పెను విలయం దిశగా..! | Red Alert about Titli Cyclone in Uttarandhra and Odisha | Sakshi
Sakshi News home page

పెను విలయం దిశగా..!

Published Thu, Oct 11 2018 2:43 AM | Last Updated on Tue, Oct 16 2018 4:56 PM

Red Alert about Titli Cyclone in Uttarandhra and Odisha - Sakshi

టిట్లీ తుపాను శాటిలైట్‌ చిత్రం

సాక్షి, విశాఖపట్నం, నెట్‌వర్క్‌: సుడులు తిరుగుతూ పెను విలయం సృష్టించే దిశగా ‘టిట్లీ’ తుపాను ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తోంది. ప్రచండ గాలులతో ప్రజలను వణికిస్తోంది. తుపాను ప్రభావంతో కడలి కెరటాలు నాలుగైదు మీటర్ల ఎత్తుకు ఎగసి పడుతున్నాయి. తీరం వైపు అలలు చొచ్చుకువస్తున్నాయి. అర్ధరాత్రి 11.30 సమయంలో విశాఖ ఆర్కే బీచ్‌ వద్ద సముద్రం ఒక్కసారిగా 30 అడుగులమేర ముందుకు వచ్చింది. బీచ్‌రోడ్డు వరకూ అలల తాకిడి కొనసాగటంతో ప్రజలు కలవరపాటుకు గురయ్యారు. మధ్యాహ్నం 3 గంటల నుంచే బీచ్‌లోకి సందర్శకులను అనుమతించకపోవటంతో నిర్మానుష్యంగా మారింది. కడలి అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది.   

తీరం దాటాక బెంగాల్‌ వైపు...
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుపాను బుధవారం మధ్యాహ్నం ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ అతి తీవ్ర తుపానుగా మారింది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. రాత్రి 11.30 గంటల సమయానికి కళింగపట్నానికి ఆగ్నేయంగా 130 కి.మీ., ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణ ఆగ్నేయంగా 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. టిట్లీ మరింత బలపడి పెను తుపానుగా మారుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. గురువారం ఉదయం 5.30 గంటల సమయంలో కళింగపట్నం– గోపాల్‌పూర్‌  మధ్య తుపాను తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో తెలిపింది. అనంతరం ఈ తుపాను వెనక్కి మళ్లి పశ్చిమ బెంగాల్‌ వైపు పయనించనుంది. టిట్లీ ప్రభావంతో బుధవారం ఉదయం నుంచి గాలుల ఉధృతి తీవ్ర స్థాయిలో ఉంది. రాత్రి సమయానికి ఉధృత రూపం దాల్చింది. ఉత్తరాంధ్రలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అర్థరాత్రి దాటాక గాలుల వేగం 140 నుంచి 165 కిలోమీటర్లకు పెరుగుతుందని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర, ఒడిశాల్లో రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. 

వంశధార, నాగావళికి వరద ముప్పు!
ఉత్తరాంధ్రలో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. కొన్నిచోట్ల 15 నుంచి 25 సెం.మీల వర్షం కురవవచ్చని తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదులకు వరద పోటెత్తి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. పెనుగాలుల ధాటికి గుడిసెలు, చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోవచ్చని, సమాచార వ్యవస్థకు అంతరాయం కలుగుతుందని, వరి, అరటి, బొప్పాయి తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపింది. రోడ్లు, కల్వర్టులు దెబ్బ తినడంతోపాటు చెరువులకు గండ్లు పడే అవకాశం ఉందని పేర్కొంది. 

రంగంలోకి సహాయక బృందాలు
తుపాన్‌ హెచ్చరికల నేపథ్యంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, నేవీ, కోస్ట్‌గార్డు దళాలు రంగంలోకి దిగాయి. ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు బృందాలను సన్నద్ధంగా ఉంచారు. సహాయ, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

20 రైళ్లు పాక్షికంగా రద్దు.. కొన్ని దారి మళ్లింపు..
టిట్లీ తుపాను కారణంగా రైలు పట్టాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నందున తూర్పు కోస్తా రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. విశాఖ నుంచి హౌరా వైపు వెళ్లే దాదాపు 20 రైళ్లను పాక్షికంగా రద్దు చేయటంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లించింది. కొన్ని రైళ్లను దువ్వాడ, భద్రక్, ఖుర్దా రైల్వే స్టేషన్లలో ముందుజాగ్రత్తగా నిలిపివేశారు. తుపాను తీరం దాటి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చాక ఈ రైళ్లను పునరుద్ధరిస్తారు. సామర్లకోట వద్ద కోనార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ను గంట సేపు నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈస్టు కోస్టును ముందస్తు జాగ్రత్తగా రద్దు చేశారు. 

శ్రీకాకుళం జిల్లాలో అర్థరాత్రి నుంచి భారీ వర్షం
శ్రీకాకుళం జిల్లాలో బుధవారం అర్థరాత్రి తరువాత ప్రచండ గాలులు వీస్తున్నాయి. ఉద్దానం మండలాల్లో కొబ్బరి తోటలు ధ్వంసమైనట్లు సమాచారం అందింది. జిల్లావ్యాప్తంగా భారీ వర్షం ప్రారంభమైంది. ఇచ్ఛాపురం, కవిటి, ఎచ్చెర్ల, రణస్థలం, సంతబొమ్మాళి మండలాల్లో వాన కురుస్తోంది. కవిటి మండలంలో  ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి ప్రజలను తరలిస్తున్నారు. కళింగపట్నం, ఇచ్ఛాపురం, సోంపేట, టెక్కలిలో మత్స్యకారులు పడవలు, వలలను ఒడ్డుకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శ్రీకాకుళం, టెక్కలిలో ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచారు. అవసరమైతే మరిన్ని బృందాలు తరలిస్తామని జిల్లా కలెక్టర్‌  కె.ధనంజయరెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్‌ రూంలు కొనసాగుతున్నాయి. 

విజయనగరంలో ఈదురుగాలులు
విజయనగరం జిల్లాలో బుధవారం చిన్నపాటి చినుకులు మాత్రమే పడినా ఈదురు గాలులు మాత్రం భారీగా వీస్తున్నాయి. పూసపాటిరేగ మండలం తిప్పలవలసలో కెరటాల ఉధృతికి తీరం కోతకు గురవుతోంది. మత్స్యకారులు పడవలు, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేశారు. గుంటూరు జిల్లా నిజాంపట్నం ఓడరేవులో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

హంసలదీవి వద్ద కడలి కల్లోలం.. 
కృష్ణా జిల్లాలోని హంసలదీవి వద్ద సాగర తీరం అల్లకల్లోలంగా మారింది. ఎన్నడూ లేనివిధంగా సముద్రంలో నీరు నీలం రంగులోకి మారడంపై స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకాయతిప్ప వద్ద పర్యాటకులను బీచ్‌లోకి వెళ్లనివ్వకుండా కరకట్ట వద్ద గేట్లను మూసివేశారు. తుపాన్‌ తీరం దాటే వరకు ప్రకాశం జిల్లాలో వాడరేవు, విజయలక్ష్మిపురం, పచ్చమొగిలి ప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. బుధవారం ఉదయం వేటకు వెళ్లిన వారిని తిరిగి రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. 

ఉప్పాడ – కాకినాడ బీచ్‌ రోడ్డులో వాహనాల రాకపోకలు నిషిద్ధం
కాకినాడ పోర్టులో మూడో నంబర్‌ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు తూర్పు గోదావరి జిల్లా ఇన్‌చార్జి కలెక్టరు ఎ.మల్లిఖార్జునరావు చెప్పారు. 18004253077 నంబరుతో కాకినాడలో కంట్రోల్‌రూం ఏర్పాటైంది. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో ఉప్పాడ – కాకినాడ బీచ్‌రోడ్డులో వాహనాల రాకపోకలను బుధవారం రాత్రి నిషేధించారు. ఉప్పాడలో సముద్రం నీరు ఇళ్లలోకి చేరుతోంది. 

నేడు, రేపు ఒడిశాలో విద్యాసంస్థల మూసివేత
టిట్లి తీవ్రరూపం దాల్చడంతో ఒడిశా తీర ప్రాంతంలోని ఐదు జిల్లాల్లో 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గంజాం, పూరి, కుర్దా, కేంద్రపడా, జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఆదేశించారు. తుపాన్‌ తీరం దాటనున్న గోపాల్‌పూర్‌ ప్రాంతంలో ఇప్పటికే వెయ్యి మందిని ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో గురు, శుక్ర వారాల్లో అన్ని పాఠశాలలు, కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. ఒడిశాలో పలు ప్రాంతాలను బుధవారం వర్షం ముంచెత్తింది. గురువారం భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవవచ్చని ఐఎండీ హెచ్చరించింది.  

కళింగపట్నం, భీమునిపట్నంలలో 10వ నంబరు హెచ్చరికలు
టిట్లీ తుపాను తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలోని ప్రధాన పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్న పోర్టుల్లో అత్యంత ప్రమాదకర సూచిక 10వ నంబరు సూచికను, విశాఖపట్నం, గంగవరం పోర్టుల్లో 8వ నంబర్, కాకినాడ, మచిలీపట్నంలలో 3వ నంబర్, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో నంబర్‌ ప్రమాద సూచికలను ఎగురవేశారు. తుపాను సమయాల్లో 10వ నంబరు హెచ్చరికను అతి ప్రమాదకరమైనదిగా భావిస్తారు. టిట్లీ తుపాను నేపథ్యంలో కళింగపట్నం, భీమునిపట్నాల్లో పదో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.

హుద్‌హుద్‌ తర్వాత ఇదే భారీ తుపాను..
2014 అక్టోబర్‌ 12న విశాఖను వణికించిన హుద్‌హుద్‌ తర్వాత అతి పెద్ద తుపాను టిట్లీనే. హుద్‌హుద్‌ సూపర్‌ సైక్లోన్‌గా మారడంతో గంటకు 220 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు వీచాయి. దీని ధాటికి విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సరిగ్గా నాలుగేళ్ల అనంతరం అక్టోబర్‌లో అదే తేదీల్లో టిట్లీ రూపంలో తుపాన్‌ ముంచుకొస్తోంది. గత నాలుగేళ్లలో ఏర్పడిన తుపాన్ల సమయంలో 70–90 కిలోమీటర్ల వేగానికి మించి గాలులు వీయలేదు. ఈసారి మాత్రం టిట్లీ ధాటికి పెనుగాలులు వీస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement