విజయనగరం గంటస్తంభం: బంగాళాఖాతంలో ఏర్పడిన టిట్లీ తుపాను గురువారానికి ఉగ్రరూపం దాల్చనుంది. ఇప్పటికే తీవ్ర తుపానుగా మారింది. దాని ప్రభావంతో బుధవారమే జిల్లా వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అక్కడక్కడ వర్షాలు పడడం ప్రారంభమైంది. ఈదురుగాలుల వేగం, సమద్రపు అలల ఎత్తు పెరిగింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం, ఒడిశా రాష్ట్రంలోని గోపాల్‌పూర్ ప్రాంతాల మధ్య తీరం దాటనుండడంతో వర్షాలు, గాలుల ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వారు చెప్పినట్లు గానే పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో తీరంలో కెరటాలు ఎగసిపడుతున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో అవి మరింత పెరిగే అవకాశం ఉంది. బుధవారం జిల్లాలో గంటకు 50 నుంచి 60 కీమీ వేగంతో గాలు వీచాయి. గురువారం తీరం దాటే సమయంలో గంటకు 185 కీమీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో గంటకు 100 నుంచి 120 కీమీ గాలు వీచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బుధవారం భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ, నెల్లిమర్ల మండలాల్లో ఓ మోస్తారు వర్షం పడగా, విజయనగరంలో చిరుజల్లులు పడ్డాయి. గాలుల కారణంగా పంటలకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. వర్షం మాత్రమే పడితే పంటలకు ఉపయోగకరమని పేర్కొంటున్నారు.
అధికారులు అప్రమత్తం..
తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. మత్స్యకారులను ఇప్పటికే వేటకు వెళ్లనీయకుండా చర్యలు తీసుకున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృంధాలను కూడా సిద్ధం చేస్తున్నారు. ముంపు బారిన పడే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, వారికి ఆహారం, వసతి సౌకర్యాలను కల్పించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. సమాచార, విద్యుత్, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు తుపాను వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నారు.
అప్రమత్తంగా ఉండాలి: జేసీ..
టిట్లీ తుపానుపై అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని జేసీ వెంకటరమణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మండలాధికారులతో కలెక్టరేట్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ మత్స్యకారులు, కచ్ఛా ఇళ్లలో నివశిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రాణ, ఆస్తి నష్టాలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. బస, ఆహారం, వైద్యం తదితర ఏర్పాట్లు చేయాని తెలిపారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే ప్రజలను ఇళ్లకు పంపాలని పేర్కొన్నారు.
అప్రమత్తం చేశాం: ఆర్డీఓ మురళి..
టిట్లీ తుపాను నుంచి ప్రజలను రక్షించేందుకు ముందుగానే హెచ్చరించామని విజయనగరం ఆర్‌డీఓ మురళి తెలిపారు. తన ఛాంబర్‌లో విలేకర్లతో మాట్లాడిన ఆయన శ్రీకాకుళం మీదుగా ఒడిశాలో తుపాను తీరం దాటుందని, ఆ సమయంలో 165 కీమీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. అన్ని శాఖల మండలాధికారులను ముందుగానే హెచ్చరించామని, పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని 26 పంచాయతీల మత్స్యకారులను తుపాను షెల్టర్లు, ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని ఆదేశించినట్లు తెలిపారు. తుపానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైందన్నారు.
తీరంలో తుపాను హెచ్చరికలు జారీ..
భోగాపురం/పూసపాటిరేగ: భోగాపురం, పూసపాటిరేగ తీరప్రాంత మండలాల్లో బుధవారం అధికారులు తుపాను హెచ్చరికలు జారీ చేశారు. గురువారం తీరం దాటే అవకాశం ఉన్నందున ఆ సమయంలో ప్రజలు, మత్స్యకారులు ఎవరూ తీరం వద్దకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. భోగాపురం తహసీల్దార్ పెంటయ్య తన కార్యాలయంలో వైద్య, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశమైయ్యారు. శనివారం వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి విపత్తు నుంచైనా ప్రజలను రక్షించేందుకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. తీరప్రాంత గ్రామాల మత్స్యకారులు పడవలను ఒడ్డుకు చేర్చుకునే పనిలో పడ్డారు. డ్వామా పీడీ త్యాగరాజు మత్స్యకార గ్రామాలను సందర్శించారు. అయితే పూసపాటిరేగ మండలంలో తీరప్రాంత గ్రామాల్లో బుధవారం రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు కనీస సమాచారం ఇవ్వలేదని మత్స్యకారులు చెబుతున్నారు. తిప్పవలస, చింతపల్లి గ్రామాల్లో రేవులు కోతకు గురయ్యాయి. రెండు రోజులుగా వేటకు వెళ్లలేదని, అయినప్పటికీ అధికారులు కనీస ఏర్పాట్లు చేయలేదని పేర్కొంటున్నారు.
రైల్వేస్టేషన్‌లో హెల్ప్‌లైన్..
విజయనగరం టౌన్: టిట్లీ తుపాను బలపడుతుండడంతో ఈస్ట్‌కోస్ట్ రైల్వే ముందస్తుగా ప్రయాణికుల సమాచారం కోసం హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసింది. స్టేషన్ ఆవరణలో విజయనగరం మీదుగా వచ్చే రైళ్ల సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు చేసింది. బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ వినియోగదారులు 08922–221202, 2211206, బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్‌కు సంబంధించి 85003 58610, 85003 58712, ఎయిర్ టెల్‌కు సంబంధించి 81060 52987, 81060 53006 నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు. బుధవారం రాత్రి పది గంటల నుంచి అన్ని రైళ్లను క్రమబద్ధీకరించే ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment