ఆంధ్రప్రదేశ్ సర్కార్ అడ్డగోలు దోపిడీకి పాల్పడుతోందని వైఎస్ఆర్ కీంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు నిప్పులు చెరిగారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సర్కార్ అడ్డగోలు దోపిడీకి పాల్పడుతోందని వైఎస్ఆర్ కీంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు నిప్పులు చెరిగారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టుల అంచనాలు పెంచేసి వేలకోట్ల దోపిడీకి చంద్రబాబు శ్రీకారం చుట్టారని జ్యోతుల నెహ్రు ధ్వజమెత్తారు. కేబినెట్ ఆమోదం పేరుతో రూ.6వేల కోట్ల దోపిడీకి తెర తీశారని ఆయన మండిపడ్డారు. ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తిరస్కరించినా... దారుణంగా దోచుకునేందుకు ఏపీ కేబినెట్ సిద్ధమైందని జ్యోతుల నెహ్రు విమర్శించారు.
నిబంధనలకు విరుద్ధమైన కార్యక్రమాన్ని తాము ఒప్పుకోమని ఇద్దరు సీఎస్లు చెప్పినప్పటికీ, మందబలాన్ని ఉపయోగించుకుని దోపిడీకి పాల్పడటం దారుణమన్నారు. చంద్రబాబు తన అనుచరులకు లబ్ధి చేకూర్చడమే ఈ దోపిడీ ఉద్దేశమన్నారు. ఆ దోపిడీని ప్రశ్నించిన తాము అభివృద్ధి నిరోధకులమంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. రాజకీయ అంచనాల పెంపుపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ఇకనైనా గొప్పలు చెప్పుకోవడం మానేసి వాస్తవాలు వెల్లడించాలని జ్యోతుల నెహ్రు డిమాండ్ చేశారు.