
ఫోన్ లాక్ తీసి చూడగా కుమార్తే అశ్లీల చిత్రాలు దర్శనమిచ్చాయి. ఇది చూసిన తండ్రి ఇంటికెళ్లి..
రాంచీ : ‘తప్పుడు పని’ చేసినందుకు మందలించిన తండ్రిపై లైంగిక కేసు పెట్టింది ఓ కూతురు. తన స్వేచ్ఛకు అడ్డువస్తున్నాడని, తనను బయటకు వెళ్లనివ్వడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొదటగా మానసికంగా హింసిస్తున్నాడని చెప్పిన యువతి.. మరుసటి రోజు వచ్చి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఈ దారుణ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ నగరంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంచీలో నివాసముంటున్న ఓ వ్యక్తి తన కూతురు ఫోన్ పాడవడంతో బాగు చేయించడానికి ఓ రిపేర్ షాప్‌కి తీసుకెళ్లాడు. అక్కడ ఫోన్ లాక్ తీసి చూడగా కుమార్తే అశ్లీల చిత్రాలు దర్శనమిచ్చాయి. దీంతో ఆగ్రహించిన తండ్రి.. ఇంటికెళ్లి కూతురిపై చేయి చేసుకున్నాడు. ఇకపై బయటకు వెళ్లేది లేదంటూ ఆంక్షలు విధించాడు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తల్లిని తోడుగా తీసుకెళ్లాలని షరతులు విధించాడు. దీంతో తండ్రిపై కోపం పెంచుకున్న యువతి.. తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ స్థానిక పోలీసులను ఆశ్రయించింది. అయితే తండ్రిపై రాత పూర్వకంగా ఫిర్యాదు చేయమని పోలీసులు సూచించగా.. అందుకు ఆమె నిరాకరించి వెళ్లిపోయింది.
మరుసటి రోజు మేనమామతో కలిసి వచ్చి తన తండ్రి తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ‘ యువతి ఫిర్యాదుపై అనుమానం ఉంది. మొదటగా మానసికంగా వేధిస్తున్నారని చెప్పిన యువతి.. మరుసటి రోజు వచ్చి లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. తండ్రితో కలిసి ఉండనని, మేనమామతో ఉంటానని చెప్పింది. ఆమె ఫిర్యాదుపై విచారణ చేపట్టాం. యువతి ఆరోపణలు నిజమైతే తండ్రిపై చర్యలు తీసుకుంటాం’ అని సీనియర్ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు.