సాక్షి, విశాఖపట్నం: ‘టిట్లీ’ తుపాను టెర్రర్ పుట్టిస్తోంది. గంటగంటకు ఉధృతమవుతూ విశాఖ వాసులకు దడ పుట్టిస్తోంది. తొలుత వాయుగుండంగా, ఆపై తుపాను, తీవ్ర తుపాను, అతి తీవ్ర తుపానుగాను బలపడుతూ వచ్చింది. చివరకు పెను తుపానుగానూ రూపాంతరం చెందే స్థితికి వచ్చింది. ఇదే ఇప్పుడు అందరిలోనూ ఆందోళనకు కారణమవుతోంది. నాలుగేళ్ల క్రితం సంభవించిన హుద్‌హుద్ సూపర్ సైక్లోన్ పెను విలయం సృష్టించింది. ఆ తర్వాత మూడు నాలుగు తుపానులు ఏర్పడినా అవి సాధారణమైనవే కావడంతో విశాఖపై ప్రభావం చూపలేదు. కానీ ఇప్పుడు కొనసాగుతున్న టిట్లీ తుపాను అతి తీవ్ర తుపాను కావడం, ఉత్తరాంధ్రకు సమీపంలో తీరాన్ని దాటుతుండడం వల్ల దాని ప్రభావం విశాఖపై చూపుతోంది. మంగళవారంకంటే బుధవారం ఈదురుగాలుల తీవ్రత అధికంగా ఉంది. బుధవారం మధ్యాహ్నానికి అతి తీవ్ర తుపానుగా బలపడడం వల్ల గాలుల ఉధృతి బాగా పెరిగింది. గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గురువారం తుపాను తీరం దాటే సమయం సమీపించే కొలదీ గాలుల తీవ్రత గంటకు 140 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఈ పెనుగాలులు ఎలాంటి విధ్వంసానికి కారణమవుతాయోనని జనం భయాందోళన చెందుతున్నారు. సాధారణంగా తుపాన్ల సమయంలో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీస్తుంటాయి. వర్షాలకు ఇళ్లు, చెట్లు నాని ఉండడం, దానికి గాలులు తోడైతే అవి కూలిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అయితే ఈ టిట్లీ తుపాను ప్రభావం ఆరంభమైనప్పటికీ బుధవారం రాత్రి వరకు చిరుజల్లులే తప్ప భారీ వర్షం కురవలేదు. దీంతో గాలులే అలజడి రేపుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి దాటాక వర్షంతో పాటు పెనుగాలులు వీస్తాయని, దీంతో విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
సహాయక చర్యల్లో..
వాతావరణశాఖ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మండల, డివిజన్ కేంద్రాల్లో అధికారులు అందుబాటులో ఉంచారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, నేవీ, కోస్ట్‌గార్డు బృందాలు సహాయక చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో 11 మండలాల్లోని 156 గ్రామాల్లో తుపాను ప్రభావం ఉంటుందని గుర్తించారు. వీటిలో ఆనందపురం, భీమిలి, పద్మనాభం, విశాఖపట్నం అర్బన్, రూరల్ జిల్లాలపై టిట్లీ ప్రభావం అధికంగా ఉండనుంది. ఆయా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న 2,82,570 మందిని తరలించడానికి సన్నద్ధం చేశారు. ఇంకా 139 తుఫాను షెల్టర్లు, 157 సహాయ, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 130 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.
సహాయ చర్యలకు సన్నద్ధం
విశాఖసిటీ: ఉత్తరాంధ్ర పై విరుచుకుపడనున్న టిట్లీ తుఫాను రక్షణ చర్యల్లో పాల్గొనేందుకు తమ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తూర్పు నౌకాదళం బుధవారం రాత్రి ప్రకటించింది. తుఫాను బాధిత ప్రాంతాల్లో ప్రజలకు పూర్తిస్థా యి సహాయ సహకారాలు అందించడంతో పాటు వైద్య సదుపాయాల వంటి లాజిస్టిక్ సపోర్ట్ అందించేందుకు భారత నౌకాదళం అప్రమత్తంగా ఉందని వెల్లడించింది. అత్యంత ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనేందుకు భారత యుద్ధ నౌకలు సన్నద్ధంగా ఉన్నాయని నౌకాదళాధికారులు తెలిపారు. అదనపు గజ ఈతగాళ్లు, వైద్యులు, రబ్బరు పడవలు, ఆహార పదార్థాలు, తాత్కాలిక వస్తువులు, దుస్తులు, మందులు, దుప్పట్లు వంటి వాటిని అవసరమైన మేరకు అందించేందుకు సిద్ధం చేశామన్నారు. అంతే కాకుండా విశాఖపట్నం నుంచి జెమిని బోట్లతో పాటు డైవింగ్ సిబ్బందితో కూడిన బృందాలు ఇప్పటికే ఐఎన్‌ఎస్ చిల్కాలో మోహరించాయని తెలిపారు. తుఫాను తీవ్రత మొదలైన క్షణం నుంచి సహాయక చర్యలకు ఉపక్రమించేందుకు సిద్ధం చేసినట్లు వివరించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయడంతో పాటు వాటిని ఎలా అభివృద్ధి చెయ్యాలనే విషయాలపై తూర్పు నౌకాదళం ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుందని తెలిపారు. ఐఎన్‌ఎస్ డేగాలో ఎయిర్ క్రాఫ్టులు ప్రమాదపు పరిస్థితుల వద్దకు చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని నౌకాదళాధికారులు వివరించారు.
విమాన సర్వీసులకు అంతరాయం
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): విశాఖలో టిట్లీ తుపాను గాలుల ప్రభావం బుధవారం విమాన సర్వీసులపై పడింది. ఉదయం ఎని మిది గంటలకు ఎప్పటిలాగే ఇండిగో విమా నం చెన్నై నుంచి విశాఖకు వచ్చింది. ఎయిర్‌పోర్టులో దిగడానికి వాతావరణం అనుకూలించలేదు. ఉధృతంగా గాలులు వీయడంతో ఈ విమానం రాయపూర్‌కి మళ్లింది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ విమానాశ్రయానికి వచ్చింది. మరో అరగంటలో బయలుదేరి భువనేశ్వర్ మీదుగా కోల్‌కతా వెళ్లింది. నాలుగు గంటల పాటు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం తప్పలేదు. తర్వాత నుంచి మరి కొన్ని విమాన సర్వీసులకు గాలులు అంతరాయమైనా పావుగంట సేపు చొప్పున చక్కర్లు కొట్టి దిగాయి.
మల్కాపురం(విశాఖ పశ్చిమ): టిట్లీ తుఫాన్ ప్రభావంతో యారాడ తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. బుధవారం ఉదయం సముద్రం ఐదు అడుగుల ముందుకు వచ్చింది. చల్లటి గాలులతోపాటు అలలు ఎగసిపడుతుండడంతో వాకింగ్ వచ్చిన యువకులు, నేవల్ అధికారులు వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment