తిత్లీ | Tirty storm | Sakshi
Sakshi News home page

తిత్లీ

Published Sun, Nov 18 2018 1:09 AM | Last Updated on Sun, Nov 18 2018 1:09 AM

Tirty storm - Sakshi

వారం రోజులుగా ముసురు. టిపిరి టిపిరి సినికులు తగులుకున్నాయి. ‘‘అరె శివ.. రేతిరికి పెద్ద తుపానమట్రా.. తిత్లీ’’ అనింది సీకన్య. అప్పుడు మావూరి అమ్మోరి గుడికాడ వున్నాన్నేను. సీకన్య ఆల్లమ్మతో గుడికొచ్చింది. ‘‘తిత్లీ’’..ఈ పేరు ఇనగానే శానా నవ్వొచ్చింది నాకు. గట్టిగా నవ్వాను. ‘‘ఏనికిరా ఆ నవ్వు’’ అని మూతిరిసింది సీకన్య. నాకింకా నవ్వొచ్చింది. ‘‘అంత నవ్వొద్దురా.. టీవీలసెప్పారు. తిత్లీ తుపానమట’’ అనింది మళ్లా పెద్ద తెలిసినట్టుగా.. నేనసలే æఒకరి మాట ఇనే నాకొడుకుని కాను. అది సెప్పిందెందుకింటాను?! దాని మాటకి ఇగటానికి దిగినాను. ‘‘తిత్లీ అట.. తిత్లీ.. కిట్లీ.. ఫిట్లీ.. లొట్లీ’’ అని ఇగటానికెళ్ళాను. ‘‘ఎల్రా ఊసకల్లోడా.. టీవీ సూస్తే తెలుసును. గంటకి 150 గాలట. పలాస దాక పారొచ్చింది’’అని టీవీల నూసులాగ మళ్లా సెప్పింది. నాకు ఇంకా పౌరుసం పొడుసుకొచ్చింది. ‘‘ఎల్లే..పెద్ద నీకేదో తెలిసినట్టు పోజు కొట్టక. సోసల్ల పస్టు నాను. నాకు తెలుసును. తుపానమంటే పెద్ద గాలి. గట్టిగా వస్తాది. అది పలాస దాకొచ్చి ఆగిపోదు.! అదేమైనా బొస్సా?! పలాస నుండి సోంపేటొచ్చి, అక్కడ రెస్టు సేసుకొని మళ్లా ఇచ్ఛాపురం రావడానికి’’ అన్నాను ఇగటంగా.నా మాటకి ఇంత పొడుగు మూతెట్టింది సీకన్య. ‘‘ఎల్రా..ఊసకల్లోడా’’ అని నా పొద్దెట్టి ఆలమ్మ యెనక సిన్న ఈరో సైకిలు తొక్కుకుంటూ ఎల్లిపోయింది. సీకన్య, నాను ఒకటే క్లాసు. ఆరు. ఈ ఏడే ఎంపీపీ ఇస్కూల్‌ నుండి జెడ్పీహెచ్‌ ఇస్కూల్కి ఎళ్లినాము. మా యడ్డుమాస్ట్‌ కూతురే సీకన్య. నాను ‘‘సీకాయ’’ అని ఇగటమాడుతుంటాను. ‘‘అరె..ఊసకల్లోడా.. నాపేరు శ్రీకన్య. పలకడం రాకపోతే పల్లకో. అంతేగానీ పరాసికాని పోకు’’ అని శానా ఇదైపోతాది సీకన్య.కానీ సీకన్య సూపరు. నాను, సీకన్యని ‘‘ఐస్పర్యారాయ’’అని ముద్దుగా పిలుసుకుంటా. బొమ్మ సెక్కినట్టుగ వుంటాది సీకన్య. దాన్ని కేళిసేయడం నాకు శానా సరదా.

 నానింకా అమ్మోరి గుడికాడే వున్నాను. ముసురు గదా... పొద్దుగూకే యాల కూడా తెలియట్లే. ఇంతల సిమ్మాద్రి వచ్చాడు. మాసీనేరు. పదోక్లాసు. ‘‘శివ..గెడ్డ కెళ్తామా?’’ అన్నాడు.నాకు బైమేసింది. మాయమ్మ మాటలు గురుతుకొచ్చాయి. ‘‘అరెశివుడు.. ముసురు పట్టింది. గెడ్డకెల్లక. నీరు పారతుంది నాయన... జాగరత. నూతికాడే పోసుకో. రొండుకొస్తే మెరకరోడు మీదకెళ్ళు. అంతే గానీ గెడ్డ జోలికెళ్ళక’’ అని మూడు రోజులుగా గంట కొట్టినట్టుసెప్తుంది. ఆ మాటలు గురతుకొచ్చాయి. ‘‘వద్దన్నా..రాను’’ అన్నాను. ‘‘పోబే..పిరికోడా’’ అని నా మొకమ్మీన అనేసెల్లిపోయాడు సిమ్మాద్రి.‘‘ సెహ్‌.. ! నా పొరువు పోయినంత పనైంది. ఎవురు పక్కన నేరు కాబట్టి సరిపాయే. మా ఐస్పర్యా వుండివుంటే..?! సెహ్‌.. నా తల ఎక్కడ పెట్టుకుందను. మాయమ్మొకటి. ! ఎప్పుడూ పిరికి నూరిపోస్తాది’’ అని నాలోనే ఇదైపోయాను. అయినా మాగెడ్డ అంటే నాకు బైమే. ఇలాంటి ముసురులో అది పొంగితుంది. మా ఇలకాలే పారితాది మాగెడ్డ. అది బాహుదా నది తాలూకు గెడ్డట. మాయమ్మ సెప్పింది. ఆ నది తిన్నగా ఈతపరం యేటిల కలిస్తాది. అక్కడి నుండి సముద్రమట. నాకు తెల్దు. మాయమ్మే సెప్పింది. కానీ గడ్డ పారినప్పుడు అందులో గెంతిఈతపరం దాక ఈత కొట్టాలనే ఓ కోరిక వున్నాది నాకు. ఇదే సంగతి మాయన్నకు సెప్పానొకసారి. నన్ను ఎగాదిగాసూసి, బుర్రమీన ఒక్క గస్కీ ఇచ్చాడు. ముసురు ఎక్కువైయింది. ఇంక ఆలిసం సేయకంటా ఇంటికి పారొచ్చాను. ···మాది కమ్మలిల్లు. కిందమట్టి. ముసురికి బాగా తడిసిపోయి, ఐసుగడ్డనాగ వుంది మా ఇల్లు. జోరుగాలికి కెరంట్‌ ఎల్లిపోయింది. ఇల్లంతా సిమ్మసీకటి. నాను పరిగెత్తికెళ్లి మాయమ్మను పట్టుకున్నాను.

నాకు సూడకంట కొవ్వొత్తి కోసం యతకత్నాది మాయమ్మ. కొవ్వొత్తి దొరికింది. ఎలిగించింది. ఆ ఎలుతురులో ఎర్రటి సెంద్రుడిలా కానొచ్చింది మాయమ్మ. మాయమ్మ కాలికి జలగలా పట్టుకున్న నాకుసూసి ‘‘ఓ.. పిరికోడు’’ అని ఉడికించాడు మాయన్న. కానీ నాను ఉడకనేదు. ఆడి బుద్ధి నాకు తెలుసు. నానొగ్గేస్తే ఆడొచ్చి అమ్మను సుట్టుకుంటాడు. ఆడి సంగతి నాకు తెల్డా?! ఆడి పప్పులు నాదగ్గిర ఉడకవు.మానాయన, అన్న ఏరే దీపంబుడ్డి ఎలిగించారు. మాయన్నకి సదువు పిచ్చి. ఇంత ముసురులో కూడా పుస్తకం వదల్డు. నాయనికి యాదో పాటం అప్పగిస్తన్నాడు.నాను మాయమ్మ దగ్గిర కూకున్నాను. దసరా సీజన కదా..సేలా రకాల పప్పలు సేసి వుంచిందమ్మ. మూడు రోజులుగా నాకు పండుగే. ఇంకా సేలా రకాల పప్పలు, ఖజ్జాలువున్నాయి. అవన్నీ ఒక పెద్ద డబ్బాలో ఉంచిందమ్మ.‘‘మా.. ఖ...ఖ..జ్జ‘’ అని సిన్నగా అడిగాన‘‘ఇప్పుడు వద్దు నాయినా.. కూడు తినేయాల ఖజ్జాలు తింటే మరి బువ్వేం తింటావు. వండిన అన్నం పారేస్తానా’’ అనిదీర్గంతీసిందమ్మ.‘‘నాను అన్నం తిన్నే. పప్పలు, ఖజ్జాలే తింటాను. నాకు అవే ఇయ్యు’’ అని కచ్చా సేసాను. ‘‘సెహ్‌.. ఏంపిల్లడవురా నీవు?! సెప్పిన మాట ఇనవు. షెహ్‌.. నీతో నాకు సచ్చేసావొచ్చింది’’ అని మీదకి లేసిందమ్మ. నా మొకం ఎలిగిపోయింది. ‘‘మ్మా...గ..గ..గ..’’ అని వుసారుగా పాడాను. ‘‘అరె.. గార్లన్నీ నీవే తిన్నావ్‌. పెద్దోడికి ఏం లేవు’’ అని మాయన్న సైడు మాటాడిందమ్మనాను మళ్లా మూతి ముడుసుకున్నాను. ‘‘ఇదొక్కటి నేర్సావ్తండ్రినాగ’’ అని బుర్రమీద ముద్దుగా ఒక్కటి మొట్టి.. రెండు గార్లుసేతిలో పెట్టి.. మళ్లా డబ్బా మెద్దిమీదెట్టేసింది.మినపగార్లు అంటే నాకు శానా పిచ్చి.

నా కోసమే పెషల్‌గా గార్లు సేస్తాది మాయమ్మ. పెనంమీదే పాతిక లాగించేస్తాను. మాయన్నకి ఇవంటే పెద్ద ఇష్టం నేదు. ఆడు అరిసెల పెసలిస్ట్‌. అమ్మ వండిన అరెసలన్నీ ఆడికే. నాకెందుకో అవి కిట్టవు.రెండు నిమషాల్లో రెండు గార్లు ఊదేసాను. మళ్లా ‘‘ప...ఖ.. గ...’’ అని రాగం తీసాను. ఈసారమ్మకు సిరాకొచ్చింది. ‘‘ఏమయ్యో.. ఈడిని ఆ మెద్దెక్కించే. పప్పలు.. పప్పలు.. అని పానం తీస్తనాడు. సెహ్‌..ఇనాటి పిల్లడు ఎక్కడా వుండడమ్మా?!’’ అని ఇంత దీర్గం తీసిందమ్మ. మాయమ్మ సిరాకు ఇని ‘‘అరె శివ.. ఇక్కడికి వస్తావా? అక్కడికి రమ్మంటావా?’’ అంగటింటి నుండి వార్నింగి వదిల్నాడు మా నాయిన. తేలుకుట్టిన దొంగలాగ పల్లక వుండిపోయాన్నాను.‘‘అక్కడకిక్కడికి నేదు. ఒకటే కొవ్వొత్తుంది. ఆ బుడ్డీల సవురు నేదు. ఇంత ముద్ద తినేసి బొజ్జుంటారండి’’ అని గిన్నల దగ్గరికెళ్ళిందమ్మ. నాను ముందు మటం ఏసాను.‘‘ఇందాక తిననన్నావ్‌బే..’’ అని సిన్నగా నా సెవి దగ్గరన్నాడు మాయన్న. దొరికింది శాన్స్‌.. ఇంత పొడుగు రాగం తీసి ‘‘ఈడు నాకు ఉడికించాడు. నాను తిన్న్‌ పో..’’ అని డ్రామా కట్టాను. పాపం..మాయన్న డ్రామాల మనిషి కాదు. నాను పక్కా డ్రామా నాకొడుకొని.ఈర లెవల్లో యాగీ సేస్తాను. అయితే ఎంత డ్రామా నాకొడుకునైనా మాయమ్మ దగ్గిర పిచికనే. ‘‘ఒరేయ్‌.. అపరా నీ ఏసికాలు. ఖజ్జాలు కావాలని అడుగు. ఈ ఏసికాలన్నీ  వద్దు’’ అని గాలి తీసేసింది మాయమ్మ. మాయన్న మళ్లా ఆడి కంటితో ఉడికించాడు. నా మొకం ఎక్కడ పెట్టుకొవాలో అర్దం కాలే. మెల్లిగా మానాయిన పక్కకెల్లాను. సెవిలో ఒక ‘మాట’ సెప్పాను. మా నాయిన శానా సంతోసపడ్డాడు. ‘‘అనే.. ఆడికి అన్నం సహించదు. ఓ రెండు గార్లిచ్చే’ అని నాసైడు తీసుకున్నాడు. ‘‘బుర్రకి నూన రాసి, ఒళ్లుపట్టి, కాళ్ళు నొక్కితా.. పైకి ఎక్కితా..అన్నాడా?’’ అనిందమ్మ.‘‘సెహ్‌.. మా’మాట’ అమ్మకి తెలిసిపోయింది. పిల్లిసెవులు.

ఎలా ఇనేస్తాదో?!’’ అని గోలు కొరుక్కున్నాన్నాను. మా నాయిన మాయమ్మని సూసి ఉడతపిల్ల కీచమన్న రీతిగా నవ్వుకున్నాడు.‘‘అరేయ్‌ శివుడు.. మూడు రోజులైయిందిరా నీవు బువ్వతిని.!  సెహ్‌.. ఒట్టు..ఇంకెప్పుడు ఈ పప్పలు వండను. ఒకేల వండితే నాది మనిషి జలమ్మే కాదు’’ అని నాలుగు గారెలు, రెండు పొంగడాలు, ఇన్ని జంతికులు, ఇంత సలిమిడి ముద్ద కంచంలో పెట్టి అన్నం వడ్డించినట్టు ఇచ్చింది. నా మొకం మళ్లా ఎలిగిపోయింది. పదినిమిషాల్లో మెక్కేసా.···‘‘శివా.. మాట’’ అని గుర్తు సేసాడు మా నాయిన బొంత మీద నడుం వాలుస్తూ.నాకు పప్పలు పీకమొయ్యికైపోయాయి. ‘’రేపు’’ అన్నట్టుగా సూసాను.‘‘సెహ్‌..శివడ్ని ఇంకనమ్మేదిలే’’ అని ఇంత పొడుగు మొకం పెట్టాడు మానాయిన. ఈసారి మాయమ్మ ఉడతపిల్ల కీచుమన్నట్టుగా నవ్వింది.ఇంతలో పెద్ద శబ్దం ఇనిపించింది. నాను జడుసుకొని ఒక్క జంపుకొట్టి మాయమ్మని పట్టుకున్నాను. అమ్మ గాబరా పడింది.‘‘ఏంనేదు నాయన. జడక. వాన తగ్గిపోయినట్టుంది. అందికే ఈ మెరుపులు, ఉరుములు. ఉరుము వచ్చిందంటే ఇంక వాన తగ్గిపోద్ది’’ అని సామాన్య పాటమేదో సెప్పిందమ్మ. నాకేం బుర్రకెక్కనేదు, కానీ ‘‘వాన తగ్గిపోద్ది’’అనే మాట శానా మంచిగా అనిపించింది. ‘‘ఈ సీగొట్టి ముసురు వల్ల దసరా సెలవలన్నీ ఏస్ట్‌.! ఈ పదిరోజులు కసిగా క్రికెట్టు ఆడాలని అనుకున్నాం. గ్రౌండ్సెక్కాం. ఈ ముసురు వల్లఅంతా బురదైపోయింది. గవర్నమెంటోడు దయ తలిసి వానవొదిలిపోయినాక.. మరో పది రోజులుసెలవ ఇస్తే ఆడికి పున్నెందక్కును. అనాగే క్వార్టర్లీ పేపర్లు పదిసార్లు రాయమని తగులుకున్నారు మేస్టార్లు. ఆలకేం పోయింది. రాసినోడికి తెలుస్తాది నెప్పి.

అంచేత..ముసురు కారణంగా రాతకార్యక్రమం కూడా రద్దుసేస్తినట్లు గవర్నమెంటు నిండి ఒకసర్కిలరువస్తే.. మా ఐస్పర్య ఆళ్ళ తోటలో దొంగతనం సేసైనా అమ్మోరికి వంద కొబ్బిరికాయలు కొడతాను’’అని మనుసులోనే మొక్కుకున్నాను.ఇందాక మాయమ్మ సెప్పినట్టు వాన తగ్గింది. కానీ జోరుగా గాలి తగులుకుంది. ‘‘హు..హు.. హు..’’ అని ఇస్పీడుగా కొడుతుంది గాలి. కమ్మలిల్లుకదా.. గాలిసబ్దం అదో రకంగా ఇనిపిస్తుంది. సలికూడా వేస్తుంది. మాయమ్మ దగ్గరికెళ్ళి ముడుసుకొని కడుపులో దూరిపోయాను. బలేటి యచ్చగావుంది. కునుకు పట్టేసింది. ···సరిగ్గా ఒంటిగెంట. నా మొకమ్మీన ఎవరో నీరు కొట్టినట్టు అనిపించింది. ఇలాటి పిత్తిగిల్లి పని మాయన్న సెయ్యడే?! ఈటైంలో ఎవుడు?! అని సిరాగ్గా కళ్ళు తెరిసాను. పక్కన మాయమ్మ నాయిన అన్న.. ఎవురూ కనిపించనేదు. ‘‘కెవ్వు’’మని అరిసాను. ‘‘శివజడక.. నాను ఇక్కడే వున్నాను’’ అని అంగటింట్లో నిండిటార? అంటూ సూపించాడు మాయన్న. కాసేపయ్యాక అమ్మ నాయన అన్న వొచ్చారు.గాలికి అంగట్లో పెనక ఎగిరిపోతుంది. దానికి కందాడుతో గుంజకి కట్టడానికెళ్ళారు. వాన, గాలి ఎక్కువైపోతుంది. ఇల్లంతా కారిపోతుంది. మెద్ది కింద వున్నాం కాబట్టి తడవం నేదు. కానీ గట్టిగా గాలి వస్తుంటే.. పంచ నుండి నీళ్ళు మొకానికి కొడతనాయి. కాసేపటికి గాలి ఇంకా ఎక్కువైయింది. ఎన్నుకట్టు బిగి వదిలేసినట్టుంది. కమ్మలు ఒకొక్కటిగా ఎగిరిపోతున్నాయి. మెద్ది కింద పడుకున్న నాకు ఇనిపిస్తుంది కమ్మలు ఎగిరిపోయే సబ్దం. గాలికి కమ్మలు ఎగిరిపోతున్నపుడు అదోరకం యరైటీ సౌండ్‌ వస్తాది. ‘‘జయ్యి.....జప్‌. జయ్యి....జుప్‌’’ ఇలా ఎగిరిపోతుంది ఇంటి మీద కమ్మ. కాసేపటికి ఇంట్లోనే గాలి, వాన కురిసింది.పరిస్థితిç Üూసి ‘‘అనే..ఈ తుపానము ఎక్కువైపోతుంది. ఇంటి నుండి ఎల్లిపోదాం పదే’’ అనిందమ్మ. మా నాయిన పల్లకున్నాడు. నాకు సీకన్య మాటలు గుర్తుకొచ్చినాయి. ‘‘అదేదో పేరు సెప్పి..పెద్ద తుపానమనింది.

నాను ఇగటానికి పోయాను. ఆ తుపాన్ని ఎక్కిరించాను. ఇప్పుడు గాలిని సూస్తుంటే.. కొంపతీసి నా ఎక్కిరింతలు ఇని ఆ తుపాను పగ తీర్చుకోవడం నేదుకదా..?! ఈ గాలి వరస సూస్తుంటే.. మొత్తం మా ఇంటికే తగులుకున్నట్టు వుంది.! ఓరి బగమంతుడా..! రెపొద్దున సీకన్య మొకం ఎలా సూసేది?! సెహ్‌..! ఈ తుపాన్‌ రేపొచ్చినా బాగున్ను. దాని మాట నిలబడకపోను..సస్‌’’ మళ్లా అడిగిందమ్మ.‘‘పదే.. ఎల్లిపోదుము.. మనకేమైనా పర్వానేదు. ఇక్కడే వుంటే పిల్లలు సచ్చిపోతారే’’ అని గొంతు అదోలా సేసిందమ్మ. ఆ గొంతు ఇంటే నాకు బైమేసింది. మానాయినకి మాత్రం సిరాకేసింది. ‘‘ఈ రాతిరి ఎక్కడికి ఎల్తామే..?! ఎవరింట్లో దూరిపోతామే..?! మనకి సిగ్గునేదా?’’ గాలి కంటా గట్టిగా అరిసాడు మా నాయిన. ‘‘సీ.. నీ బతుక్కి మళ్లా రోసము..! దసరాకి కొత్త కమ్మ నేయించమని గింజుకున్నాను. ఇన్నావుగాదు. ఇప్పుడా పాత కమ్మ గడ్డి పరకలా ఎగిరిపోతుంది. సెహ్‌..ఏంమనిసివే నీవు’’ అని దెప్పిపొడిచిందిమ్మ.‘‘అనే.. సుసావా..! కొత్త కొమ్మ నేసుంటే ఎంతనష్టి.! ఈగాలికి కొత్త కమ్మ కూడా నిలబడదు.సేలెంజ్‌!’’ అని మూకుడి ఏసాడు మా నాయిన. ‘‘అయ్యా... నీతో మాటాడి నెగ్గనేను. ఇనాగే వుంటే ఈ ఇల్లు కూలిపోద్ది. బగమంతుడా..నా పిల్లలు..’’ అని మళ్లా అదోలా అనిందమ్మ.‘‘ఏం కాదు. గాలి తగ్గిపోద్ది’’ అన్నాడు నాయిన‘‘అనే.. పదే.. ఈరమ్మత్త ఇంటికి ఎల్లిపోతుమా’’ అనిందమ్మఈరమ్మత్తిల్లు మా ఇంటికి ఐదిళ్ళు దూరం.పెద్దిల్లు. రెండు అంతస్తుల మేడ. మాయమ్మా ఈరమ్మత్త మంచి మొకరాలు. కానీ ఈరమ్మత్తతో ఒక సిక్కుంది! పిసరంత ఉప్పు ఇచ్చినా పేనంపోయినంత వరకి దెప్పుతునే వుంటాది. ఇప్పుడు గానీ మాము ఆడికెల్తే.. ఇంక మా పేనాన్ని కాపాడేసినట్టు డబ్బా కొడతాది. అసలే మా నాయిన శానపౌరుసం మనిషి. సచ్చినా సస్తాడు కానీ దాని ఇంటి ముందుకెళ్ళి నిలబడడు. ఆ సంగతి నాకు బాగా తెలుసు.నాను అనుకున్నట్టే అయ్యింది.! ‘‘ఈరమ్మ ఇంటికా.. నాను సచ్చినా రానే’’అని తెగేసిసెప్పాడు మా నాయిన. మా నాయిన ఆ మాటన్న యంటనే ఎన్నుకట్టు ఇరిగిన సబ్దం ఇనిపించింది.

నాలుగు ఎదురు కర్రలు ‘‘పట్ఫాట్ఫట్‌’’మని ఇరిగిఇంట్లో పడ్డాయి. ‘‘ఏం కాదు.. ఏం కాదు.. మనకి మెద్ది వుంది.ఏం కాదు’’అని దైర్యం సెప్పాడు మా నాయిన. మేం అంతా మెద్దికింద వున్నాం.ఇంతలమరో రెండు కమ్మలు ఎగిరిపోనాయి. అదిసూసి మాయమ్మ ‘‘నాయినా.. నీవు నా పిల్లలని తినేస్తావు.! నీవు వస్తేరా.. నేకపోతే మానే.. నాను మాత్రం నా పిల్లల్ని ఎట్టికెళ్ళిపోతా’’ అని నన్ను బుజాన ఎత్తుకొని మాయన్న రెక్క పట్టుకుని రెండు అడుగులేసింది.మా నాయిన అనాగేç ³ల్లకుని కూకోయినాడు. ఒక నాలుగు అడుగులు నడిసిన మాయమ్మ.. మళ్లా ఎనక్కి తిరిగి.. ‘‘ఓరి బగమంతుడా.. నాకెందుకీ సావొచ్చింది’’ అని మా నాయిన దగ్గరికొచ్చి నాయిన వడిలో తలపెట్టుకుంది. మామంత నాయిన సుట్టు సేరినాం.నా యదవ కడుపేమిటో గానీ, దానికి సమయం, సందర్భం ఏమీనేదు. ఎందుకో తెల్దు.! నాకు ఇప్పుడాకలేసింది. మెద్దిమీదున్న పప్పల డబ్బాపై నా మనసు లాగింది. ఇపుడుగానీ ‘‘గ.. గ.. గ’’ అంటే బాగోదు. గాలింకా పెరిగిపోయింది. మాయమ్మ పల్లకున్నాది. ఇంక శకితి లేనట్టు మానాయిన జబ్బమీద వాలిపోయింది. నాను, మాయన్న.. మానాయిన కాలు సెరోటి సుట్టుకున్నాం. మాఇంటి ముందు పంచ ఎగిరిపోయింది. గాలిదెబ్బకి తలుపు ముక్కలైపోయింది. ఎందుకో మా నాయినలో కూడా కొంచెం బయం కనిపించింది. ‘‘అనే..ఈ మాయదారి తుపాను తగ్గినట్టు ఏమీనేదు. పద బయటికి ఎల్లిపోదాం’’ అన్నాడు మా నాయిన. అంత సీకట్లో కూడా మాయమ్మ కంటిల సంతోసం కానొచ్చింది. మా నాయిన కాస్త బలంగా దిట్టంగా వుంటాడు. అన్నని అమ్మని సెరోసేయితో పట్టుకున్నాడు. నాకు గుర్రంపళ్ళు ఎక్కమన్నాడు.నాను ఏదోఆలోసిస్తున్నట్లు మొకమెట్టాను. ‘‘ఏంట్రా శివుడు.. పదరా..’’ అని తొందరబెట్టిందమ్మ. నాను మెద్ది మీదున్న పప్పల డబ్బాకేసి సూసాను. మాయమ్మకు మా శానా సెడ్డ కోపమొచ్చింది.‘‘సెహ్‌.. ఏం పిల్లడివిరా నీవు?! పానం పోతున్నా.. నీకు పప్పలే కావాలా?! తు..నీజలమ..!ఏం జలమ్రా నీది..?! బతికుంటే బండెడు పప్పలు సేసి పెడతాను.. పదరాఅయ్యా..’’ అని బుర్రమీద ఒక్కటేసింది.

అ దెబ్బకి మా నాయిన బుజాలెక్కేసాను. నాను మా నాయిన బుజంమ్మీన వున్నాను. అమ్మ అన్నా సెరో వైపు వున్నారు. మా నాయిన నోటితో టార్చలైటు పట్టుకున్నాడు. మెల్లిగా మా ఇల్లు దిగాం. ఈదిలోకి వచ్చాం. గాలి దంచి కొడుతుంది. ఎనక్కి తోస్తుంది. మానాయిన గాలిని మెడ్డుకుని ముందుకి కదల్తనాడు. ‘‘హు.. హు.. హు..’’ అని శబ్ధంతో సెవులు దిమ్మ కట్టేస్తనాయి. మా నాయిన మాత్రం గాలిని మెడ్డుకుని ముందుకెల్తనాడు. మా నాయిన్ని ఇలా సూస్తుంటే అచ్చిం సినిమాలా ఈరోవునాగే అనిపిస్తనాడు.మా నాయిన తుపానికి ఎదురెల్తనాడు. ఇంత జోరుగాలిని మెడ్డతనాడు. నాకు శానా మంచిగా అనిపిస్తింది. ఈరమ్మత్త ఇంటికెదురుగా వచ్చినాం. మాయమ్మ అటుకేసి ఎల్లబోయింది. యంటనే మా నాయిన మాయమ్మసెయి ఎనక్కినాగి ముందుకెళ్ళాడు. అప్పుడు అర్దమైయింది. మా నాయిన ఇంకెక్కడికో తీసుకుయల్తనాడని.ఈదిల ఇల్లన్నీ దాటుతున్నాయి. ఎక్కడ ఆపుతాడో తెల్దు. మాటాడిస్తామా.. అంటే నోట్లోటార్చలైటెట్టుకున్నాడు. ఒక ఇంటి దగ్గరికి ఎల్లగానే మెల్లిగా నడిసాడు. నా గుండ్లో రాయిపడింది.! అది మా ఐస్పర్య ఇల్లు. ‘‘సాయంకాలమే దానితో ఇగటమాడాను. ఇప్పుడు గానీ దాని ముందు నిలబడ్డానా?!  నాను సచ్చినట్టే నెక్క. తు.. నా బతుకు. ఇంకెక్కడ తలపెట్టుకునేది.?! బగమంతుడా.. ఏమీ కర్మరా.. చస్‌.. ఏం గాచారమొచ్చింది. దాని ఇంట్లోకి ఎల్లే బదులు ఏటిలోకి ఎల్లిపోవడం నయం’’అని మనుసులో శానా ఇదైపోతున్నాను. హమ్మయ్యా.. ! సెప్పు సరి సేసుకోవడానికి కాస్త ఆగినాడు మానాయిన. ఇప్పుడు దాని ఇల్లు కూడా దాటిపోయినాం. మరో ఇరవై అడుగులేసినాక మా ఎంపీపీ ఇస్కూలొచ్చింది. తిన్నగా ఇస్కూల్లోకి తీసుకెళ్లినాడు మా నాయిన. ఊపిరి పీలిసింది మాయమ్మ. నిరుడే దిట్టంగా డాబా ఇస్కూల్‌ కట్టారు. పది కుటమాలైన ఆ డాబాలో పట్టిపోతాయి. సాయింకాలం బంట్రోత్తో దండోరా ఏయించారట. తుపానంతో ఎవరికైనా ఇబ్బంది వుంటే ఇస్కూల్లోకి రావచ్చునని. మేము వచ్చేసరికి ఇంకో రెండు కుటమాలక్కడున్నాయి.

తడిబట్టలుతోనే ఒకవార కూకున్నాం.మేమొచ్చినాక ఇంకా గట్టిగా తగులుకుంది తుపాను. ఐతిప్పుడు బయంలే. పైగానా కోరిక తీరింది. నాను ఎంపీపీ ఇస్కూల్లా వుండగా యడ్డుమేస్టు సీటులో పడుకోవాలనే కోరికుండేది. ఇప్పుడా కోరిక తీరింది. తిన్నగా ఎల్లి యడ్డుమేస్టు సీటులో కూకోని ఎదరగా వున్న టేబులు మీన దర్జాగా కాలు సాపాను.నాకు మళ్లా మా ఇంట్లో మెద్ది మీదున్న పప్పల డబ్బా గురతుకొచ్చింది. ఇప్పుడా డబ్బా తెచ్చుకొని వుంటే ఈ సలిలో దర్జాగా కాలు మీద కాలేసుకొని తిందును.. చస్‌’’ ···తెల్లారింది. తుపాను అలిసిపోయి వూరుకున్నాది. ఇస్కూల్‌ నుండి బయటికి వచ్చాం. మా ఈది మొత్తం నాకు అదో రకంగా కానొచ్చింది. రంగులు ఒలిసేసిన ఇల్లునాగ. గెడ్డ పూర్తిగా పొంగి పోయినట్టువుంది. ఈదిలోకి మోకాల్లోతు నీరు ఎక్కిపోయింది. సిన్నగా దాటుకొని మా ఇంటి దగ్గరికొచ్చాం. మా ఇల్లు నేదు.! కూలిపోయింది. మాయమ్మా నాయిన కూలిపోయిన ఇంటిని సూసి పల్లక నిలబడిపోయినారు. మాయన్న కూలిపోయిన గోడలమీద నించెల్లి ఆడిఇస్కూల్‌ బ్యాగు తెచ్చుకున్నాడు.  ఎక్కడి నుండి వచ్చిందో.. పిల్లి గొంతుకేసుకొని.. నాపక్కన నిలబడి ‘‘సెప్పానా శివ.. తిత్లీ తుపానమని. ఇగటమాడినావు. ఇపుడుసూడు..’’ అని దెప్పి పొడిచినట్టు ఎల్లిపోయింది ఐస్పర్య..ఉరఫ్‌ సీకాయ.. అలియాస్‌ సీకన్య.నాను మాత్రం కూలిపోయిన మా ఇంటిని సూస్తూ నిలబడ్డాను. ‘‘పాపిష్టి దాన్ని. పసిపాపడు నోరు తెరిసి అడిగితే కడుపునిండా నాలుగు దినుసులు పెట్టనేకపోయాను. ఇపుడు మన్నుల కలిసింది. ఈ పాపిష్టిదాని కడుపున ఎందుకు పుట్టినావురా నాయిన..’’ అని మాయమ్మ నాకు దగ్గిరికి తీసుకుంది.
·
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement