సాక్షి, శ్రీకాకుళం: గత ఎన్నికల సమయంలో ఈవీఎంలను తప్పుపట్టని చంద్రబాబు ఇప్పుడు ఈవీఎలంపై అనుమానం వ్యక్తం చేయడం హాస్యాస్పదమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. అప్పుడు లేని అనుమానం ఇప్పుడొచ్చిందా అని ప్రశ్నించారు. దేశంలో జరిగే ఎన్నికలు ఆక్షేపణకరమైనవి కావని, ఎన్నో ఏళ్లుగా సజావుగా జరుగుతున్నాయని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు అపనమ్మకం కలిగే విధంగా చంద్రబాబు ప్రయత్నించడం సరికాదన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎంల్లో లోపాలు ఉన్నాయని చంద్రబాబు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
దీనిపై శనివారం మీడియా సమావేశంలో ధర్మాన స్పందిస్తూ.. స్వర్థ ప్రయోజం కోసం చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు నచ్చిన వారిని ఎన్నుకునే హక్కు ప్రజాస్వామ్యం కల్పించిందన్నారు. రోజుకు రెండు మాటలు మాట్లాడే తత్వం చంద్రబాబుదని విమర్శించారు. 130 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన మరుసటి రోజే.. ఈవీఎంలు సరిగా పనిచేయలేదని అంటున్నారని గుర్తుచేశారు. చంద్రబాబు మాటలపై ఆయనకే నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల సంఘాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని ధర్మాన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment