cyclone warnings
-
తుపానుపై అప్రమత్తం
విశాఖసిటీ: టిట్లీ తుపానును దీటుగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉం దని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తుపాను హెచ్చరిక కేంద్రానికి వెళ్లిన కలెక్టర్ వాతావరణ పరిస్థితిని, జిల్లాపై టిట్లీ ప్రభావాన్ని కేంద్రం డైరెక్టర్ రామచంద్రమూర్తిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టిట్లీ ప్రభావం జిల్లాలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాలతో పాటు తీరప్రాంత మండలాలపై తీవ్రంగా ఉంటుందన్నారు. గంటకు 150 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ఆ సమయంలో ఎవరూ బయటికి రాకుండా ఇళ్లల్లోనే ఉండాలని జిల్లా ప్రజలకు సూచించారు. కచ్చా ఇళ్లు, రోడ్లు, రైల్వే లైన్లకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. ప్రమాద తీవ్రతకు గురయ్యే వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న సుమారు 40 బోట్లు గంజా పోర్టుకు సురక్షితంగా చేరాయని తెలిపారు. విశాఖ పోర్టు, గంగవరం పోర్టులకు పెద్ద ముప్పు వాటిల్లనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో బెర్తులపై బోట్లకు సురక్షిత ఏర్పా ట్లు చేశారని వివరించారు. విద్యుత్, పోలీస్, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, వ్యవసాయ, పశుసంవర్ధక, రవాణా తదితర శాఖలన్నీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రౌండ్‌ది క్లాక్ ఆయా ఉద్యోగులంతా విధుల్లో పనిచేస్తూ క్షేత్ర స్థాయిలోనే ఉన్నారని తెలిపారు. అధికారులందరికీ సెలవులు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మత్స్యకార గ్రామాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. కలెక్టరేట్ కంట్రోల్‌రూమ్ టోల్‌ఫ్రీ నం.180042500002కి ప్రజలు కాల్ చేసి సమస్యలు చెప్పాలన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ మంత్రి గంటా సందర్శన టిట్లీ తుపాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌ని మంత్రి సందర్శించారు. తు పాను నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. రిలీఫ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ కేంద్రాల్లో తగినన్ని ఆహార నిల్వలు, తాగునీరు ఉండేలా చూడాలని సూచించారు. వైద్యారోగ్య బృందాలను కూడా ఆయా కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాలన్నారు. మంత్రి వెంట జిల్లా రెవెన్యూ అధికారి సి.చంద్రశేఖర్‌రెడ్డి, కమాండ్ కంట్రోల్ రూమ్ ఇన్‌ఛార్జి ఉన్నారు. -
‘టిట్లీ’ టెర్రర్!
సాక్షి, విశాఖపట్నం: ‘టిట్లీ’ తుపాను టెర్రర్ పుట్టిస్తోంది. గంటగంటకు ఉధృతమవుతూ విశాఖ వాసులకు దడ పుట్టిస్తోంది. తొలుత వాయుగుండంగా, ఆపై తుపాను, తీవ్ర తుపాను, అతి తీవ్ర తుపానుగాను బలపడుతూ వచ్చింది. చివరకు పెను తుపానుగానూ రూపాంతరం చెందే స్థితికి వచ్చింది. ఇదే ఇప్పుడు అందరిలోనూ ఆందోళనకు కారణమవుతోంది. నాలుగేళ్ల క్రితం సంభవించిన హుద్‌హుద్ సూపర్ సైక్లోన్ పెను విలయం సృష్టించింది. ఆ తర్వాత మూడు నాలుగు తుపానులు ఏర్పడినా అవి సాధారణమైనవే కావడంతో విశాఖపై ప్రభావం చూపలేదు. కానీ ఇప్పుడు కొనసాగుతున్న టిట్లీ తుపాను అతి తీవ్ర తుపాను కావడం, ఉత్తరాంధ్రకు సమీపంలో తీరాన్ని దాటుతుండడం వల్ల దాని ప్రభావం విశాఖపై చూపుతోంది. మంగళవారంకంటే బుధవారం ఈదురుగాలుల తీవ్రత అధికంగా ఉంది. బుధవారం మధ్యాహ్నానికి అతి తీవ్ర తుపానుగా బలపడడం వల్ల గాలుల ఉధృతి బాగా పెరిగింది. గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గురువారం తుపాను తీరం దాటే సమయం సమీపించే కొలదీ గాలుల తీవ్రత గంటకు 140 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఈ పెనుగాలులు ఎలాంటి విధ్వంసానికి కారణమవుతాయోనని జనం భయాందోళన చెందుతున్నారు. సాధారణంగా తుపాన్ల సమయంలో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీస్తుంటాయి. వర్షాలకు ఇళ్లు, చెట్లు నాని ఉండడం, దానికి గాలులు తోడైతే అవి కూలిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అయితే ఈ టిట్లీ తుపాను ప్రభావం ఆరంభమైనప్పటికీ బుధవారం రాత్రి వరకు చిరుజల్లులే తప్ప భారీ వర్షం కురవలేదు. దీంతో గాలులే అలజడి రేపుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి దాటాక వర్షంతో పాటు పెనుగాలులు వీస్తాయని, దీంతో విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సహాయక చర్యల్లో.. వాతావరణశాఖ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మండల, డివిజన్ కేంద్రాల్లో అధికారులు అందుబాటులో ఉంచారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, కోస్ట్‌గార్డు బృందాలు సహాయక చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో 11 మండలాల్లోని 156 గ్రామాల్లో తుపాను ప్రభావం ఉంటుందని గుర్తించారు. వీటిలో ఆనందపురం, భీమిలి, పద్మనాభం, విశాఖపట్నం అర్బన్, రూరల్ జిల్లాలపై టిట్లీ ప్రభావం అధికంగా ఉండనుంది. ఆయా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న 2,82,570 మందిని తరలించడానికి సన్నద్ధం చేశారు. ఇంకా 139 తుఫాను షెల్టర్లు, 157 సహాయ, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 130 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. సహాయ చర్యలకు సన్నద్ధం విశాఖసిటీ: ఉత్తరాంధ్ర పై విరుచుకుపడనున్న టిట్లీ తుఫాను రక్షణ చర్యల్లో పాల్గొనేందుకు తమ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తూర్పు నౌకాదళం బుధవారం రాత్రి ప్రకటించింది. తుఫాను బాధిత ప్రాంతాల్లో ప్రజలకు పూర్తిస్థా యి సహాయ సహకారాలు అందించడంతో పాటు వైద్య సదుపాయాల వంటి లాజిస్టిక్ సపోర్ట్ అందించేందుకు భారత నౌకాదళం అప్రమత్తంగా ఉందని వెల్లడించింది. అత్యంత ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనేందుకు భారత యుద్ధ నౌకలు సన్నద్ధంగా ఉన్నాయని నౌకాదళాధికారులు తెలిపారు. అదనపు గజ ఈతగాళ్లు, వైద్యులు, రబ్బరు పడవలు, ఆహార పదార్థాలు, తాత్కాలిక వస్తువులు, దుస్తులు, మందులు, దుప్పట్లు వంటి వాటిని అవసరమైన మేరకు అందించేందుకు సిద్ధం చేశామన్నారు. అంతే కాకుండా విశాఖపట్నం నుంచి జెమిని బోట్లతో పాటు డైవింగ్ సిబ్బందితో కూడిన బృందాలు ఇప్పటికే ఐఎన్ఎస్ చిల్కాలో మోహరించాయని తెలిపారు. తుఫాను తీవ్రత మొదలైన క్షణం నుంచి సహాయక చర్యలకు ఉపక్రమించేందుకు సిద్ధం చేసినట్లు వివరించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయడంతో పాటు వాటిని ఎలా అభివృద్ధి చెయ్యాలనే విషయాలపై తూర్పు నౌకాదళం ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుందని తెలిపారు. ఐఎన్ఎస్ డేగాలో ఎయిర్ క్రాఫ్టులు ప్రమాదపు పరిస్థితుల వద్దకు చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని నౌకాదళాధికారులు వివరించారు. విమాన సర్వీసులకు అంతరాయం గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): విశాఖలో టిట్లీ తుపాను గాలుల ప్రభావం బుధవారం విమాన సర్వీసులపై పడింది. ఉదయం ఎని మిది గంటలకు ఎప్పటిలాగే ఇండిగో విమా నం చెన్నై నుంచి విశాఖకు వచ్చింది. ఎయిర్‌పోర్టులో దిగడానికి వాతావరణం అనుకూలించలేదు. ఉధృతంగా గాలులు వీయడంతో ఈ విమానం రాయపూర్‌కి మళ్లింది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ విమానాశ్రయానికి వచ్చింది. మరో అరగంటలో బయలుదేరి భువనేశ్వర్ మీదుగా కోల్‌కతా వెళ్లింది. నాలుగు గంటల పాటు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం తప్పలేదు. తర్వాత నుంచి మరి కొన్ని విమాన సర్వీసులకు గాలులు అంతరాయమైనా పావుగంట సేపు చొప్పున చక్కర్లు కొట్టి దిగాయి. మల్కాపురం(విశాఖ పశ్చిమ): టిట్లీ తుఫాన్ ప్రభావంతో యారాడ తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. బుధవారం ఉదయం సముద్రం ఐదు అడుగుల ముందుకు వచ్చింది. చల్లటి గాలులతోపాటు అలలు ఎగసిపడుతుండడంతో వాకింగ్ వచ్చిన యువకులు, నేవల్ అధికారులు వెనుదిరిగారు. -
శ్రీకాకుళం జిల్లాను వణికిస్తున్న ‘టిట్లీ’ తుపాను
సాక్షి,అమరావతి : ఉత్తరాంధ్రను వణికిస్తున్న ‘టిట్లీ’ తుపాను శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారథి వద్ద ఈరోజు ఉదయం తీరాన్ని దాటింది. తీరం దాటిన సమయంలో పెనుగాలులు భీభత్సం సృష్టించాయి. గంటకు 110 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. తుపాను తీరాన్ని దాటినప్పటికీ వజ్రపుకొత్తూరు, సోంపేట, తదితర మండలాల్లో గాలులు, వర్షభీభత్సం కొనసాగుతోంది. పలు ప్రాంతాలలో ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. బలమైన గాలులు వీచడంతో చెట్లు, పూరిగుడిసెలు, ఇళ్లు నేలమట్టమవుతున్నాయి. కుండపోతగా వర్షం కురుస్తుండటంతో పాటు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. అనేక చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పెనుగాలు కారణంగా శ్రీకాకుళం జిల్లాలో చాలాచోట్ల విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో అనేక ప్రాంతాల్లో చిమ్మచీకట్లు అలుముకున్నాయి. #WATCH: Latest visuals from Andhra Pradesh's Srikakulam. #TitliCyclone made a landfall in the region early morning today. pic.twitter.com/ckoGJblyti — ANI (@ANI) October 11, 2018 డబ్బులు తిరిగి చెల్లించాం.. టిట్లీ తుపాను కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయయని రైల్వే సీనియర్ డివిజనల్ మేనేజర్ సునీల్ కుమార్ తెలిపారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ప్రయాణికులసహాయార్థం 12 హెల్ప్లైన్లను ఏర్పాటు చేసామని తెలిపారు. నిన్న 8 రైళ్లు, ఈ రోజు మరో 8 రైళ్లను రద్దు చేసామనీ, 9 రైళ్లను దారి మళ్లించామని వెల్లడించారు. రద్దయిన రైళ్లకు సంబంధించిన 500 మందిప్రయాణికులకు ప్రత్యేక కౌంటర్ ద్వారా ఇప్పటివరకు 6 లక్షల రూపాయలు చెల్లించామని చెప్పారు. రైల్వే ట్రాక్‌లపై చెట్లు పడిపోవడం వల్లే అంతరాయం ఏర్పడింది తప్ప ట్రాక్‌లకు నష్టం వాటిళ్లలేదని ఆయనతెలిపారు. కాగా, వాతావరణం కొంత అనూకూలించటంతో రైలు సర్వీసుల పునరుద్ధరణ పనులు ముమ్మరం గా సాగుతున్నాయని తెలిపారు. మరో పదహారు గంటల్లో పనులు పూర్తి చేసి రైలు సర్వీసులనుపునరుదరించడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు.. మరింత సమాచారం.. తుపాను వల్ల శ్రీకాకుళం-పలాస మధ్య ఉర్లాం వద్ద సిగ్నల్ పోస్ట్ దెబ్బతిన్నది కోటబొమ్మలి వద్ద స్టేషన్ గోడ పాక్షికంగా కూలింది పలాస రైల్వే స్టేషన్‌కు చాలావరకు నష్టం ఏర్పడింది 13 మండలాలపై ప్రభావం టిట్లీ తుపాను ప్రభావం ఉత్తరాంధ్రలోని 13 మండలాలపై ఉందని రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) సీఈఓ సురేష్ తెలిపారు. ప్రస్తుతం గాలి వేగం గంటకు 40 కిలోమీటర్లుగా ఉందని అన్నారు. రోడ్లపై పడిన చెట్లను తొలగించే పనులు మొదలయ్యాయని వెల్లడించారు. ఈ రోజు రాత్రి వరకు శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కురుస్తాయని అన్నారు. రెండు రోజుల ముందు నుంచే ప్రజలను అప్రమత్తం చేయడంతో నష్ట తీవ్రత తక్కువగా ఉందని అన్నారు. అయితే, పటలకు మాత్రం పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లిందని తెలిపారు. రియల్ టైమ్ సెంటర్ మాక్ లైవ్ పంపుతున్నామని తెలిపారు. తుపాను ధాటికి ఇప్పటి వరకూ ఎనిమిది మృతి చెందారు.వీరిలో శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఐదుగురు, విజయనగరం జిల్లాకి చెందిన ముగ్గురు ఉన్నారు.సముద్ర వేటకి వెళ్లి ఆరుగురు చనిపోగా, ఇల్లు కూలి ఒకరు, చెట్లు కూలి మరొకరు చనిపోయారని అధికారులు ధృవీకరించారు. శ్రీకాకులం జిల్లా సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్ర గ్రామానికి చెందిని కుత్తుము అప్పలస్వామి అనే వ్యక్తి తన ఆవును పశువు శాల నుంచి రక్షించబోతుండగా దూలం విరిగి మీదపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సరిబుజ్జిలి మండలంలో ఇద్దరు, టెక్కిలి మండలంలో ఇద్దరు, పాలకొండ మండలంలో మరొకరు మృతి చెందినట్లు సమాచారం. విజయనగరానికి చెందిన మరో ముగ్గురు కూడా మృతి చెందారని అధికారులు తెలిపారు. తుపాను కారణంగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి రావాల్సిన ఇండిగో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విమానాయన శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కనుక సుదీర్ఘ దూర ప్రాంతాలకు వెళ్లవలసిన ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించగలరని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ పేర్కొన్నారు . విజయనగరం జిల్లాని పారాదీప్ సమీపంలో వేటకు వెళ్లిన ఎనిమిది మంది మత్య్సకారుల రెండు పడవలు బోల్తా పడ్డాయి. దీంతో ముగ్గురు మత్య్సకారులు గల్లంతు కాగా , ఐదుగురు సరక్షితంగా బయటపడ్డారు. పదిరోజుల క్రితం వేటకు వెళ్లిన మత్య్సకారులు తుపాను నేపథ్యం తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. గల్లంతైన మత్య్సకారులు పూసపాటిగేర మండలం పతివాడ బర్రిపేట గ్రామానికి చెందిన సూరాడ రాము(20), వాసుపల్లి లక్ష్మణరావు (30) బడి సత్తయ్య(35)లుగా గుర్తించారు. తుపాను ప్రభావానికి శ్రీకాకుళంలోని 8మండలాలు సర్వనాశనమయ్యాయి.వలస కోటబొమ్మాలి, గారా, సోంపేటలో ఇళ్లపైకప్పులు ఎగిరిపోయాయి. ఇచ్చాపురం, సోంపేట, కవిటి, మందస, వజ్రపుకొత్తురు, సంతబొమ్మాలి మండలాలలో జీడి, మామిడి పంటలకు తీవ్రనష్టం జరిగింది. పలు లోతట్లు ప్రాంతాలు మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి సహాయక చర్యలను ముమ్మురం చేసింది. కాల్‌సెంటర్ నంబర్లు : ఈపీడీసీఎల్ పరిధిలో 1912, కార్పొరేట్ ఆఫీస్ పరిదిలో 83310 18762, శ్రీకాకుళం - 94906 12633, 08492-227361, విజయనగరం- 94906 10102, 08922-222942, విశాఖ-72822 99975, 0891-2583611 టిట్లీ తుపాను ప్రభావంతో పలు రైళ్లను రద్దు చేశారు. విశాఖ-పలాస ప్యాసింజర్, ఎర్నాకులం-హుతియ ఎక్స్‌ప్రెస్ లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. విశాఖ-న్యూపలాస రైళును మాత్రం విజయనగరం వరకు ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. తుపాను నేపథ్యంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నేడు, రేపు జరగాల్సిన ఇంటర్ హాఫ్ఇయర్లీ పరీక్షలు వాయిదా వేసిననట్లు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఉదయలక్ష్మీ ప్రకటించారు. దువ్వాడ, విజయనగరం, ఖుర్దా స్టేషన్లలో రైళ్లు నిలిపివేశారు. పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. కళింగపట్నం,భీమునిపట్నంలో 10వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. విశాఖ, గంగవరం పోర్టుల్లో 8వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసం భారీ వర్షం కారణంగా తూర్పుగోదావరిలోని ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది. రాత్రి నుంచి వస్తున్న బలమైన అలల తాకిడికి రాక్వాల్ పలు చోట్ల విరిగిపడింది. కొన్ని బండరాళ్లు రోడ్డు పడడంతో బీచ్ చిధ్రమైంది. ఈ నేపథ్యంలో బీచ్ రోడ్డులో వాహనాల ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. రాళ్లు రోడ్డుకు అడ్డంగా పడిఉండడంతో వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళంలో భారీ వర్షం టిట్లీ తుపాను కారణంగా శ్రీకాకుళంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దాటిన సమయంలో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కరెంట్ స్థంభాలు నెలకొరిగాయి. ఇచ్చాపురం, సోంపేట, కవిటి, మందస, వజ్రపుకొత్తురు, సంతబొమ్మళి మండలాల్లో కొబ్బరి, జీడి, మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. జిల్లా కలెక్టరేట్లో కమాండింగ్ కమ్యునికేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 180042500002 ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టారు.కవిటి మండలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి ప్రజలను తరలిస్తున్నారు. కళింగపట్నం, ఇచ్ఛాపురం, సోంపేట, టెక్కలిలో మత్స్యకారులు పడవలు, వలలను ఒడ్డుకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శ్రీకాకుళం, టెక్కలిలో ఎన్టీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. పరిస్థితులపై సీఎం ఆరా టిట్లీ తుపాన్ తీరం తాకిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన చంద్రబాబు ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యలు ముమ్మురం చేయాలని చెప్పారు. తుపాను పూర్తిగా బలహీన పడేవరకూ ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తీవ్ర తుపానుగా టిట్లీ
విజయనగరం గంటస్తంభం: బంగాళాఖాతంలో ఏర్పడిన టిట్లీ తుపాను గురువారానికి ఉగ్రరూపం దాల్చనుంది. ఇప్పటికే తీవ్ర తుపానుగా మారింది. దాని ప్రభావంతో బుధవారమే జిల్లా వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అక్కడక్కడ వర్షాలు పడడం ప్రారంభమైంది. ఈదురుగాలుల వేగం, సమద్రపు అలల ఎత్తు పెరిగింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం, ఒడిశా రాష్ట్రంలోని గోపాల్పూర్ ప్రాంతాల మధ్య తీరం దాటనుండడంతో వర్షాలు, గాలుల ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వారు చెప్పినట్లు గానే పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో తీరంలో కెరటాలు ఎగసిపడుతున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో అవి మరింత పెరిగే అవకాశం ఉంది. బుధవారం జిల్లాలో గంటకు 50 నుంచి 60 కీమీ వేగంతో గాలు వీచాయి. గురువారం తీరం దాటే సమయంలో గంటకు 185 కీమీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో గంటకు 100 నుంచి 120 కీమీ గాలు వీచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బుధవారం భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ, నెల్లిమర్ల మండలాల్లో ఓ మోస్తారు వర్షం పడగా, విజయనగరంలో చిరుజల్లులు పడ్డాయి. గాలుల కారణంగా పంటలకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. వర్షం మాత్రమే పడితే పంటలకు ఉపయోగకరమని పేర్కొంటున్నారు. అధికారులు అప్రమత్తం.. తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. మత్స్యకారులను ఇప్పటికే వేటకు వెళ్లనీయకుండా చర్యలు తీసుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృంధాలను కూడా సిద్ధం చేస్తున్నారు. ముంపు బారిన పడే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, వారికి ఆహారం, వసతి సౌకర్యాలను కల్పించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. సమాచార, విద్యుత్, ఆర్అండ్బీ శాఖల అధికారులు తుపాను వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలి: జేసీ.. టిట్లీ తుపానుపై అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని జేసీ వెంకటరమణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మండలాధికారులతో కలెక్టరేట్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ మత్స్యకారులు, కచ్ఛా ఇళ్లలో నివశిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రాణ, ఆస్తి నష్టాలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. బస, ఆహారం, వైద్యం తదితర ఏర్పాట్లు చేయాని తెలిపారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే ప్రజలను ఇళ్లకు పంపాలని పేర్కొన్నారు. అప్రమత్తం చేశాం: ఆర్డీఓ మురళి.. టిట్లీ తుపాను నుంచి ప్రజలను రక్షించేందుకు ముందుగానే హెచ్చరించామని విజయనగరం ఆర్డీఓ మురళి తెలిపారు. తన ఛాంబర్లో విలేకర్లతో మాట్లాడిన ఆయన శ్రీకాకుళం మీదుగా ఒడిశాలో తుపాను తీరం దాటుందని, ఆ సమయంలో 165 కీమీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. అన్ని శాఖల మండలాధికారులను ముందుగానే హెచ్చరించామని, పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని 26 పంచాయతీల మత్స్యకారులను తుపాను షెల్టర్లు, ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని ఆదేశించినట్లు తెలిపారు. తుపానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైందన్నారు. తీరంలో తుపాను హెచ్చరికలు జారీ.. భోగాపురం/పూసపాటిరేగ: భోగాపురం, పూసపాటిరేగ తీరప్రాంత మండలాల్లో బుధవారం అధికారులు తుపాను హెచ్చరికలు జారీ చేశారు. గురువారం తీరం దాటే అవకాశం ఉన్నందున ఆ సమయంలో ప్రజలు, మత్స్యకారులు ఎవరూ తీరం వద్దకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. భోగాపురం తహసీల్దార్ పెంటయ్య తన కార్యాలయంలో వైద్య, విద్యుత్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశమైయ్యారు. శనివారం వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి విపత్తు నుంచైనా ప్రజలను రక్షించేందుకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. తీరప్రాంత గ్రామాల మత్స్యకారులు పడవలను ఒడ్డుకు చేర్చుకునే పనిలో పడ్డారు. డ్వామా పీడీ త్యాగరాజు మత్స్యకార గ్రామాలను సందర్శించారు. అయితే పూసపాటిరేగ మండలంలో తీరప్రాంత గ్రామాల్లో బుధవారం రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు కనీస సమాచారం ఇవ్వలేదని మత్స్యకారులు చెబుతున్నారు. తిప్పవలస, చింతపల్లి గ్రామాల్లో రేవులు కోతకు గురయ్యాయి. రెండు రోజులుగా వేటకు వెళ్లలేదని, అయినప్పటికీ అధికారులు కనీస ఏర్పాట్లు చేయలేదని పేర్కొంటున్నారు. రైల్వేస్టేషన్లో హెల్ప్‌లైన్.. విజయనగరం టౌన్: టిట్లీ తుపాను బలపడుతుండడంతో ఈస్ట్‌కోస్ట్ రైల్వే ముందస్తుగా ప్రయాణికుల సమాచారం కోసం హెల్ప్లైన్లు ఏర్పాటు చేసింది. స్టేషన్ ఆవరణలో విజయనగరం మీదుగా వచ్చే రైళ్ల సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు చేసింది. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ వినియోగదారులు 08922–221202, 2211206, బీఎస్ఎన్ఎల్ మొబైల్‌కు సంబంధించి 85003 58610, 85003 58712, ఎయిర్ టెల్కు సంబంధించి 81060 52987, 81060 53006 నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు. బుధవారం రాత్రి పది గంటల నుంచి అన్ని రైళ్లను క్రమబద్ధీకరించే ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
పెను విలయం దిశగా..!
సాక్షి, విశాఖపట్నం, నెట్వర్క్: సుడులు తిరుగుతూ పెను విలయం సృష్టించే దిశగా ‘టిట్లీ’ తుపాను ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తోంది. ప్రచండ గాలులతో ప్రజలను వణికిస్తోంది. తుపాను ప్రభావంతో కడలి కెరటాలు నాలుగైదు మీటర్ల ఎత్తుకు ఎగసి పడుతున్నాయి. తీరం వైపు అలలు చొచ్చుకువస్తున్నాయి. అర్ధరాత్రి 11.30 సమయంలో విశాఖ ఆర్కే బీచ్ వద్ద సముద్రం ఒక్కసారిగా 30 అడుగులమేర ముందుకు వచ్చింది. బీచ్‌రోడ్డు వరకూ అలల తాకిడి కొనసాగటంతో ప్రజలు కలవరపాటుకు గురయ్యారు. మధ్యాహ్నం 3 గంటల నుంచే బీచ్‌లోకి సందర్శకులను అనుమతించకపోవటంతో నిర్మానుష్యంగా మారింది. కడలి అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. తీరం దాటాక బెంగాల్ వైపు... పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుపాను బుధవారం మధ్యాహ్నం ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ అతి తీవ్ర తుపానుగా మారింది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. రాత్రి 11.30 గంటల సమయానికి కళింగపట్నానికి ఆగ్నేయంగా 130 కి.మీ., ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణ ఆగ్నేయంగా 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. టిట్లీ మరింత బలపడి పెను తుపానుగా మారుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. గురువారం ఉదయం 5.30 గంటల సమయంలో కళింగపట్నం– గోపాల్పూర్ మధ్య తుపాను తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో తెలిపింది. అనంతరం ఈ తుపాను వెనక్కి మళ్లి పశ్చిమ బెంగాల్ వైపు పయనించనుంది. టిట్లీ ప్రభావంతో బుధవారం ఉదయం నుంచి గాలుల ఉధృతి తీవ్ర స్థాయిలో ఉంది. రాత్రి సమయానికి ఉధృత రూపం దాల్చింది. ఉత్తరాంధ్రలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అర్థరాత్రి దాటాక గాలుల వేగం 140 నుంచి 165 కిలోమీటర్లకు పెరుగుతుందని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర, ఒడిశాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. వంశధార, నాగావళికి వరద ముప్పు! ఉత్తరాంధ్రలో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. కొన్నిచోట్ల 15 నుంచి 25 సెం.మీల వర్షం కురవవచ్చని తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదులకు వరద పోటెత్తి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. పెనుగాలుల ధాటికి గుడిసెలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవచ్చని, సమాచార వ్యవస్థకు అంతరాయం కలుగుతుందని, వరి, అరటి, బొప్పాయి తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపింది. రోడ్లు, కల్వర్టులు దెబ్బ తినడంతోపాటు చెరువులకు గండ్లు పడే అవకాశం ఉందని పేర్కొంది. రంగంలోకి సహాయక బృందాలు తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, కోస్ట్‌గార్డు దళాలు రంగంలోకి దిగాయి. ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు బృందాలను సన్నద్ధంగా ఉంచారు. సహాయ, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 20 రైళ్లు పాక్షికంగా రద్దు.. కొన్ని దారి మళ్లింపు.. టిట్లీ తుపాను కారణంగా రైలు పట్టాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నందున తూర్పు కోస్తా రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. విశాఖ నుంచి హౌరా వైపు వెళ్లే దాదాపు 20 రైళ్లను పాక్షికంగా రద్దు చేయటంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లించింది. కొన్ని రైళ్లను దువ్వాడ, భద్రక్, ఖుర్దా రైల్వే స్టేషన్లలో ముందుజాగ్రత్తగా నిలిపివేశారు. తుపాను తీరం దాటి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చాక ఈ రైళ్లను పునరుద్ధరిస్తారు. సామర్లకోట వద్ద కోనార్క్ ఎక్స్‌ప్రెస్‌ను గంట సేపు నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈస్టు కోస్టును ముందస్తు జాగ్రత్తగా రద్దు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో అర్థరాత్రి నుంచి భారీ వర్షం శ్రీకాకుళం జిల్లాలో బుధవారం అర్థరాత్రి తరువాత ప్రచండ గాలులు వీస్తున్నాయి. ఉద్దానం మండలాల్లో కొబ్బరి తోటలు ధ్వంసమైనట్లు సమాచారం అందింది. జిల్లావ్యాప్తంగా భారీ వర్షం ప్రారంభమైంది. ఇచ్ఛాపురం, కవిటి, ఎచ్చెర్ల, రణస్థలం, సంతబొమ్మాళి మండలాల్లో వాన కురుస్తోంది. కవిటి మండలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి ప్రజలను తరలిస్తున్నారు. కళింగపట్నం, ఇచ్ఛాపురం, సోంపేట, టెక్కలిలో మత్స్యకారులు పడవలు, వలలను ఒడ్డుకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శ్రీకాకుళం, టెక్కలిలో ఎన్టీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. అవసరమైతే మరిన్ని బృందాలు తరలిస్తామని జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూంలు కొనసాగుతున్నాయి. విజయనగరంలో ఈదురుగాలులు విజయనగరం జిల్లాలో బుధవారం చిన్నపాటి చినుకులు మాత్రమే పడినా ఈదురు గాలులు మాత్రం భారీగా వీస్తున్నాయి. పూసపాటిరేగ మండలం తిప్పలవలసలో కెరటాల ఉధృతికి తీరం కోతకు గురవుతోంది. మత్స్యకారులు పడవలు, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. గుంటూరు జిల్లా నిజాంపట్నం ఓడరేవులో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. హంసలదీవి వద్ద కడలి కల్లోలం.. కృష్ణా జిల్లాలోని హంసలదీవి వద్ద సాగర తీరం అల్లకల్లోలంగా మారింది. ఎన్నడూ లేనివిధంగా సముద్రంలో నీరు నీలం రంగులోకి మారడంపై స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకాయతిప్ప వద్ద పర్యాటకులను బీచ్‌లోకి వెళ్లనివ్వకుండా కరకట్ట వద్ద గేట్లను మూసివేశారు. తుపాన్ తీరం దాటే వరకు ప్రకాశం జిల్లాలో వాడరేవు, విజయలక్ష్మిపురం, పచ్చమొగిలి ప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. బుధవారం ఉదయం వేటకు వెళ్లిన వారిని తిరిగి రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉప్పాడ – కాకినాడ బీచ్ రోడ్డులో వాహనాల రాకపోకలు నిషిద్ధం కాకినాడ పోర్టులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు తూర్పు గోదావరి జిల్లా ఇన్చార్జి కలెక్టరు ఎ.మల్లిఖార్జునరావు చెప్పారు. 18004253077 నంబరుతో కాకినాడలో కంట్రోల్‌రూం ఏర్పాటైంది. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో ఉప్పాడ – కాకినాడ బీచ్‌రోడ్డులో వాహనాల రాకపోకలను బుధవారం రాత్రి నిషేధించారు. ఉప్పాడలో సముద్రం నీరు ఇళ్లలోకి చేరుతోంది. నేడు, రేపు ఒడిశాలో విద్యాసంస్థల మూసివేత టిట్లి తీవ్రరూపం దాల్చడంతో ఒడిశా తీర ప్రాంతంలోని ఐదు జిల్లాల్లో 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గంజాం, పూరి, కుర్దా, కేంద్రపడా, జగత్సింగ్పూర్ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశించారు. తుపాన్ తీరం దాటనున్న గోపాల్పూర్ ప్రాంతంలో ఇప్పటికే వెయ్యి మందిని ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో గురు, శుక్ర వారాల్లో అన్ని పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. ఒడిశాలో పలు ప్రాంతాలను బుధవారం వర్షం ముంచెత్తింది. గురువారం భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవవచ్చని ఐఎండీ హెచ్చరించింది. కళింగపట్నం, భీమునిపట్నంలలో 10వ నంబరు హెచ్చరికలు టిట్లీ తుపాను తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలోని ప్రధాన పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్న పోర్టుల్లో అత్యంత ప్రమాదకర సూచిక 10వ నంబరు సూచికను, విశాఖపట్నం, గంగవరం పోర్టుల్లో 8వ నంబర్, కాకినాడ, మచిలీపట్నంలలో 3వ నంబర్, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద సూచికలను ఎగురవేశారు. తుపాను సమయాల్లో 10వ నంబరు హెచ్చరికను అతి ప్రమాదకరమైనదిగా భావిస్తారు. టిట్లీ తుపాను నేపథ్యంలో కళింగపట్నం, భీమునిపట్నాల్లో పదో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. హుద్‌హుద్ తర్వాత ఇదే భారీ తుపాను.. 2014 అక్టోబర్ 12న విశాఖను వణికించిన హుద్‌హుద్ తర్వాత అతి పెద్ద తుపాను టిట్లీనే. హుద్‌హుద్ సూపర్ సైక్లోన్‌గా మారడంతో గంటకు 220 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు వీచాయి. దీని ధాటికి విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సరిగ్గా నాలుగేళ్ల అనంతరం అక్టోబర్‌లో అదే తేదీల్లో టిట్లీ రూపంలో తుపాన్ ముంచుకొస్తోంది. గత నాలుగేళ్లలో ఏర్పడిన తుపాన్ల సమయంలో 70–90 కిలోమీటర్ల వేగానికి మించి గాలులు వీయలేదు. ఈసారి మాత్రం టిట్లీ ధాటికి పెనుగాలులు వీస్తున్నాయి. -
భారత తీరప్రాంతాలకు ఇన్కాయిస్ హెచ్చరికలు