శ్రీకాకుళంలో నిరసనలు.. పాల్లొన్న భూమన కరుణాకరరెడ్డి
సాక్షి, పలాస/శ్రీకాకుళం : టిట్లీ తుపాను కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతోంటే సమీక్షల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయక చర్యలను ఆలస్యం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. సర్వం కోల్పోయిన ప్రజలు గుండెలు మండుతోంటే ఆ మంటల్లో కూడా చంద్రబాబు చలికాచుకుంటాడని విమర్శలు గుప్పించారు. తుపానుతో అల్లాడిపోయిన తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని పేర్కొంటూ జల్లాలోని ఉద్ధానం, కొత్తూరు జంక్షన్, పాతపట్నం, పలాసలో ప్రజలు ఆందోళనకు దిగారు. రోడ్లపై నిరసనలు, ధర్నాలు చేశారు. పలాసలోని సున్నాదేవి సెంటర్‌లో జరిగిన నిరసనలో భూమన పాల్గొన్నారు.
మూడు రోజులుగా అంధకారంలో మగ్గుతున్న ప్రజలకు కనీస సదుపాయలు కూడా కల్పించకపోవడం దారుణమని ఆయన నిప్పులు చెరిగారు. తుపాను బాధితులకు సాయం చేస్తామనే చంద్రబాబు ప్రకటనలు ఆయన చేసిన ఎన్నికల వాగ్దానాల తీరుగానే ఉన్నాయని ఎద్దేవా చేశారు. టిట్లీ తుపాను వచ్చిపోయిన మూడు రోజుల తర్వాత కూడా అధికారులు ప్రజలకు అందుబాటులో లేకపోవడంపై భూమనల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, ఆందోళనలకు దిగుతున్నారనీ, ఇది ముమ్మాటికీ చంద్రబాబు ప్రభుత్వ ప్రభుత్వ వైఫల్యేమేనన్నారు.
బాబు టెక్నాలజీ ఏమైంది?
బాధిత కుటుంబాలను ఆదోకోవడంలో కూడా చంద్రబాబు స్వలాభం చూసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిదీ ఎన్నికల దృష్టితో ఆలోచించే ముఖ్యమంత్రి అధికారుల సేవలు వినియోగించుకోవడం లేదని విమర్శించారు. అధికారులు పంటనష్టం అంచనాలు వేయకపోవడంతో రైతులు తీవ్ర వేదనకు గురవుతున్నారని అన్నారు. టెక్నాలజీ వాడుకోవడంలో నేనే నెంబర్‌వన్ అని చెప్పుకునే బాబు మూడు రోజులు గడిచినా విద్యుత్ పునరుద్ధరణకై చర్యలు తీసుకోకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంలో చంద్రబాబు టెక్నాలజీని వాడుకున్నట్టా? అని ప్రశ్నించారు.కాగా, పలాస-మందస హైవేపై రైతుల దర్నాతో వందలాది వాహనాలు నిలచిపోయాయి.
‘ప్రభుత్వం తీరు చూస్తుంటే.. తిండికోసం రాయలసీమలో గతంలో జరిగిన కరవుదాడులు గుర్తుకొస్తున్నాయి. ప్రజల ఆకలి తీర్చని రోజున రోడ్లపై నిలిచిన వాహనాలపై దాడులు చేసి మరీ ఆహారాన్ని తీసుకునే పరిస్థితి తలెత్తవచ్చు’ అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా... కొత్తూరు జంక్షన్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. తహసీల్దారును గ్రామస్తులు నిర్భందించారు. తమను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment