
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ (జీఈఈఎల్) చైర్మన్ పదవికి సుభాష్ చంద్ర రాజీనామా చేశారు. ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సంస్థ తెలిపింది. కంపెనీ ఎండీ, సీఈవోలతో చైర్‌పర్సన్‌కు బంధుత్వం వంటివి ఉండకూడదన్న సెబీ నిబంధనలకు లోబడి చంద్ర రాజీనామా చేసినట్లు జీఈఈఎల్ వివరించింది. ఆయన నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా కొనసాగుతారు. అలాగే బోర్డును పునర్‌వ్యవస్థీకరించినట్లు, కొత్తగా ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు (ఆర్ గోపాలన్, సురేంద్ర సింగ్, అపరాజిత జైన్) నియమితులైనట్లు పేర్కొంది. రుణాల భారం తగ్గింపునకు ప్రమోటర్ల వాటాలను మరింతగా విక్రయించేందుకు ఎస్సెల్ గ్రూప్ మార్గాలు అన్వేషిస్తున్న తరుణంలో చంద్ర రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది.