
న్యూఢిల్లీ: దేశంలో అమలైన నాలుగు విడతల లాక్‌డౌన్ విఫలమైందనీ, ప్రధాని మోదీ ఊహించిన ఫలితాలనివ్వలేదనీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశాన్ని పునఃప్రారంభించేందుకు కేంద్రం దగ్గరున్న వ్యూహం ఏమిటో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. లాక్‌డౌన్ లేని సమయంలో ప్రభుత్వం అస్తవ్యస్తంగా పనిచేయడం వల్ల అత్యంత వినాశన కరమైన రెండో దశ కరోనా మహమ్మారిని ఎదుర్కోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. పేద ప్రజల చేతికి డబ్బులు ఇవ్వకపోతే దేశంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్న రాహుల్.. రాష్ట్రాలకూ, వలసకూలీలకు కేంద్రం ఏం చేయాలనుకుంటోందో తెలుసుకోవాలనుకుంటున్నానని అన్నారు. లాక్‌డౌన్ లక్ష్యం నెరవేరకపోగా 60 రోజుల అనంతరం కూడా వైరస్ వ్యాప్తిచెందుతోందన్న విషయం స్పష్టమేనని రాహుల్ వ్యాఖ్యానించారు.