ఎంసెట్-2 లీకేజీ కేసులో దోషులు తప్పించుకోలేరని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు.
హైదరాబాద్: ఎంసెట్-2 లీకేజీ కేసులో దోషులు ప్రభుత్వ చర్యల నుంచి తప్పించుకోలేరని, ఈ వ్యవహారంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రతీ అంశాన్ని అంటగట్టి వివాదాల్లోకి లాగడం సరికాదని ఆయన ప్రతిపక్షాలకు హితవు పలికారు.
శనివారం ఆయన టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, గత పాలకులు పెంచి పోషించిన లీకేజీ మాఫియా అవశేషాలు ఇంకా వెంటాడుతున్న కారణంగానే ఎంసెట్-2 లీకేజీ జరిగిందని, దీనికి కాంగ్రెస్ కూడా కారణమేనని పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకుని ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. దోషులను కఠినంగా శిక్షించడానికి పీడీ చట్టం కింద కేసులు నమోదు చే యాలనే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ఎంసెట్ -2 లీకేజీ వ్యవహరానికి ప్రతిపక్షాలు రాజకీయం చేయడాన్ని మానుకోవాల ని కర్నె ప్రభాకర్ హితవు పలికారు.