
దినదిన గండం నూరేళ్ల ఆయుష్షుగా సాగింది కోవిడ్ కాలం! నిజంగానే ఫ్రంట్‌లైన్ వారియర్స్ ధైర్యంగా మనకు అండగా నిలబడకపోయుంటే ఎలా ఉండేదో మన జీవనం!
ఆ టాస్క్‌లో వైద్యులది కీలకపాత్ర. ట్రాన్స్‌పోర్టేషన్ దగ్గర్నుంచి మందుల దాకా ఎదురైన సమస్యలన్నిటినీ పరిష్కరించుకుంటూ తమను తాము మోటివేట్ చేసుకుంటూ స్టాఫ్‌ని ముందుకు నడిపిస్తూ పేషంట్స్‌కి భరోసా ఇచ్చి, ప్రభుత్వ ఆసుపత్రుల గౌరవాన్ని పెంచిన డాక్టర్లలో హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ అప్పటి సూపరింటెండెంట్.. ఇప్పుడు మహేశ్వరం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ ఒకరు. ఆ రోజులను గుర్తుచేసుకుంటూ ఆయన చెప్పిన విషయాలు..
‘‘కోవిడ్ ప్రకృతి వైపరీత్యంలా వచ్చింది. దీని గురించి ప్రజలకే కాదు.. డాక్టర్స్‌కీ అవగాహన లేదప్పుడు. నేనప్పుడు ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా ఉన్నాను. గాంధీ హాస్పిటల్‌ని కోవిడ్ హాస్పిటల్‌గా మార్చారు. అందుకని జనరల్ పేషంట్స్ అందరూ ఉస్మానియా కే వచ్చేవాళ్లు. వాళ్లకు కోవిడ్ ఉండొచ్చు.. లేకపోవచ్చు. టెస్ట్‌లో వాళ్లకు కోవిడ్ నిర్ధారణైతే గాంధీకి పంపేవాళ్లం. అప్పటికే అది ఎందరికో వ్యాపించేసేది.
ఏదో ఒక జబ్బుతో వచ్చిన వాళ్లకు కోవిడ్ అని తేలితే కోవిడ్‌తో పాటు వాళ్లకున్న జబ్బుకూ ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సి వచ్చేది. ఉదాహరణకు అపెండిక్స్‌తో జాయిన్ అయిన వాళ్లకు కోవిడ్ అని తేలితే వాళ్లను గాంధీకి పంపలేకపోయేవాళ్లం. ఎందుకంటే గాంధీలో అప్పుడు అపెండిక్స్ ట్రీట్‌మెంట్ లేదు.. కేవలం కోవిడ్‌కే! దాంతో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ఆ పేషంట్‌కి ఉస్మానియాలోనే అపెండిక్స్‌కి ట్రీట్‌మెంట్ ఇచ్చేవాళ్లం. ఈ మొత్తం సర్వీస్‌లో నర్సింగ్ స్టాఫ్, శానిటేషన్ సిబ్బందిని అప్రిషియేట్ చేయాలి. వాళ్లు చాలా ధైర్యంగా నిలబడ్డారు.
మా బలాన్ని పెంచింది..
లాక్‌డౌన్ ఎంత గడ్డు పరిస్థితో అందరికీ తెలుసు. రవాణా కూడా ఉండేది కాదు. హాస్పిటల్ స్టాఫ్ చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అందుకే వాళ్లకోసం ఆర్‌టీసీ సంస్థ వాళ్లతో మాట్లాడి స్పెషల్ బస్‌లు, పాస్‌లను ఏర్పాటు చేయించాం. ఫుడ్ కూడా సమస్య కూడా ఉండేది. కొన్ని మందుల కొరత వల్ల దొంగతనాలూ జరిగేవి. అన్ని సమస్య ల్లో.. అంత కోవిడ్ తీవ్రతలోనూ సర్జరీలు చేశాం. సరైన చికిత్స చేస్తూ రోగులకు ఇబ్బందుల్లేకుండా చూసుకోగలిగాం. ముగ్గురు పేషంట్లకు న్యూరో సర్జరీ అయిన వెంటనే కోవిడ్ సోకింది. వాళ్లను ఆరోగ్యవంతులను చేసి పంపాం.
చికిత్సతోపాటు కౌన్సెలింగ్ చేస్తూ వాళ్లకు ధైర్యమిచ్చే వాళ్లం. పేషంట్స్ చూపించిన కృతజ్ఞత మా స్ట్రెంత్‌ను పెంచింది. ఐసీయూలో పేషంట్లను చూస్తుండటం వల్ల నాకూ కోవిడ్ వచ్చింది. గాంధీలో అడ్మిట్ అయ్యాను. తీవ్రమయ్యేసరికి నిమ్స్ లో చేరాల్సి వచ్చింది. నా పక్క బెడ్ అతని కండిషన్ సడెన్‌గా సీరియస్ అయి చనిపోయాడు. చాలా డిస్టర్బ్ అయ్యాను. నేను వీక్ అయితే నా స్టాఫ్ కూడా వీక్ అయిపోతారని నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. డిశ్చార్జ్ అవగానే డ్యూటీలో చేరాను. వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి అందరూ భయపడుతుంటే నేనే ముందు వ్యాక్సిన్ తీసుకుని మిగతావాళ్లను మోటివేట్ చేశాను.
సమర్ధంగా, సమన్వయంతో పనిచేసి...
కోవిడ్ టైమ్‌లో మేము అందించిన సేవలతో ప్రభుత్వ ఆస్పత్రులకి మంచి పేరొచ్చింది. గౌరవం పెరిగింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశం కోవిడ్ పరిస్థితులను చక్కగా మేనేజ్ చేసింది. వైద్యరంగం, పోలీస్ వ్యవస్థ, మున్సిపల్ కార్పొరేషన్, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సమన్వయంతో పనిచేయడం వల్ల సమర్థంగా కోవిడ్ సిట్యుయేషన్‌ను ఎదుర్కొన్నాం. కోవిడ్‌ను మానవ చరిత్రలో ఒక అధ్యాయంగా చెప్పుకోవచ్చు. గుణపాఠంగా మలచుకోవచ్చు. ఆరోగ్యాన్ని మించింది లేదని కరోనా మహమ్మారి నిరూపించింది. శుభ్రత నేర్పింది. మంచి జీవనశైలి అవసరాన్ని తెలియజెప్పింది. మానవ సంబంధాల విలువ చూపించింది’’ అంటూ నాటి గడ్డు రోజులను తాను అధిగమించిన తీరును గుర్తు చేసుకున్నారు డాక్టర్ నాగేందర్.
– సరస్వతి రమ