ధర్మాన ప్రసాద రావు
శ్రీకాకుళం: తుపాను ప్రభావిత ప్రాంతాలైన ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో ఈ రోజు, నర్సన్నపేట, టెక్కలి నియోజకవర్గాల్లో రేపు వైఎస్సార్‌సీపీ నాయకుల పర్యటన ఉంటుందని వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. శ్రీకాకుళంలో విలేకరులతో ధర్మాన మాట్లాడుతూ.. తుపాను తీవ్రతను ప్రజలకు ప్రభుత్వం చెప్పలేకపోయిందని విమర్శించారు. తీవ్రతను అంచనా వేసి ఆ మేరకు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పడవలు, వలలు కొట్టుకుపోయి మత్స్యకారులు విపరీతంగా నష్టపోయారని, లక్షల ఎకరాల్లో వరి, జీడిమామిడి, కొబ్బరి, మామిడి పంటలకు నష్టం జరిగి భారీగా ఆస్తి నష్టం ఏర్పడిందన్నారు. హుద్‌హుద్ సహాయమే ఇంకా రైతులకు అందలేదని వెల్లడించారు. ముఖ్యమంత్రి ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు సంబంధమే లేదని వ్యాఖ్యానించారు.
ఇప్పటికీ తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లేవని, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఇంకా రాలేదని తెలిపారు. మూడు రోజులుగా తుపాను హెచ్చరికలు ఉన్నా, బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. ఇంకా చాలా ప్రాంతాల్లో కరెంటు పునరుద్ధరణ లేదని తెలిపారు. ముఖ్యమంత్రికి పబ్లిసిటీ పిచ్చి ఉంది తప్పితే.. బాధితులకు సహాయం చేయడంలో శ్రద్ధ లేదని ధ్వజమెత్తారు. విపత్తుల్లో ఉన్నా చంద్రబాబు ఆదుకోరని ప్రజలకు అర్ధమైందన్నారు. అత్యవసర పనుల్లో వినియోగించే వారికి చెల్లింపులు కూడా సరిగ్గా చేయకపోవడంతో ఇప్పుడు ఎవ్వరూ ముందుకు రావడానికి ఇష్టపడటం లేదని వ్యాఖ్యానించారు.
తిత్లీ తుపాను నష్టంపై ధర్మాన నేతృత్వంలో కమిటీ
తిత్లీ తుపాను వల్ల దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లాలో ఆస్తి, పంట నష్టాన్ని అంచనా వేసేందుకు, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీలో భూమన కరుణాకర్ రెడ్డి, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, రెడ్డి శాంతి, పార్టీ జిల్లా వ్యవసాయ విభాగం అధ్యక్షులు రఘురాం సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ రేపటి నుంచి తిత్లీ తుపాను వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి నష్టం నివేదికను పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌కు అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment