
నింగిలోకి దూసుకెళ్లి పీఎస్‌ఎల్‌వీ-సీ41 రాకెట్
శ్రీహరికోట : పీఎస్‌ఎల్‌వీ సీ41 రాకెట్ ప్రయోగం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి గురువారం వేకువజామున 4.04 గంటలకు రాకెట్ ప్రయోగం జరిగింది. 19.19 నిమిషాల తర్వాత రాకెట్ లక్ష్యాన్ని చేరుకుంది. నాలుగు దశల అనంతరం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహం నిర్ణయించిన సమయానికి విడిపోయి కక్ష్యలోకి ప్రవేశించింది. గతేడాది ఆగస్టు 31న పంపిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ఉపగ్రహం విఫలం కావడంతో దాని స్థానంలో గురువారం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహాన్ని పంపారు. ఇది విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. దేశీయ దిక్సూచి వ్యవస్థ కింద ఇప్పటికే 8 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది.
వచ్చే 8 నెలల్లో 9 ప్రయోగాలు చేస్తామని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. జీఎస్‌ఎల్‌వీ మార్క్3 ద్వారా కమ్యునికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామని , ఈ ఏడాది చివరిలో చంద్రయాన్-2 ప్రయోగం ఉంటుందని వివరించారు. దేశీయ నావిగేషన్ సేవల కోసం త్వరలోనే యాప్‌ను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. యాప్‌డౌన్‌లోడ్ ద్వారా వాతావరణ హెచ్చరికలు మత్స్యకారులకు చేరనున్నాయని వివరించారు. విపత్తు నిర్వహణ, వాహనాల గమనాన్ని పరిశీలించేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. ఈ ఉపగ్రహం ద్వారా సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులకు చాలా ఉపయోగం కలగనుంది. ఈ ఉపగ్రహం వల్ల దృశ్య, వాయిస్ దిక్సూచి సేవలు అందుబాటులోకి రానున్నాయి.
రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల వైఎస్సాసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు తన తరపున అభినందనలు తెలియజేశారు. భవిష్యత్‌లో మరిన్ని ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.