
సాక్షి, కృష్ణాజిల్లా: తెలంగాణలో దొంగనోట్ల ముద్రిస్తున్న ముఠా గుట్టును కృష్ణాజిల్లా పోలీసులు రట్టు చేశారు. రెండు రోజుల కిందట ఆర్టీసీ బస్సులో కండక్టర్‌కు రవి అనే వ్యక్తి నకిలీ నోటు ఇచ్చి.. చెలామణి చేసేందుకు ప్రయత్నించాడు. అయితే, నకిలీ నోటును గుర్తించిన కండక్టర్.. ప్రయాణికుల సాయంతో నిందితుడిని పట్టుకొని.. స్థానికంగా ఉన్న కంచికచర్ల పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైనశైలిలో విచారించడంతో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టయింది.
సూర్యాపేట జిల్లాలోని కోదాడ సమీపంలోని మునగాలలో ఓ ఇంట్లో దొంగ నోట్లు ముద్రిస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. గుట్టుచప్పుడు కాకుండా దొంగనోట్లను ముద్రిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి స్కానర్ , ప్రింటర్లు, రూపాయలు విలువచేసే 47వేల దొంగనోట్లను కంచికచర్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.