
అన్న, వదినలు చేతులతో మోసుకుంటూ..
దేశంలోని మారుమూల గ్రామాల పరిస్ధితి ఎంత దారుణ స్ధాయికి దిగజారిందో తెలిపే మరో సంఘటన జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో వెలుగుచూసింది.
రాంచీ: దేశంలోని మారుమూల గ్రామాల పరిస్ధితి ఎంత దారుణ స్ధాయికి దిగజారిందో తెలిపే మరో సంఘటన జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో వెలుగుచూసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించిన వ్యక్తి శవాన్ని శ్మశానవాటికకు తరలించేందుకు అంబులెన్స్ పంపడానికి ఆసుపత్రి నిరాకరించింది. దీంతో అతని అన్న, వదినలు రెండు చేతులతో మోసుకుని తీసుకెళ్లారు.
జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఛత్రా జిల్లాలోని సిడ్పా గ్రామానికి చెందిన రాజేంద్ర ఒరాన్‌ను పాము కాటేసింది. దీంతో అతన్ని వైద్యం కోసం ఛత్రా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు ఒరాన్. సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకువచ్చినా.. వైద్యులు స్పందించకపోవడంతో ఒరాన్ మరణించాడని గ్రామస్ధులు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
శవాన్ని తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వాలని ఆసుపత్రిని కోరగా వారు అందుకు నిరాకరించారు. దీంతో మరణించిన సోదరుడిని అతని అన్న, వదినలు చేతులతో మోసుకుని వెళ్లారు. ఈ ఘటనను చూసిన స్ధానికులు చలించిపోయారు. వీపుకు బిడ్డను కట్టుకుని మరిదిని మోసుకెళ్తున్న ఆమెను చూసిన కొందరు కన్నీళ్ల పర్యంతమయ్యారు. వారితో కలిసి శ్మశానికి వెళ్లి అంత్యక్రియలకు సాయం చేశారు. కాగా, కొద్ది నెలల క్రితం ఇదే ప్రాంతంలో ఓ గర్భిణీకి వైద్యసాయం నిరాకరించడంతో రోడ్డు పక్కనే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. శవాన్ని తీసుకువెళ్లడానికి అంబులెన్స్ నిరాకరించిన వైద్యులను సస్పెండ్ చేస్తూ జార్ఖండ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.