
రాంచీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఆసీస్ నిర్దేశించిన 314 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత జట్టు 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ వికెట్లతో పాటు అంబటి రాయుడు వికెట్‌ను కూడా భారత్ చేజార్చుకుంది. ధావన్(1) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా, రోహిత్ శర్మ(14) రెండో వికెట్‌గా ఔటయ్యాడు.
రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో ధావన్ ఔట్ కాగా, ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో రోహిత్ ఎల్బీగా పెవిలియన్ బాట పట్టాడు. అటు తర్వాత రాయుడు(2)ను కమిన్స్ బౌల్డ్ చేశాడు. దాంతో టీమిండియా కష్టాల్లో పడింది. అంతకుముందు ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఖాజా (104; 113 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించగా, ఫించ్(93; 99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. వీరికి జతగా మ్యాక్స్‌వెల్ (47), స్టోయినిస్( 31 నాటౌట్), క్యారీ( 21 నాటౌట్)లు బాధ్యతాయుతంగా ఆడటంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది.