శ్రీకాకుళం పాతబస్టాండ్: టిట్లీ తుపాను జిల్లాపై పడగెత్తింది. ఏ క్షణంలోనైనా విరుచుకుపడే అవకాశం ఉంది. దీంతో అధికార యంత్రాంగమంతా అప్రమత్తమైంది. జిల్లాలోని కళింగపట్నం–సంతబొమ్మాళి మధ్య తుపాను తీరందాటే సూచనలున్నట్టు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా.. ప్రధానంగా టెక్కలి డివిజన్‌లో గంటకు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడం.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకేసారి సుమారు పది సెంటీమీటర్ల మేర వర్షం పడే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పలు ప్రాంతాల్లో వర్షం
తుపాను నేపథ్యంలో బుధవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. తీర ప్రాంతంలో ఓ మోస్తరు గాలులు కూడా వీస్తున్నాయి. అలలు ఎగసి పడుతున్నాయి. రాత్రికి ఈ పరిస్థితి మరీ ఎక్కువైంది. తుపాను తీరం దాటే సమయంలో భారీ వర్షంతోపాటు గాలులు వీచే అవకాశం ఉండడంతో తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. చెట్లు కూలిపోవడం, విద్యుస్తంభాలు వాలిపోవడం, చెరువులు, కాలువలకు గండ్లు పడే ప్రమాదం ఉంది. వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తుపాను ప్రభావంతో ఒడిశాలో కూడా వర్షాలు పడే అవకాశం ఉండడంతో జిల్లాలోని నాగావళి, వంశధార, బహూదా, మహేంద్ర తనయ నదులకు వరదలు వచ్చే ప్రమాదం ఉంది.
విపత్తును ఎదుర్కోవడానికి సిద్ధం..
టిట్లీ తుపాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విపత్తును ఎదుర్కోవడానికి వీలుగా అన్నీ సిద్ధం చేశారు. తుపాను గురువారం ఉదయం తీరం దాటే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు, పాతగృహాలు వంటివి కూలిపోయే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. గజఈతగాళ్లను, బోట్లను మత్స్యశాఖ సిద్ధం చేసింది. ఆహార ధాన్యాలు, పెట్రోల్, డీజిల్‌ను అధికార యంత్రాంగం అందుబాటులో ఉంచింది. తుపాను నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూంను ఏర్పాటు చేశారు. అత్యవసర సమాచారం కోసం 08942–240557 నంబర్‌ను అందుబాటులో ఉంచారు. మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్‌రూంలను కొనసాగిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు వివిధ శాఖల అధికారులతో బుధవారం టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు.
వరి రైతుకు కష్టం
తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటే వరిరైతుకు తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలులు వీస్తే వరి పంట నేలకొరిగే ప్రమాదం ఉంది. జిల్లా ఈ ఏడాది 2.18 లక్షల హెక్టార్లలో వరి పంటను వేశారు. పంట ఇప్పటికే సుమారుగా సగం వరకు పొట్ట, పూత దశలో ఉన్నాయి. పంట వాలినా, నీటి ముంపునకు గురైనా రైతులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది.
మత్స్యకారులు వేటకు వెళ్లొదు
తుపాను నేపథ్యంలో మత్స్యకారులెవరూ చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వలలు, బోట్లను సరక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
రణస్టలం మండలంలోని తీరప్రాంత గ్రామాలనై జీరుపాలెం, అల్లివలస, కొచ్చెర్ల, కొత్తముక్కాం, కొవ్వాడ, దొనిపేట వంటి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యశాఖాధికారి బి.గోపికష్ణ తెలిపారు.
జిల్లాకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
జిల్లాకు రెండు ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ఇన్‌స్పెక్టర్లు సతీష్‌కుమార్ (టీం కమెండర్), అంకిత్ తివారీ ల బృందాలు జిల్లాకు చేరాయి. అవసరాన్ని బట్టీమరిన్ని బృందాలను తీసుకువస్తామని అధికారులు ప్రకటించారు. ఇందులో ఒక బృందం బు««ధవారం రాత్రికికి టెక్కలికి చేరగా, మరో బృందం శ్రీకాకుళంలో ఉంది. వీరితో పాటుగా సేవా బృందాలను కూడా సిద్ధం చేశారు. అన్ని శాఖ సిబ్బంది తుపాను పనుల్లో ఉండాలని కలెక్టర్ ధనంజయరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment