
నిర్భయ దోషుల ఉరి అమలు వాయిదా పడటంపై దేశ ప్రజలు ఇప్పటికే అసహనంతో ఉన్నారని కేంద్రం తరపు లాయర్ తుషార్ మెహతా కోర్టులో వాదించారు.
న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఉరిశిక్ష జాప్యం కావడం పట్ల కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. నిర్భయ దోషుల ఉరి అమలు వాయిదా పడటంపై దేశ ప్రజలు ఇప్పటికే అసహనంతో ఉన్నారని కేంద్రం తరపు లాయర్ తుషార్ మెహతా కోర్టులో వాదించారు. చట్టంలో ఉన్న లొసుగుల కారణంగా దోషులు న్యాయవ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని పేర్కొన్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయంలో కలుగజేసుకుని.. నిర్భయకు న్యాయం జరిగే విధంగా చట్టాల్లో మార్పులు చేయాలని కోరారు. దోషులు ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్‌ను విడివిడిగా ఉరి తీయాలని అన్నారు. ఈమేరకు దోషులకు నోటీసులు జారీ చేయాలని విఙ్ఞప్తి చేశారు.
(చదవండి : నిర్భయ కేసు.. ప్రస్తుత స్థితి)
కాగా, వాదనలు విన్న జస్టిస్ ఆర్.భానుమతి నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. కేంద్రం అభ్యర్థనను స్వీకరించిన పక్షంలో శిక్ష అమలు ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణ మంగళవారం (ఫిబ్రవరి 11) వాయిదా వేసింది. ఇక నిర్భయ దోషులు ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్‌ను విడివిడిగా కాకుండా అందరికీ ఒకేసారి శిక్ష అమలుచేయాలని ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 5న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
(చదవండి : ఉరి.. అందరికీ ఒకే సారి)