
వాహన పర్మిట్ల రెన్యువల్ గడువు పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న క్రమంలో నిత్యావసర వస్తువుల సరఫరాకు విఘాతం కలగకుండా వాహన పర్మిట్ల వ్యాలిడిటీ గడువును జూన్ 30 వరకూ కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. డ్రైవింగ్ లైసెన్సులు, పర్మిట్లు, రిజిస్ర్టేషన్ పత్రాల చెల్లుబాటు వ్యవధిని ఫిబ్రవరి 1 నుంచి జూన్ 30 వరకూ పొడిగించినట్టు కేంద్రం పేర్కొంది. ఈ డాక్యుమెంట్ల వ్యాలిడిటీని జూన్ 30గా పరిగణించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఉపరితల రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ రవాణా కార్యాలయాలు మూతపడటంతో మోటార్ వాహనాల చట్టం, కేంద్ర మోటార్ వాహనాల నిబంధనలకు అనుగుణంగా ఆయా డాక్యుమెంట్ల రెన్యువల్‌లో ఎదురువుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. దేశమంతటా నిత్యావసర సరుకులు, వస్తువులు నిరాటంకంగా సరఫరా అయ్యేందుకు ఈ మార్గదర్శకాలను విధిగా అమలుపరచాలని మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.