
తొలిరోజే బోసిపోయిన అమ్మ బైక్ పథక శిబిరం
పళ్లిపట్టు: అమ్మ బైక్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ముందుగా మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన కారణంగా సోమవారం ప్రారంభమైన వినతిపత్రాల స్వీకరణ శిబిరాలు బోసిపోయాయి. ఫిబ్రవరి 24న జయలలిత జయంతి పురస్కరించుకుని ప్రయివేటు ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు 50 శాతం సబ్సిడీతో బైకులు అందజేసే పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం సోమవారం నుంచి ఫిబ్రవరి ఐదు వరకు ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేసే శిబిరాలు ఏర్పాటు చేశారు.
వినతిపత్రాలు సమర్పించే మహిళలు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగిఉండాడాలనే నిబంధనల కారణంగా పలువురు దరఖాస్తులను పొందేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. దీంతో శిబిరాలు వెలవెలబోయాయి. సబ్సిడీతో బైకులు అందజేస్తామని ఆశచూపి, చివరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ప్రయివేటు సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న సర్టిఫికెట్లు, 40ఏళ్ల లోపు ఉండాలి వంటి ఆంక్షలు విధించడంతో ఎవరికి బైకులు ఇస్తారో చెప్పాలని మహిళలు ప్రశ్నిస్తున్నారు.