti
— ANI (@ANI) October 11, 2018
డబ్బులు తిరిగి చెల్లించాం..
టిట్లీ తుపాను కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయయని రైల్వే సీనియర్ డివిజనల్ మేనేజర్ సునీల్ కుమార్ తెలిపారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ప్రయాణికులసహాయార్థం 12 హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసామని తెలిపారు. నిన్న 8 రైళ్లు, ఈ రోజు మరో 8 రైళ్లను రద్దు చేసామనీ, 9 రైళ్లను దారి మళ్లించామని వెల్లడించారు. రద్దయిన రైళ్లకు సంబంధించిన 500 మందిప్రయాణికులకు ప్రత్యేక కౌంటర్ ద్వారా ఇప్పటివరకు 6 లక్షల రూపాయలు చెల్లించామని చెప్పారు.
రైల్వే ట్రాక్‌లపై చెట్లు పడిపోవడం వల్లే అంతరాయం ఏర్పడింది తప్ప ట్రాక్‌లకు నష్టం వాటిళ్లలేదని ఆయనతెలిపారు. కాగా, వాతావరణం కొంత అనూకూలించటంతో రైలు సర్వీసుల పునరుద్ధరణ పనులు ముమ్మరం గా సాగుతున్నాయని తెలిపారు. మరో పదహారు గంటల్లో పనులు పూర్తి చేసి రైలు సర్వీసులనుపునరుదరించడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు..
మరింత సమాచారం..
- తుపాను వల్ల శ్రీకాకుళం-పలాస మధ్య ఉర్లాం వద్ద సిగ్నల్ పోస్ట్ దెబ్బతిన్నది
- కోటబొమ్మలి వద్ద స్టేషన్ గోడ పాక్షికంగా కూలింది
- పలాస రైల్వే స్టేషన్‌కు చాలావరకు నష్టం ఏర్పడింది
13 మండలాలపై ప్రభావం
టిట్లీ తుపాను ప్రభావం ఉత్తరాంధ్రలోని 13 మండలాలపై ఉందని రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) సీఈఓ సురేష్ తెలిపారు. ప్రస్తుతం గాలి వేగం గంటకు 40 కిలోమీటర్లుగా ఉందని అన్నారు. రోడ్లపై పడిన చెట్లను తొలగించే పనులు మొదలయ్యాయని వెల్లడించారు. ఈ రోజు రాత్రి వరకు శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కురుస్తాయని అన్నారు. రెండు రోజుల ముందు నుంచే ప్రజలను అప్రమత్తం చేయడంతో నష్ట తీవ్రత తక్కువగా ఉందని అన్నారు. అయితే, పటలకు మాత్రం పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లిందని తెలిపారు. రియల్ టైమ్ సెంటర్ మాక్ లైవ్ పంపుతున్నామని తెలిపారు.
- తుపాను ధాటికి ఇప్పటి వరకూ ఎనిమిది మృతి చెందారు.వీరిలో శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఐదుగురు, విజయనగరం జిల్లాకి చెందిన ముగ్గురు ఉన్నారు.సముద్ర వేటకి వెళ్లి ఆరుగురు చనిపోగా, ఇల్లు కూలి ఒకరు, చెట్లు కూలి మరొకరు చనిపోయారని అధికారులు ధృవీకరించారు.
- శ్రీకాకులం జిల్లా సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్ర గ్రామానికి చెందిని కుత్తుము అప్పలస్వామి అనే వ్యక్తి తన ఆవును పశువు శాల నుంచి రక్షించబోతుండగా దూలం విరిగి మీదపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సరిబుజ్జిలి మండలంలో ఇద్దరు, టెక్కిలి మండలంలో ఇద్దరు, పాలకొండ మండలంలో మరొకరు మృతి చెందినట్లు సమాచారం. విజయనగరానికి చెందిన మరో ముగ్గురు కూడా మృతి చెందారని అధికారులు తెలిపారు.
- తుపాను కారణంగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి రావాల్సిన ఇండిగో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విమానాయన శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కనుక సుదీర్ఘ దూర ప్రాంతాలకు వెళ్లవలసిన ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించగలరని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ పేర్కొన్నారు .
- విజయనగరం జిల్లాని పారాదీప్ సమీపంలో వేటకు వెళ్లిన ఎనిమిది మంది మత్య్సకారుల రెండు పడవలు బోల్తా పడ్డాయి. దీంతో ముగ్గురు మత్య్సకారులు గల్లంతు కాగా , ఐదుగురు సరక్షితంగా బయటపడ్డారు. పదిరోజుల క్రితం వేటకు వెళ్లిన మత్య్సకారులు తుపాను నేపథ్యం తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. గల్లంతైన మత్య్సకారులు పూసపాటిగేర మండలం పతివాడ బర్రిపేట గ్రామానికి చెందిన సూరాడ రాము(20), వాసుపల్లి లక్ష్మణరావు (30) బడి సత్తయ్య(35)లుగా గుర్తించారు.
- తుపాను ప్రభావానికి శ్రీకాకుళంలోని 8మండలాలు సర్వనాశనమయ్యాయి.వలస కోటబొమ్మాలి, గారా, సోంపేటలో ఇళ్లపైకప్పులు ఎగిరిపోయాయి. ఇచ్చాపురం, సోంపేట, కవిటి, మందస, వజ్రపుకొత్తురు, సంతబొమ్మాలి మండలాలలో జీడి, మామిడి పంటలకు తీవ్రనష్టం జరిగింది.
- పలు లోతట్లు ప్రాంతాలు మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి సహాయక చర్యలను ముమ్మురం చేసింది.
- కాల్‌సెంటర్ నంబర్లు : ఈపీడీసీఎల్ పరిధిలో 1912, కార్పొరేట్ ఆఫీస్ పరిదిలో 83310 18762, శ్రీకాకుళం - 94906 12633, 08492-227361, విజయనగరం- 94906 10102, 08922-222942, విశాఖ-72822 99975, 0891-2583611
- టిట్లీ తుపాను ప్రభావంతో పలు రైళ్లను రద్దు చేశారు. విశాఖ-పలాస ప్యాసింజర్, ఎర్నాకులం-హుతియ ఎక్స్‌ప్రెస్ లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. విశాఖ-న్యూపలాస రైళును మాత్రం విజయనగరం వరకు ప్రయాణిస్తుందని పేర్కొన్నారు.
- తుపాను నేపథ్యంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నేడు, రేపు జరగాల్సిన ఇంటర్ హాఫ్‌ఇయర్లీ పరీక్షలు వాయిదా వేసిననట్లు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఉదయలక్ష్మీ ప్రకటించారు.
- దువ్వాడ, విజయనగరం, ఖుర్దా స్టేషన్లలో రైళ్లు నిలిపివేశారు. పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.
- కళింగపట్నం,భీమునిపట్నంలో 10వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
- విశాఖ, గంగవరం పోర్టుల్లో 8వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసం
భారీ వర్షం కారణంగా తూర్పుగోదావరిలోని ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది. రాత్రి నుంచి వస్తున్న బలమైన అలల తాకిడికి రాక్‌వాల్ పలు చోట్ల విరిగిపడింది. కొన్ని బండరాళ్లు రోడ్డు పడడంతో బీచ్ చిధ్రమైంది. ఈ నేపథ్యంలో బీచ్ రోడ్డులో వాహనాల ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. రాళ్లు రోడ్డుకు అడ్డంగా పడిఉండడంతో వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్నారు.
శ్రీకాకుళంలో భారీ వర్షం
టిట్లీ తుపాను కారణంగా శ్రీకాకుళంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దాటిన సమయంలో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కరెంట్ స్థంభాలు నెలకొరిగాయి. ఇచ్చాపురం, సోంపేట, కవిటి, మందస, వజ్రపుకొత్తురు, సంతబొమ్మళి మండలాల్లో కొబ్బరి, జీడి, మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. జిల్లా కలెక్టరేట్‌లో కమాండింగ్ కమ్యునికేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 180042500002 ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టారు.కవిటి మండలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి ప్రజలను తరలిస్తున్నారు. కళింగపట్నం, ఇచ్ఛాపురం, సోంపేట, టెక్కలిలో మత్స్యకారులు పడవలు, వలలను ఒడ్డుకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శ్రీకాకుళం, టెక్కలిలో ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు.
పరిస్థితులపై సీఎం ఆరా
టిట్లీ తుపాన్ తీరం తాకిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన‍్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన చంద్రబాబు ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యలు ముమ్మురం చేయాలని చెప్పారు. తుపాను పూర్తిగా బలహీన పడేవరకూ ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment