టిట్లీ బాధితులతో మాట్లాడుతున్న కన్నా లక్ష్మీనారాయణ
సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శవాలమీద పెంకులేరుకోవాలనే ఆలోచనలు మానుకోవాలని ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం టిట్లీ తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించారాయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిట్లీ తుఫాన్ కారణంగా శ్రీకాకుళం తీవ్రంగా నష్టపోయిందన్నారు. జీడి, మామిడి, కొబ్బరి పంటలకు కోలుకోలేని నష్టం వాటిల్లిందని, పచ్చగా ఉండాల్సిన ప్రాంతం స్మశానంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్ నాధ్ సింగ్‌కు టిట్లీపై రిపోర్టు అందజేశామన్నారు.
హూద్ హుద్ కంటే ఎక్కువగా రైతుకు పెద్ద నష్టం కలిగిందని చెప్పారు. బీజేపీ తరుపున మృతుల కుటుంబాలకు 10 వేల రూపాయల ఆర్ధికసాయం చేస్తామని తెలిపారు. చంద్రబాబుకు రాజకీయాలు కావాలని.. తమకు సమస్యలు కావాలని పేర్కొన్నారు. రాజకీయాలతో ఈ ప్రాంతానికి లాభం జరగదని, కేంద్రం ఉదారంగా ఆదుకుంటుందని చెప్పారు. సీఎం తన ప్రచారం కోసం అధికారులను వెంటేసుకుని తిరుగుతున్నాడని అన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘తుఫాన్‌ను అడ్డం పెట్టుకుని ప్రచారం చేసుకోవద్దు. ఈరోజు పది గ్రామాల్లో పర్యటించా... ఆ గ్రామాల్లో ఎక్కడా తాగునీరు కూడా అందడం లేదు. నిజంగా నష్టపోయిన ప్రాంతాలకు ఏమీ అందడం లేదు.
సహయక చర్యలు తూతూ మంత్రంగానే సాగుతున్నాయి. ఇప్పటికైనా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు తాగునీరందించండి. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్రానికి ఇక్కడి పరిస్థితిని వివరిస్తా. మూడేళ్ల పాటు 300 రోజుల ఉపాధి హామీ పధకం అమలు చేయాలని కేంద్రాన్ని కోరతాం. ఇంతనష్టం జరిగినా ఇక్కడి పరిస్థితులపై తగినంత ప్రచారం జరగలేదు. గ్రామాల దత్తతకు పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలు ముందుకు రావాలి. కేంద్రంతో మాట్లాడి నష్టం అంచనా కోసం బృందాన్ని రప్పిస్తా’’మన్నారు.
Comments
Please login to add a commentAdd a comment