తుపానుపై అప్రమత్తం | IMD raises ‘Red Message’ alert over Cyclone Titli | Sakshi
Sakshi News home page

తుపానుపై అప్రమత్తం

Published Thu, Oct 11 2018 1:04 PM | Last Updated on Mon, Oct 22 2018 1:42 PM

IMD raises ‘Red Message’ alert over Cyclone Titli - Sakshi

మంత్రి గంటాకు పరిస్థితిని వివరిస్తున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

విశాఖసిటీ: టిట్లీ తుపానును దీటుగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉం దని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. తుపాను హెచ్చరిక కేంద్రానికి వెళ్లిన కలెక్టర్‌ వాతావరణ పరిస్థితిని, జిల్లాపై టిట్లీ ప్రభావాన్ని కేంద్రం డైరెక్టర్‌ రామచంద్రమూర్తిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టిట్లీ ప్రభావం జిల్లాలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాలతో పాటు తీరప్రాంత మండలాలపై తీవ్రంగా ఉంటుందన్నారు. 

గంటకు 150 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ఆ సమయంలో ఎవరూ బయటికి రాకుండా ఇళ్లల్లోనే ఉండాలని జిల్లా ప్రజలకు సూచించారు. కచ్చా ఇళ్లు, రోడ్లు, రైల్వే లైన్లకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. ప్రమాద తీవ్రతకు గురయ్యే వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న సుమారు 40 బోట్లు గంజా పోర్టుకు సురక్షితంగా చేరాయని తెలిపారు. విశాఖ పోర్టు, గంగవరం పోర్టులకు పెద్ద ముప్పు వాటిల్లనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో బెర్తులపై బోట్లకు సురక్షిత ఏర్పా ట్లు చేశారని వివరించారు.

విద్యుత్, పోలీస్, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, వ్యవసాయ, పశుసంవర్ధక, రవాణా తదితర శాఖలన్నీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రౌండ్‌ది క్లాక్‌ ఆయా ఉద్యోగులంతా విధుల్లో పనిచేస్తూ క్షేత్ర స్థాయిలోనే ఉన్నారని తెలిపారు. అధికారులందరికీ సెలవులు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. మత్స్యకార గ్రామాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కేంద్రాల్లోనూ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. కలెక్టరేట్‌ కంట్రోల్‌రూమ్‌ టోల్‌ఫ్రీ నం.180042500002కి ప్రజలు కాల్‌ చేసి సమస్యలు చెప్పాలన్నారు.

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ మంత్రి గంటా సందర్శన
టిట్లీ తుపాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ని మంత్రి సందర్శించారు. తు పాను నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. రిలీఫ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ కేంద్రాల్లో తగినన్ని ఆహార నిల్వలు, తాగునీరు ఉండేలా చూడాలని సూచించారు. వైద్యారోగ్య బృందాలను కూడా ఆయా కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాలన్నారు. మంత్రి వెంట జిల్లా రెవెన్యూ అధికారి సి.చంద్రశేఖర్‌రెడ్డి, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఇన్‌ఛార్జి ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement