చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కొద్దిరోజుల్లో చేపట్టే భారత పర్యటనను గుజరాత్ నుంచి ప్రారంభించే అవకాశముంది. ఆయన భారత ప్రధాని నరేంద్రమోడీ స్వగ్రామమైన వాద్‌నగర్‌కు కూడా వెళ్తారని భావిస్తున్నారు.
* గుజరాత్ నుంచి భారత పర్యటన..
* జీ జిన్‌పింగ్‌తో భారత భద్రతా సలహాదారు దోవల్ భేటీ..
బీజింగ్: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కొద్దిరోజుల్లో చేపట్టే భారత పర్యటనను గుజరాత్ నుంచి ప్రారంభించే అవకాశముంది. ఆయన భారత ప్రధాని నరేంద్రమోడీ స్వగ్రామమైన వాద్‌నగర్‌కు కూడా వెళ్తారని భావిస్తున్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మంగళవారమిక్కడ జిన్‌పింగ్‌తో సమావేశమై, ఆయన పర్యటన షెడ్యూలును ఖరారు చేశారు. దీని వివరాలు తెలియకున్నా.. జిన్‌పింగ్ ఈ నెల 17న గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి పర్యటన ప్రారంభిస్తారని చైనా అధికారులు చెప్పారు.
వాద్‌నగర్‌లో పర్యటించాలని దోవల్ చైనా అధినేతను గట్టిగా కోరారు. ‘మీరంటే తనకెంతో గౌరవమని మోడీ మాకు చాలాసార్లు చెప్పారు. చైనా తత్వవేత్త హుయాన్ త్సాంగ్ వాద్‌నగర్‌కు వచ్చారని కూడా ఆయన మీకు చెప్పారు’ అని జిన్‌పింగ్‌తో అన్నారు. మోడీ పంపిన ఆహ్వాన లేఖను, ప్రత్యేక సందేశాన్ని అందించారు. జిన్‌పింగ్‌ను తన ఊరికి తీసుకెళ్తానని మోడీ ఆయనకు చెప్పారని, ఆయన వాద్‌నగర్ పర్యటన సమయం షెడ్యూలు తదితరాలపై ఆధారపడి ఉంటుందని తర్వాత మీడియాకు చెప్పారు.
చైనా నేత పర్యటనను రేపోమాపో ప్రకటిస్తామన్నారు. విదేశీనేతలను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లాలని మోడీ అంటున్నారని, ఇది అందులో భాగమేనని పేర్కొన్నారు. శక్తిమంతులైన మోడీ, జిన్‌పింగ్‌లు సరిహద్దు వివాదాలనికి పరిష్కారం కనుక్కోగలరని, ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నతస్థాయికి తీసుకుపోగలరని అన్నారు. కాగా, తన పర్యటన ఖరారు కోసం దోవల్ బీజింగ్ రావడం చైనాతో సంబంధాలకు భారత్, మోడీ ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమని జిన్‌పింగ్ దోవల్‌తో అన్నారు. భారత పర్యటన కోసం ఎదురు చూస్తున్నానని, ఆ దేశ విజయాలను అవగాహన చేసుకోవడానికి పర్యటన తోడ్పడుతుందని పేర్కొన్నారు. జిన్‌పింగ్ ఈ నెల 14-19 మధ్య మాల్దీవులు, శ్రీలంక, భారత్‌లలో పర్యటిస్తారని చైనా విదేశాంగ తెలిపింది. ఆయన 17న నేరుగా అహ్మదాబాద్ చేరుకుని, మోడీ అతిథ్యం స్వీకరించి, అనంతరం ఢిల్లీ వెళ్తారని సమాచారం.